సీనియర్లకే షాకిస్తున్న 'పెద్ది' ప్రొడ్యూసర్ ప్లానింగ్!
కేవలం ప్రెస్ మీట్లలో కూర్చోవడమే కాకుండా, తానే స్వయంగా ముందుండి ప్రాజెక్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న 'పెద్ది' సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా చుట్టూ జరుగుతున్న హడావుడి చూస్తుంటే ఒక భారీ సినిమాకు ఉండాల్సిన ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ జనాలను అత్యంత ఆశ్చర్యపరుస్తున్న ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నిర్మాత వెంకట సతీష్ కిలారు మాత్రమే. బ్యాకప్ లో మైత్రి ఉన్నప్పటికీ మెయిన్ ప్రొడ్యూసర్ గా మొదటిసారి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు.
సాధారణంగా ఈ రోజుల్లో సీనియర్ నిర్మాతలు సైతం ఒక పాన్ ఇండియా సినిమా తీస్తే కేవలం వెనక ఉండి డబ్బులు పెట్టడానికే పరిమితం అవుతున్నారు. ప్రమోషన్ల కోసం ఫేస్ చూపించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. కానీ సతీష్ కిలారు మాత్రం ఆ పాత పద్ధతులకు స్వస్తి పలికారు. సినిమా నిర్మాణంలోనే కాకుండా, ప్రమోషన్స్ లోని ప్రతీ ఈవెంట్ కు స్వయంగా హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
కేవలం ప్రెస్ మీట్లలో కూర్చోవడమే కాకుండా, తానే స్వయంగా ముందుండి ప్రాజెక్ట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నారు. మొన్న ముంబైలో జరిగిన బాలీవుడ్ మీడియా మీట్ లో ఆయన చూపించిన కాన్ఫిడెన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఫిదా చేసింది. అక్కడి హిందీ మీడియా టోన్ కు తగ్గట్టుగా, పెద్ది సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
అలాగే భోపాల్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం ఆయన చేసిన ఖర్చు, ప్లాన్ చేసిన విధానం చూస్తే సినిమా కోసం ఎంత గట్టిగా ఇన్వెస్ట్ చేస్తున్నారో అర్థమవుతోంది. కేవలం బ్యాక్ సైడ్ డబ్బులు పెట్టడమే కాకుండా, ప్రతీ ఫ్రేమ్ లోనూ ఈవెంట్ లోనూ ఒక ప్యాషన్ ఉన్న నిర్మాతగా ఆయన హైలైట్ అవుతున్నారు. ఇక బెంగళూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో కూడా ఆయన తన జెన్యూన్ మాటలతో కన్నడ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.
ఈ సినిమా అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తూ, రామ్ చరణ్ ఈ పాత్ర కోసం పడిన కష్టాన్ని హైలెట్ చేశారు. ఒక పవర్ఫుల్ అథ్లెట్ గా కనిపించడం కోసం చరణ్ ఏకంగా మూడు సార్లు మేకోవర్ మార్చారని, షూటింగ్ లో ఎన్నో గాయాలు అయినా లెక్కచేయకుండా ప్రాణం పెట్టి చేశారని సతీష్ కిలారు వెల్లడించారు. కన్నడ లెజెండ్ శివరాజ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ లో ఉండటం సినిమాకు ప్లస్ అని ఆయన కొనియాడారు.
సతీష్ కిలారు చేస్తున్న ఈ హడావుడి కేవలం పెద్ది సినిమా కోసమే కాదు, ఆయన భవిష్యత్తు పాన్ ఇండియా రూట్ కు ఇది ఒక పెద్ద పునాది అని చెప్పవచ్చు. మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, మీడియా వర్గాలతో ఆయనకు ఒక బలమైన నెట్వర్క్ క్రియేట్ అవుతోంది. ఈ పక్కా ప్లానింగ్ వల్ల బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు సతీష్ కిలారు పేరు గట్టిగానే రిజిస్టర్ అవుతోంది. ఇక పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.