సక్సెస్ కోసం కోలీవుడ్ లో మైత్రీ.. ప్లాన్ క్లిక్కయ్యేనా?
టాలీవుడ్ లో బడా ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ లో బడా ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్ పై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరోలతో పలు ప్రాజెక్టులను లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తుండటంతో... మైత్రీ సంస్థ ఇప్పుడు కోలీవుడ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ వరుస విజయాలు అందుకున్న మైత్రీ.. తమిళ మార్కెట్ లోనూ స్ట్రాంగ్ ప్లేస్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ధనుష్- సిరుతై శివ కాంబినేషన్ లో మూవీ, శింబు ప్రధాన పాత్రలో మరో ప్రాజెక్టు, అలాగే శివకార్తికేయన్ హీరోగా ఇంకో చిత్రం నిర్మించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టులు సక్సెస్ అయితే, కోలీవుడ్ లో మైత్రీ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
నిజానికి మైత్రీకి ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ లు దక్కాయి. అజిత్ తో నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. అలాగే యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో తెరకెక్కిన డ్యూడ్ కూడా కమర్షియల్ గా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో తమిళ ప్రేక్షకుల్లో ఆ బ్యానర్ పై నమ్మకం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే మైత్రీ సక్సెస్ ఛాన్స్ ను పెంచుతున్న మరో ప్రధాన కారణం ఎక్స్పీరియన్స్. శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన అనుభవం ఆ సంస్థకు ఉంది. పెద్ద సినిమాలు ప్లాన్ చేయడం, వాటిని మార్కెట్ చేయడం, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడం వంటి విషయాల్లో మైత్రీ ఇప్పటికే తన స్టామినా ప్రూవ్ చేసుకుంది.
కేవలం స్టార్ హీరోల సినిమాలకే పరిమితం కాకుండా, కంటెంట్ బేస్డ్ చిత్రాలపై కూడా సంస్థ దృష్టి పెట్టడం మరో ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. కమర్షియల్ సినిమాలతో పాటు మంచి స్టోరీ లైన్ ఉన్న చిత్రాలు నిర్మించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. పాన్ ఇండియా మార్కెట్ లో మైత్రీకి ఉన్న స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.
తమిళంలో రూపొందించే సినిమాలను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసే స్టామినా మైత్రీకి ఉంది. దీంతో సాలిడ్ గా బిజినెస్ జరిగే అవకాశం ఉంది. అయితే సవాళ్లు కూడా లేకపోలేదు. తమిళ ప్రేక్షకుల టేస్ట్ టాలీవుడ్ ఆడియన్స్ తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అక్కడ నేటివిటీ, స్ట్రాంగ్ ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే కథల ఎంపికలో మైత్రీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఏదేమైనా మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్ ప్లాన్ సరైన విధంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. స్టార్ హీరోలతో ప్రాజెక్టులు, పాన్ ఇండియా మార్కెట్ పై పట్టుతో పాటు ఇప్పటికే వచ్చిన విజయాలు సంస్థకు కలిసొస్తున్నాయి. రాబోయే సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు సాధిస్తే, టాలీవుడ్ లాగానే కోలీవుడ్ లో కూడా మైత్రీ మూవీ మేకర్స్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లిస్ట్ లో చేరుతుందనే చెప్పాలి.