రెంటల్ Vs పర్సంటేజ్.. నాగవంశీ అంత మాట అన్నారేంటి?
టాలీవుడ్ లో కొంతకాలంగా రెంటల్, పర్సంటేజ్ విధానాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ, సినిమాల విడుదల, డిస్ట్రిబ్యూటర్ల మనుగడ వంటి అంశాలు ఆ వివాదంలో కీలకంగా మారాయి.
టాలీవుడ్ లో కొంతకాలంగా రెంటల్, పర్సంటేజ్ విధానాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ, సినిమాల విడుదల, డిస్ట్రిబ్యూటర్ల మనుగడ వంటి అంశాలు ఆ వివాదంలో కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అసలు రెంటల్, పర్సంటేజ్ విధానాల మధ్య తేడా ఏంటి? నాగవంశీ అంత తీవ్రంగా మాట్లాడటానికి కారణమేంటి?
ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానంలో డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాత ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని థియేటర్ యజమానికి చెల్లించి సినిమాను ప్రదర్శిస్తారు. సినిమా ఎంత వసూలు చేసినా థియేటర్ కు ముందుగా మాట్లాడుకున్న మొత్తం దక్కుతుంది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతపై ఆర్థిక భారం పడుతుంది. కలెక్షన్లు రాకపోయినా థియేటర్ రెంటల్ చెల్లించాల్సి రావడంతో నష్టాలు పెరుగుతాయనేది ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారి వాదన.
పర్సంటేజ్ విధానంలో సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ముందుగా నిర్ణయించిన శాతం ప్రకారం పంచుకుంటారు. సినిమా బాగా ఆడితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికీ ప్రయోజనం ఉంటుంది. అయితే సినిమా ఆడకపోతే థియేటర్లకు నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్మాత నాగవంశీ మరో కోణంలో చూస్తున్నారు. రెంటల్ విధానాన్ని తొలగించడం వల్ల డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన నాగవంశీ.. "ముందు డిస్ట్రిబ్యూటర్లను చంపేయడమే ప్లాన్. అప్పుడు పెద్ద వాళ్ల దగ్గరికి వెళ్లి మేమంతా వెళ్లి సినిమా రిలీజ్ టైమ్ లో మోకాళ్ల మీద కూర్చుని మా సినిమా రిలీజ్ పెట్టండని అడగాలేమో. మేం 10 కోట్లు అడిగితే వాళ్లొక నాలుగో ఐదో ఇస్తామని అంటారు. ఏదో మా మీద జాలిపడి సినిమా రిలీజ్ చేస్తామన్న పొజిషన్ కు తీసుకురావడానికి ప్లాన్ లా ఉంది. డిస్ట్రిబ్యూటర్ అనే యాంగిల్ ను చంపేయడమే వాళ్ల థ్యేయం" అంటూ ఆరోపించారు.
"ఇప్పుడు రెంటల్ థియేటర్ల సిస్టమ్ తీసేస్తారు. చార్ట్ అంతా చూసి 3 పర్సెంట్, 2 పర్సెంట్ ఇవ్వండని థియేటర్స్ ను కంట్రోల్ లోకి తీసుకుంటారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ కు అడ్వాన్స్ ఇవ్వను అంటారు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ మనకు డబ్బులు కట్టలేరు కదా. అలా వ్యవస్థను చంపేస్తే మేం కాళ్ల మీద కూర్చోవాలి. ప్రొడ్యూసర్లంతా అప్పులు చేసి కష్టపడి సినిమా చేసి వాళ్ల కాళ్ల దగ్గర నిల్చువోడానికా.. కాదు కదా.. అందుకే ఈ ఫైట్.. " అని తెలిపారు.
నాగవంశీ కామెంట్స్ చేస్తూ ఆయన ఆందోళన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించేనని తెలుస్తోంది. థియేటర్లు కొందరి నియంత్రణలోకి వెళ్తే నిర్మాతలకు సినిమాల విడుదల విషయంలో సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా నిర్మాతలకు ముందుగా అడ్వాన్స్ లు ఇచ్చి సినిమాలను కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్లు బలహీనపడితే, చివరకు నిర్మాతలే నష్టపోతారనేది ఆయన వాదనగా కనిపిస్తోంది. దీంతో రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ వివాదం ఆదాయ పంపిణీ సమస్యగా కాకుండా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల ఫ్యూచర్ కు సంబంధించిన అంశంగా మారింది.