మొత్తానికి అ న‌టి మ‌ళ్లీ కాక పుట్టించేలా ఉందే!

తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మోనా సింగ్ మాట్లాడుతూ, `సమాజంలో తల్లుల పట్ల ఉన్న పాతకాలపు ఆలోచనలను ఈ సిరీస్ ప్రశ్నిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.;

Update: 2026-04-02 03:00 GMT

బాలీవుడ్ నటి మోనా సింగ్ తాజా వెబ్ సిరీస్ `మా కా సమ్` తో మరోసారి డిజిటల్ తెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతోన్న‌ ఈ సిరీస్ ఒక విభిన్నమైన కాకపుట్టించే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. `జస్సీ జైసీ కోయి నహిన్` కాలం నుండి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోనా సింగ్ ఇందులో సవాలుతో కూడిన పాత్రను పోషిస్తోంది. ఈ సిరీస్ ప్రధానంగా ఒంటరి తల్లి చుట్టూ తిరుగుతుంది. పిల్లల పెంపకంలో మునిగిపోయిన ఒక తల్లి, తన వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా తనలోని స్త్రీ హృదయాన్ని మళ్ళీ ఎలా ఆవిష్కరించుకుంది అనేదే కథాంశం.

సమాజం విధించిన కట్టుబాట్లను పక్కన పెట్టి ఒక తోడు కోసం లేదా ప్రేమ కోసం ఆమె చేసే అన్వేషణ ఇందులో హైలైట్‌గా నిలవబోతోంది. తల్లులకు కూడా సొంత కోరికలు, ఇష్టాయిష్టాలు ఉంటాయని ఈ సిరీస్ బలంగా చాటి చెబుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మోనా సింగ్ మాట్లాడుతూ, `సమాజంలో తల్లుల పట్ల ఉన్న పాతకాలపు ఆలోచనలను ఈ సిరీస్ ప్రశ్నిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. తల్లి అంటే కేవలం త్యాగాలకు ప్రతీక అని, ఆమెకు వ్యక్తిగత జీవితం ఉండకూడదని అనుకోవడం తప్పు. ఒక తల్లి మళ్ళీ డేటింగ్ చేయాలనుకోవడం లేదా ఒక మగాడి తోడు కోరుకోవడం తప్పు కాదు` అనే పాయింట్‌తో నేటి ఆధునిక సమాజంలో ఒక కొత్త చర్చకు దారితీసే అవకాశం లేక‌పోలేదు.

ఈ వెబ్ సిరీస్‌లో కేవలం సీరియస్ డ్రామా మాత్రమే కాదు. తల్లీ కొడుకుల మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని, హాస్యాన్ని కూడా మేళవించారు. తల్లి మళ్ళీ ప్రేమలో పడటం లేదా తోడును వెతుక్కోవడం పట్ల కుమారుడు ఎలా స్పందిస్తాడు? ఆ ప్రయాణంలో ఎదురయ్యే సామాజిక ఇబ్బందులు ఏమిటి? అనే అంశాలను దర్శకుడు చాలా ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తోంది. మోనా సింగ్ తన సహజ సిద్ధమైన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశారని సిరీస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి `మా కా సమ్` సిరీస్ మోనా సింగ్ కెరీర్‌ని మరో కీలక మలుపు తిప్పే అవ‌కాశం ఉంది. రొటీన్ కథలకు భిన్నంగా, ధైర్యంగా ఒక బోల్డ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం పట్ల మోనా సింగ్ పై విమ‌ర్శ‌ల‌తో పాటు ప్రశంసలు త‌ప్ప‌వు. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఓటీటీ ప్రియులకు ఒక కొత్త అనుభూతిని అందించడమే కాదు. తల్లుల వ్యక్తిగత స్వేచ్ఛపై ఉన్న సామాజిక అపోహలను తొలగిస్తుందని ఆశించవచ్చు.

Tags:    

Similar News