'పాపం ప్రతాప్' మూవీ రివ్యూ
'పాపం ప్రతాప్' మూవీ రివ్యూ
నటీనటులు: తిరువీర్ - పాయల్ రాధాకృష్ణ - రాశి - అజయ్ ఘోష్ - రఘుబాబు - గోపరాజు రమణ - దేవి ప్రసాద్ - రూప లక్ష్మి - ప్రసాద్ బెహరా- రవి ఆంటోనీ- అనంత్ తదితరులు
సంగీతం: కేఎం రాధాకృష్ణన్
నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: విశ్వేశ్వర్
నిర్మాతలు: గడ్డం రాకేష్ రెడ్డి - రుద్రదేవ్ మాదిరెడ్డి
రచన దర్శకత్వం: ఎస్.పి.దుర్గా నరేష్
నటుడిగా తక్కువ సమయంలో మంచి పేరు స్పందించాడు తిరువీర్. ఐతే హీరోగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న అతడికి గత ఏడాది 'ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో'తో ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన వసూళ్లు రాలేదు. మరి తిరువీర్ కొత్త చిత్రం 'పాపం ప్రతాప్' అతను కోరుకున్న విజయాన్ని అందించిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
ప్రతాప్ (తిరువీర్) ఆంధ్ర ప్రాంతంలో ఒక పల్లెటూరికి చెందిన కుర్రాడు. అతను యుక్త వయసు నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను పెళ్లి చేసుకుంటాడు. ప్రతాప్ తండ్రికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లి అతడికి నచ్చిన పెళ్ళి చేస్తుంది. ఐతే ప్రతాప్ అంటే ఎంతో నచ్చి పెళ్లి చేసుకున్న బుజ్జమ్మ కొన్ని రోజులకే భర్తను విడిచి వెళ్ళిపోతుంది. కానీ అందుకు కారణం ఏంటో మాత్రం చెప్పదు. ప్రతాప్ లో ఒక సమస్య ఉందని.. అదేంటో తనే తెలుసుకుని పరిష్కరించుకున్నాకే తిరిగి వస్తానని అంటుంది బుజ్జమ్మ. ఇంతకీ ప్రతాప్ సమస్య ఏంటి.. దానికి కారణమేంటి.. ఆ సమస్యను సాల్వ్ చేసుకుని బుజ్జమ్మను అతను తిరిగి కాపురానికి తెచ్చుకోగలిగాడా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
కొన్ని కథలు ఐడియా వరకు భలేగా అనిపిస్తాయి. కానీ ఆ ఐడియా చుట్టూ అర్థవంతమైన కథ.. ఆసక్తికర కథనం తోడైతేనే అవి తెరపై మెరుస్తాయి. కేవలం ఐడియా వరకే ఎగ్జైట్ అయిపోయి.. దాని చుట్టూ ఏదో ఒకటి పేర్చేద్దామని చూస్తే ఆశించిన ఫలితం దక్కదు. ‘పాపం ప్రతాప్’ విషయంలో అదే జరిగింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా.. అవన్నీ చిన్న స్థాయివే అయినా.. విభిన్న కథలతో ప్రయాణం చేయడం.. మంచి పెర్ఫామర్ గా గుర్తింపు సంపాదించడంతో తిరువీర్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే నమ్మకం ఒక వర్గం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ‘పాపం ప్రతాప్’ కథ కూడా తిరువీర్ ప్రత్యేకతను చాటేదే. అతను ఈ కథ విని ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఆసక్తి రేకెత్తించేదే. కానీ లఘు చిత్రం స్థాయిలో చెప్పాల్సిన కథను మెయిన్ స్ట్రీమ్ మూవీ కోసం సాగదీశారా అన్నట్లుగా కథనాన్ని నడిపించిన విధానమే ‘పాపం ప్రతాప్’కు పెద్ద సమస్య. హీరోకు ఉండే ఒక ‘సమస్య’ గురించి ట్రైలర్ కట్ చేసిన విధానం.. ప్రమోషన్లు చేసిన తీరు బాగున్నా.. సినిమాలో ఆ సమస్యను కన్విన్సింగ్ గా.. షార్ప్ గా ప్రెజెంట్ లేకపోవడంతో ‘పాపం ప్రతాప్’ ప్రేక్షకులను అనుకున్నంతగా ఎంగేజ్ చేయలేకపోయింది.
