రణవీర్ తో టాలీవుడ్ డీల్.. లక్కీ డైరెక్టర్ ఎవరో..
అయితే ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు ఎవరు అనేదే ఇప్పుడు అసలైన పాయింట్. మైత్రీ మూవీస్ కేవలం ఒక కథను నమ్ముకుని వెళ్లడం లేదు. వారు ఒక భారీ యాక్షన్ సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నారు.;
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సక్సెస్ తో రణవీర్ జోరు మామూలుగా లేదు. అయితే ఇప్పుడు ఈ హీరో మీద మన టాలీవుడ్ కన్ను పడింది. అగ్ర నిర్మాణ సంస్థ రణవీర్ తో సినిమా చేయడానికి గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ధురంధర్ సక్సెస్ అయిన వెంటనే ఆ సంస్థ రణవీర్ కు, చిత్ర యూనిట్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. ఈ విషెస్ వెనుక ఒక పెద్ద బిజినెస్ డీల్ దాగి ఉందని ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
అసలు విషయం ఏంటంటే.. రణవీర్ సింగ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది మన మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించాలని చూస్తోంది. రణవీర్ సింగ్ ఎనర్జీకి తగ్గట్టుగా ఒక పవర్ ఫుల్ యాక్షన్ సినిమా తీయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. రణవీర్ కూడా వీరితో పని చేయడానికి సానుకూలంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు ఎవరు అనేదే ఇప్పుడు అసలైన పాయింట్. మైత్రీ మూవీస్ కేవలం ఒక కథను నమ్ముకుని వెళ్లడం లేదు. వారు ఒక భారీ యాక్షన్ సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలువురు దర్శకుల దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ కథలను కూడా విన్నారట. వాళ్ళ దగ్గర స్టోరీ బ్యాంక్ రెడీగా ఉంది.
మైత్రీ సంస్థ దగ్గర ఇప్పటికే మన టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ డైరెక్టర్లు, యువ దర్శకులు అడ్వాన్సులు తీసుకుని లైన్ లో ఉన్నారు. ఇప్పుడు మైత్రీ నిర్మాతలు ఆ కథలను రణవీర్ దగ్గరకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న దర్శకులతో రణవీర్ కు కథలు వినిపిస్తారట. ఎవరి కథ రణవీర్ కు నచ్చుతుందో, ఎవరి నేరేషన్ కు హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వారితోనే సినిమా పట్టాలెక్కుతుంది. అంటే ఇక్కడ ఛాయిస్ మొత్తం హీరో చేతిలోనే ఉంది.
నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. ఇదివరకే వారు అక్కడ అడుగుపెట్టారు. సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతోనే ఇప్పుడు రణవీర్ లాంటి స్టార్ హీరోతో మరో భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు.
మొత్తానికి రణవీర్ సింగ్, మైత్రీ కాంబినేషన్ సెట్ అయితే అది పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ అవ్వడం ఖాయం. రణవీర్ లాంటి హై ఎనర్జిటిక్ హీరోకు మన తెలుగు నేటివిటీ ఉన్న యాక్షన్ కథ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. మరి మైత్రీ వినిపించే కథల్లో రణవీర్ దేనికి ఓకే చెబుతారో, ఏ దర్శకుడికి ఆ లక్కీ ఛాన్స్ దక్కుతుందో చూడాలి. అధికారిక ప్రకటన వస్తే గానీ దీనిపై పూర్తి క్లారిటీ రాదు.