అల్లు రామలింగయ్యలా అవుతాడని అప్పుడే చెప్పారట!

ఎంఎస్ నారాయణ ప్రత్యేకత కేవలం కామెడీ చేయడంలోనే కాదు, దానిని ఎంత సహజంగా, ఎంత సరదాగా ప్రజల ముందుకు తీసుకురావడంలో ఉంది.;

Update: 2026-05-01 08:19 GMT

దివంగత హాస్యనటుడు M. S. నారాయ‌ణ పేరు వినగానే ప్రేక్షకుల ముఖాల్లో సహజంగానే చిరునవ్వు మెదులుతుంది. తన‌ టైమింగ్, సహజ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ఈ నటుడు, మరణానంతరం కూడా ఎందుకు అంతగా గుర్తుకొస్తున్నారో అనేది ఆయన జీవితం చెబుతుంది. సాధారణ టీచర్‌గా చిన్న జీతంతో లైఫ్ ను ప్రారంభించిన ఆయ‌న‌ కష్టాలు, బాధలను ఎదుర్కొంటూ యాక్టింగ్ పై ఉన్న అభిరుచితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి క్రమంగా ఎదిగి స్టార్ కామెడియన్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఎంఎస్ నారాయణ ప్రత్యేకత కేవలం కామెడీ చేయడంలోనే కాదు, దానిని ఎంత సహజంగా, ఎంత సరదాగా ప్రజల ముందుకు తీసుకురావడంలో ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో పారడీలు, సెటైర్లను ప్రేక్షకులకు అందించడంలో ఆయనకు ఉన్న స్థానం ప్రత్యేకం. ఒకరిని అనుకరించడం, సెటైరికల్‌గా చూపించడం వంటి అంశాలు చాలా చోట్ల విమర్శలకు దారితీసినా, తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం అదొక హెల్తీ ఎంట‌ర్టైన్‌మెంట్ గా తీసుకుంటారు. ఇదే విష‌యాన్ని ఎంఎస్ నారాయ‌ణ ఓ ఇంట‌ర్వ్యూలో కూడా చెప్పారు. టాలీవుడ్ లో ఎవరినైనా అనుకరించినా ఎవరూ తప్పుపట్టర‌ని, ఇక్కడ అందరికీ పెద్ద మనసే ఉంద‌ని చెప్పారు.

ఇక తన పారడీలపై ప్రముఖుల స్పందన కూడా ఎంఎస్ నారాయణ గొప్పతనాన్ని చూపిస్తుంది. అదే ఇంట‌ర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ‌ గురించి చేసిన పేరడీ చూశాక ఆయన తిడతారేమో అనుకున్నాన‌ని, కానీ దానిక్కూడా త‌న‌కు ప్ర‌శంస‌లే ద‌క్కాయ‌ని చెప్పారు. అంతేకాదు, కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల దగ్గరకు వెళ్లి.. ఇతను ఫ్యూచ‌ర్ లో అల్లు రామ‌లింగ‌య్య‌లా అవుతార‌ని చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

అయితే నవ్వుల వెనుక ఎంఎస్ నారాయణలో ఒక సీరియస్ నటుడు కూడా ఉన్నాడు. కెరీర్ లో పూర్తి స్థాయి విలన్ పాత్ర చేయాలని ఆయనకున్న కోరిక నెరవేరకపోవడం సినీప్రేమికులకు ఒక కోల్పోయిన అవకాశంగా మిగిలిపోయింది. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆయన జ‌ర్నీ, టాలీవుడ్‌లో ఒక ఇన్సిపిరేష‌న‌ల్ స్టోరీగా నిలిచిపోయింది. అందుకే ఆయన మరణం తర్వాత కూడా ప్రేక్షకులు ఆయనను మరవలేకపోతున్నారు. నవ్వుల్లో జీవించి, జ్ఞాపకాలలో నిలిచిపోయిన ఈ మహానటుడు, తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తార‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News