హీరోకు ఆరోగ్యం పరంగా ఏదో ఒక సమస్య పెట్టి దాని చుట్టూ వినోదాన్ని పండిస్తూ.. కొంతమేర భావోద్వేగాలను కూడా జోడించి మెప్పించడం టాలీవుడ్లో మారుతి తీసుకొచ్చిన ట్రెండు. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు మారుతి భలేగా ఎంటర్టైన్ చేశాడు. కొంచెం బోల్డ్ కాన్సెప్ట్ తీసుకుని కార్తీక్ రాపోలు అనే మరో యంగ్ డైరెక్టర్ ‘ఏక్ మిని కథ’ అనే సినిమాతో మెప్పించాడు. ఇప్పుడు కొత్త దర్శకుడు దుర్గా నరేష్ కూడా ఇలాంటి ఓ సమస్యనే తీసుకుని వినోదం.. భావోద్వేగాలను పండించాలని చూశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నట్లు కూడా అతను టైటిల్స్ లో వెల్లడించాడు. ఐతే ఎవరి జీవితంలోనో ఈ దర్శకుడు చూసిన విషయం క్రేజీగా అనిపించొచ్చు కానీ.. ఆ ఐడియా చుట్టూ సినిమాకు అవసరమైనంత మేర డ్రామాను జోడించడం.. కామెడీ సిచువేషన్లు క్రియేట్ చేయడం.. వాటితో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలోనే రచయితలు-దర్శకుల నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ‘పాపం ప్రతాప్’కు రైటర్ కమ్ డైరెక్టర్ అయిన దుర్గా నరేష్ కొన్ని సన్నివేశాల వరకు ఆ నైపుణ్యం చూపించగలిగాడు కానీ.. ఓవరాల్ గా సినిమాను అంత వినోదాత్మకంగా నడిపించలేకపోయాడు. భావోద్వేగాలనూ పండించలేకపోయాడు.
‘పాపం ప్రతాప్’లో హీరో సమస్యేంటో తెలిసే ఎపిసోడ్.. చివర్లో ఆ సమస్య పతాక స్థాయికి వెళ్లే సన్నివేశాలు.. చివరగా చూపించిన పరిష్కారం.. వీటి వరకు ఆకట్టుకుంటాయి. కానీ అక్కడక్కడా ఒక సీన్ బాగుంటే సరిపోదు కదా? కథాకథనాలు మొత్తంగా బిగితో ఉండాలి. సినిమా ఒక ఫ్లోతో సాగాలి. కానీ అలా జరగకపోవడమే సమస్య. హీరో సమస్య చుట్టూ ఆర్గానిగ్గా వినోదం పండించడానికి అవకాశమున్నా.. సరైన కామెడీ సిచువేషన్లు క్రియేట్ చేయకపోవడంతో కామెడీ వర్కవుట్ కాలేదు. మొత్తంగా చెప్పాలంటే ‘పాపం ప్రతాప్’ ఐడియా వరకు ఎగ్జైట్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ మొత్తంగా సినిమా సంతృప్తినివ్వదు.
నటీనటులు:
పాత్ర ఏదైనా అందులో సులువుగా ఒదిగిపోతూ.. దానికి వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు తిరువీర్. ‘పాపం ప్రతాప్’లోనూ అతను అదే చేశాడు. భార్యను ప్రాణంగా ప్రేమిస్తూ.. తన వల్ల ఆమెకు సమస్య తలెత్తినపుడు సంఘర్షణకు లోనయ్యే పాత్రలో అతను చాలా బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు అమాయత్వాన్ని.. నిస్సహాయతను చూపించే సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల తిరువీర్ కదిలిస్తాడు. కథానాయిక పాయల్ రాధాకృష్ణ కూడా బాగా చేసింది. ఐతే కథలో ఆమెది కీలక పాత్రే అయినా.. తన క్యారెక్టర్ ఇంకా పెంచి ఉండాల్సిందనిపిస్తుంది. తన పాత్ర చిత్రణ కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. సీనియర్ నటి రాశి.. హీరో తల్లి పాత్రలో మెప్పించింది. తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ శ్రుతి మించినట్లు అనిపిస్తుంది. గోపరాజు రమణ పాత్ర.. నటన కూడా అలాగే తయారయ్యాయి. రఘుబాబు పర్వాలేదు. దేవి ప్రసాద్.. రూపలక్ష్మి తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. రవి ఆంటోనీ ఓకే. ప్రసాద్ బెహరాను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ‘పాపం ప్రతాప్’కు మంచి మార్కులే పడతాయి. ‘ఆనంద్’.. ‘గోదావరి’ చిత్రాల సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్ ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇచ్చాడు. పాటలు తన మార్కును చూపిస్తాయి. ‘పిల్లెక్కడుంది’ పాట హుషారు పుట్టింది. ఎస్పీ చరణ్ పాడిన పాట కూడా బాగుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. విశ్వేశ్వర్ పల్లెటూరి నేపథ్యంలో సన్నివేశాలను బాగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. రచయిత-దర్శకుడు దుర్గా నరేష్.. కాస్త భిన్నమైన సినిమా తీయాలని ప్రయత్నించడం అభినందనీయమే. కానీ తన నరేషన్ ప్రభావంతంగా లేకపోయింది. చిన్న కథను మరీ లాగేసిన ఫీలింగ్ కలిగించాడు. కథాకథనాలను మరీ నాటకీయంగా నడిపించడం సమస్యగా మారింది.
చివరగా: పాపం ప్రతాప్.. మంచి ఐడియా కానీ..
రేటింగ్- 2.5/5