ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ.. టాలీవుడ్ లో ఇదే తొలిసారి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. అంతా ఫిక్స్ అయిపోయారు. కొన్ని రోజుల క్రితం సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ హింట్ కూడా ఇచ్చారు.
అయితే బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో వర్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబోలో బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని టాక్ వచ్చింది. కానీ ఇంతలో రణవీర్ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఆ మైథలాజికల్ స్టోరీనే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చి, ప్రశాంత్ వర్మ ఇప్పుడు తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై స్పష్టత లేకపోయినా అదే నిజమని తెలుస్తోంది. ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ ఆ సినిమాను నిర్మిస్తుందని సమాచారం. ఇప్పటికే ఆ బ్యానర్.. ప్రభాస్ తో మూడు సినిమాలు ఉంటాయని ప్రకటించింది.
దీంతో భవిష్యత్తులో ప్రభాస్- వర్మ- హోంబలే ప్రాజెక్టు ఉండడం కన్ఫర్మే. అయితే పెద్ద పెద్ద సినిమాలకు ముందే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడంతోపాటు 60 శాతం వీఎఫ్ఎక్స్ పనులను విజువలైజ్ చేయడం ముఖ్యమనే చెప్పాలి. అలా చేయకపోతే నిర్మాతలకు భారంగా మారుతుంది. ప్రాజెక్టు విషయంలో అనివార్యమైన ఆలస్యం కూడా అవుతుంది.
ఇప్పుడు ప్రభాస్ సినిమాలో అలాంటివేం జరగకుండా ప్రశాంత్ వర్మ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ విజువలైజేషన్ పనులు ఇప్పటికే కంప్లీట్ చేశారని సమాచారం. అనేక సన్నివేశాలు, షాట్లు, ఫ్రేమ్ లకు ప్రీ విజువలైజేషన్ చేసినట్లు వినికిడి. నెవ్వర్ బిఫోర్ అనేలా సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఓ టాలీవుడ్ సినిమాకు ఇంత పెద్ద ఎత్తున ప్రీ విజువలైజేషన్ ఇదే తొలిసారి అని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రశాంత్ వర్మ ఎంత కొత్తగా ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోంది. అదే సమయంలో ప్రభాస్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి కంప్లీట్ అయ్యాక వర్మతో వర్క్ చేస్తారని తెలుస్తోంది. ఇంతలో ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో వర్మ ఉన్నారు. త్వరలో అన్ని వివరాలను షేర్ చేసుకోనున్నారట.