నా జర్నీ- నా పెయిన్ అంతా ఈ కథలోనే ఉంది: `లెనిన్` వేడుకలో అఖిల్ ఎమోషనల్!
ఈ వేడుకలో హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ `లెనిన్` చిత్రం ద్వారా అభిమానుల గుండెల్లో.. వారి ఇళ్లల్లో ఒకడిగా స్థానం సంపాదించుకోవాలనే కసితో పనిచేశానని చెప్పారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మించిన సరికొత్త చిత్రం `లెనిన్`. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన జంటగా నటించిన ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు (నందు) దర్శకత్వం వహించారు. జూలై 10న ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, చిత్రబృందం తిరుపతిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో అఖిల్ అక్కినేని , చిత్రంలోని కీలక నటీనటులు సినిమాపై తమకున్న నమ్మకాన్ని వేదికపై షేర్ చేసారు.
ఈ వేడుకలో హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ `లెనిన్` చిత్రం ద్వారా అభిమానుల గుండెల్లో.. వారి ఇళ్లల్లో ఒకడిగా స్థానం సంపాదించుకోవాలనే కసితో పనిచేశానని చెప్పారు. ``రాయలసీమ బిడ్డ అయిన దర్శకుడు నందు నాకు ఈ కథ చెప్పినప్పుడు... అందులో నా జీవిత ప్రయాణం.. నేను పడ్డ బాధ అంతా స్పష్టంగా కనిపించాయి.. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను``అని అఖిల్ పేర్కొన్నారు. ఈ కథను రాయలసీమ మట్టి వాతావరణంలో ఫీల్ అవ్వడం కోసం తాను డైరెక్టర్ నందు సొంత ఊరికి వెళ్లి.. అక్కడ ఆయన కథ రాసుకున్న ప్రదేశాన్ని చూశానని.. వారి ఇంట్లోనే రాగి సంకటి తిని ఆ ప్రాంత సంస్కృతిని వంటబట్టించుకున్నానని అఖిల్ వెల్లడించారు.
సినిమా నిర్మాణ భాగస్వామ్యం గురించి చెబుతూ..మొదట నిర్మాత నాగవంశీ ఒక్కరే ఈ సినిమా చేయాలనుకున్నా కథలోని పాజిటివ్ వైబ్స్ చూశాక తామిద్దరం కలిసి నాగార్జున గారికి ఈ స్క్రిప్ట్ వినిపించామని.. అలా అన్నపూర్ణ స్టూడియోస్ కూడా భాగస్వామి అయిందని అఖిల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె (భారతి పాత్రలో), నటులు బ్రహ్మాజీ, సునీల్, శివాజీలతో పాటు సాంకేతిక నిపుణులు తమన్, నవీన్, లియోన్ అంతా ఒక కుటుంబంలా కష్టపడ్డారని అభినందించారు. సినిమా గురించి తాను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడనని.. జూలై 10న థియేటర్లలో సినిమానే మాట్లాడుతుందని, ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ చూశాకే తన స్పందన తెలియజేస్తానని అఖిల్ ధీమా వ్యక్తం చేశారు.
చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం అన్నపూర్ణ బ్యానర్, నాగార్జున వల్లే మొదలైందని కృతజ్ఞత చాటుకున్నారు. `లెనిన్` తన హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా అని.. ఇందులో తాము నటులుగా కాకుండా కేవలం పాత్రలుగానే కనిపిస్తామని చెప్పారు. ఒక తండ్రిగా కొడుకు సక్సెస్ కోసం నాగార్జున గారు ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమించారని.. అఖిల్ కెరీర్‌కు ఇది పర్‌ఫెక్ట్ మూవీ అవుతుందని కొనియాడారు. అభిమానులకు కావాల్సిన అన్ని మాస్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని..థియేటర్లలో `జూనియర్ కింగ్` బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమని శివాజీ జోస్యం చెప్పారు.
మరో నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. తాను అక్కినేని తరం హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నానని, భవిష్యత్తులో నెక్ట్స్ జనరేషన్ కిడ్స్‌తోనూ నటించడానికి సిద్ధంగా ఉన్నానని నవ్వుతూ చెప్పారు. ఈ సినిమాలో అఖిల్ తన ప్రాణం పెట్టి సరికొత్త పాత్రను అద్భుతంగా పండించాడని ప్రశంసించారు. హాస్యనటుడు సునీల్ సైతం అఖిల్ ఎనర్జీని అభినందిస్తూ.. దర్శకుడు నందు చిత్తూరు నేపథ్యాన్ని, అక్కడి సహజ వాతావరణాన్ని తెరపైకి అద్భుతంగా తీసుకువచ్చారని పేర్కొన్నారు. అఖిల్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని.. నిర్మాతలు నాగార్జున - నాగవంశీ కి ఈ సినిమాతో తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భారీ విజయం లభించాలని సునీల్ ఆకాంక్షించారు.