ఘన స్వాగతం.. జీవితంలో మర్చిపోలేని రోజు.!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి.. ప్రస్తుతం ఇండియాకి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి.. ప్రస్తుతం ఇండియాకి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. తాజాగా జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో పాల్గొని.. ఏకంగా నాలుగు పతకాలు అందుకుంది. ఇక ప్రగతి తన విజయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తెగ సంబరపడిపోతోంది. అంతేకాదు ప్రగతి ఇండియాకి రావడంతో.. చాలామంది ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ప్రగతి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఈ వీడియోలో ప్రగతి జాతీయ జెండాను పట్టుకొని తెగ సంబరపడిపోతోంది. అలాగే ఆమె చుట్టూ ఉన్నవాళ్లు ఆమెపై పువ్వులు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా పాటలకు స్టెప్పులు వేస్తూ మెడలో పతకాలు వేసుకొని తెగ మురిసిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియోకి " నా జీవితంలో నిజమైన విజయం ఏమిటంటే.. నన్ను ప్రేమించే వారు.. నా పట్ల గర్వపడేవారు.. నా జీవితంలో.. నా ప్రతి అడుగులోనూ నాతో ఉన్నవారు.
నా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునేవారు.. నేను విజయం సాధించి ఇంటికి వచ్చినప్పుడు నాకు లభించే స్వాగతం ఇది.. నా జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోయింది" అంటూ ప్రగతి పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతేకాకుండా చాలామంది ప్రగతి సాధించిన విజయాలను చూసి గర్వపడడమే కాకుండా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నారు.
ప్రగతి అంటే సినిమాల్లో హోమ్లీ పాత్రలు చేసుకునే నటి అని అందరూ అనుకున్నారు. కానీ ప్రగతిలో ఉన్న ఈ టాలెంట్ ఎవరికి తెలియదు. అలా గత రెండు మూడు సంవత్సరాలు నుండి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ పలు పోటీలలో పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్స్ ను అందుకుంది.అలా తాజాగా జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 లో కూడా పాల్గొని డెడ్ లిఫ్ట్ విభాగంలో గోల్డ్ మెడల్, స్క్వాట్, బెంచ్ ప్రెస్ రెండు విభాగాల్లో సిల్వర్ మెడల్ అందుకుంది. ఇక ఓవరాల్ గా సిల్వర్ మెడల్ గెలుచుకున్నట్టు ప్రగతి చెప్పుకొచ్చింది. అలా నాలుగు మెడల్స్ సాధించి భారతదేశానికి గొప్ప పేరు తీసుకు వచ్చింది.
ప్రగతి కెరియర్ విషయానికి వస్తే.. నెల్లూరు జిల్లాలోని ఉలవపాడులో జన్మించిన ప్రగతి.. సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ తండ్రి చనిపోవడంతో డబ్బు కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారింది. ఆ తర్వాత కాలేజీ డేస్ లో మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఓ యాడ్ లో నటించింది. ఆ తర్వాత తమిళంలో 1994లో వచ్చిన వీట్ల విశేషాంగా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. అలా కెరీర్ మొదలుపెట్టిన ప్రగతి ఆ తర్వాత తెలుగు, తమిళ,మలయాళ సినిమాల్లో తల్లిగా.. అత్తగా.. అక్కగా.. వదినగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషించింది.