గ్లోబల్ సంక్షోభం - బాక్సాఫీస్ గండం: అమెరికాలో ఎన్నారైలకు ఏమైంది?
కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ఆయిల్-గ్యాస్ క్రైసిస్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా పెచ్చుమీరిన ఉద్యోగాల కోత.. అమెరికాలో ట్రంప్ తాజా ఆర్థిక విధానాల బెదిరింపుల నేపథ్యంలో జనం థియేటర్లకు వచ్చే మూడ్‌లో లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, విలాసాలకు పెట్టింది పేరైన అమెరికా కల్చర్‌లో కూడా నేటితరం ఎన్నారైలు తమ బడ్జెట్‌లో వినోదరంగానికి కోతలు వేస్తూ పొదుపును అలవర్చుకుంటున్నారు. ఇటీవల విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ చిత్రం `పెద్ది` వసూళ్లపై ఈ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావం గట్టిగానే పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణంగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల చిత్రాలకు ప్రీమియర్ షోల టికెట్ ధరలు 20 నుండి 30 డాలర్ల వరకు ఆ తర్వాత రెగ్యులర్ రోజుల్లో 12 నుండి 16 డాలర్ల వరకు ఇండస్ట్రీ ట్రెండ్స్, పంపిణీదారుల వ్యూహాలను బట్టి నిర్ణయిస్తుంటారు. అయితే... పెద్ది చిత్రానికి ప్రీమియర్‌లు సహా సాధారణ టికెట్ ధరలను అదనంగా మరో 8 డాలర్ల నుంచి 10డాలర్లు పైగా వడ్డించేయడంతో అంత పెద్ద మొత్తం చెల్లించేందుకు ఉత్తర అమెరికా ఆడియన్స్ సిద్ధంగా లేరనే ప్రచారం సాగుతోంది. ఈ భారీ ధరల పట్ల ఎన్నారైలు ఆసక్తి చూపడం లేదని `పెద్ది` వందశాతం యూనివర్సల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన సినిమా కాకపోవడం కూడా దీనికి ఒక కారణమని ట్రేడ్ కలెక్షన్ల సరళిని బట్టి విశ్లేషిస్తోంది.
ఇదే తరుణంలో గతంలో వచ్చిన `దురంధర్` సిరీస్ చిత్రాలు ఉత్తర అమెరికాలో తెలుగు ప్రేక్షకుల భారీ ఆదరణతో అద్భుతమైన లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా `దురంధర్ 2` చిత్రానికి అక్కడి తెలుగు ఆడియన్స్ కనీసం 4 నుండి 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను అందించారని అంచనా. దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 టికెట్ ధరల్ని సాధారణ ధరలుగానే నిర్ణయించడంతో అక్కడ విపరీతమైన ఆదరణ దక్కిందని విశ్లేషిస్తున్నారు. అయితే పెద్దిని కంటెంట్ పరంగా విశ్లేషిస్తే గ్లోబల్ స్టాండార్డ్ కాదనే విమర్శలు వెల్లువెత్తడం కూడా సమస్యాత్మకంగా మారిందని విశ్లేషిస్తున్నారు.
అయితే గతంలో రామ్ చరణ్ నటించిన `ఆర్.ఆర్.ఆర్` చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. రాజమౌళి విజువల్ వండర్‌గా వచ్చిన ఆ సినిమా లాంగ్ రన్‌లో నార్త్ అమెరికా నుండి సుమారు 14 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. అప్పట్లో ఆ చిత్రం క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ టికెట్ ధరలను 30 నుండి 40 డాలర్ల వరకు భారీగా నిర్ణయించినా కంటెంట్ లోని యూనివర్సల్ అప్పీల్ కారణంగా ప్రేక్షకులు టికెట్ల కోసం ఎగబడ్డారు.
మరోవైపు కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన `కేజీఎఫ్ 2` చిత్రం కూడా ఉత్తర అమెరికా మార్కెట్లో భారీ వసూళ్లను సాధించింది. కేవలం నార్త్ అమెరికా నుంచే ఈ చిత్రం దాదాపు 7.5 మిలియన్ డాలర్ల మార్కును దాటి రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాకు కూడా ప్రారంభంలో టికెట్ ధరలను 20 నుండి 25 డాలర్ల శ్రేణిలో ఉంచినా దేశవ్యాప్తంగా ఉన్న విపరీతమైన హైప్ -మాస్ పల్స్ కనెక్ట్ అవ్వడంతో వసూళ్ల వర్షం కురిసింది.
దీన్ని బట్టి చూస్తే.. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ కంటెంట్ గనుక దురంధర్, RRR లేదా KGF లాగా పూర్తి యూనివర్సల్ రేంజ్‌లో ఉండి టికెట్ ధరలు అందుబాటులో ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని స్పష్టమవుతోంది.