కొత్త కాంబినేషన్స్ తో మైత్రి రిస్కులు
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్ మార్కెట్ పై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్ మార్కెట్ పై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. పుష్ప 2 లాంటి భారీ సక్సెస్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇలాంటి టైమ్ లో తమిళ్ ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేందుకు మైత్రీ అడుగులు వేస్తోంది. అయితే అక్కడ ఆల్రెడీ రెండు చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ, బ్యానర్ వెనక్కి తగ్గకుండా మళ్లీ రిస్క్ తీసుకుంటుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో మైత్రీ సంస్థ అజిత్ హీరోగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాను నిర్మించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన 'డ్యూడ్' కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు తమిళ్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, కోలీవుడ్ లో డైరెక్ట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనే పట్టుదలతో నిర్మాతలు కొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మైత్రీ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ పై చర్చలు జరుపుతోంది. అందులో మొదటిది ధనుష్, సిరుత్తై శివ కాంబినేషన్. శివకు మాస్ పల్స్ బాగా తెలుసు కానీ అతని అన్నాత్తై, కంగువా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ధనుష్ కు ఒక పర్ఫెక్ట్ మాస్ మేకోవర్ ఇచ్చి హిట్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నారట. ఈ కాంబో ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు టాక్.
ఇక రెండో ప్రాజెక్ట్ శింబు, కీర్తీశ్వరన్ కాంబోలో రాబోతోందట. డ్యూడ్ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన ఈ యంగ్ డైరెక్టర్ కు మైత్రీ మళ్లీ సెకండ్ ఛాన్స్ ఇస్తుండటం ఇంట్రెస్టింగ్ పాయింట్. శింబు కూడా ఒక సాలిడ్ ఫామ్ కోసం వెతుకుతున్న టైమ్ లో ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తే బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా జరుగుతున్నాయని సమాచారం.
మూడోది శివకార్తికేయన్, జగన్ శక్తి కాంబినేషన్ లైన్ లో ఉందని తెలుస్తోంది. మిషన్ మంగళ్ సినిమాతో బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న జగన్ శక్తి ఈ కథను పాన్ ఇండియా అప్పీల్ తో డిజైన్ చేస్తున్నారట. శివకార్తికేయన్ కు ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ లో గట్టి హోల్డ్ ఉంది కాబట్టి, ఈ ప్రాజెక్ట్ గనుక సెట్ అయితే మైత్రీకి తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి అడ్వాంటేజ్ అవుతుంది.
ఈ మూడు కాంబోస్ లో ఏ ఒక్కటి క్లిక్ అయినా కోలీవుడ్ లో మైత్రీ బ్రాండ్ స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఈ ప్లానింగ్ లో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువే ఉంది. ఎందుకంటే లైన్ లో ఉన్న దర్శకుల్లో ఇద్దరు ప్రస్తుతం సరైన సక్సెస్ ఫామ్ లో లేరు. శివ వరుస ఫ్లాపుల్లో ఉండగా, కీర్తీశ్వరన్ ఇంకా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. తమిళ్ ప్రేక్షకులు కేవలం స్టార్ ఇమేజ్ ను కాకుండా కంటెంట్ ను ఎక్కువగా నమ్ముతారు. మరి ఈ మైనస్ పాయింట్స్ ను దాటుకుని మైత్రీ కోలీవుడ్ బెట్ ను ఎలా గెలుస్తుందో చూడాలి.