60 వయసులో యూరప్ నుంచి ఆఫ్రికాకు ఈదిన నటుడు
వయసు ఒక నంబర్ మాత్రమేనని నిరూపించిన హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఇటీవల కొత్త గాళ్ ఫ్రెండ్ తో షికార్ చేస్తున్నాడు.;
వయసు ఒక నంబర్ మాత్రమేనని నిరూపించిన హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఇటీవల కొత్త గాళ్ ఫ్రెండ్ తో షికార్ చేస్తున్నాడు. ఈ వయసులోను అతడు ఆకాంశంలో విమానాల నుంచి జంప్ చేస్తూ సాహసాలకు వెనకాడటం లేదు. సినిమా కోసం అతడి డేరింగ్ స్టంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
టామ్ క్రూజ్ ది ఒక పంథా అనుకుంటే.. తనకంటే సగం వయసున్న యువతిని పెళ్లాడి సంచలనం సృష్టించాడు ఇండియన్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్. అతడు 60 వయసులో సముద్రాలను ఈదుతున్నాడు. ఈసారి యూరప్ నుంచి ఆఫ్రికాకు సముద్ర మార్గంలో ఏకంగా 15 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ఈది రికార్డులు సృష్టించాడు. ఈ వయసులో అతడి సాహసాన్ని మెచ్చకుండా ఉండలేం.
నిజానికి వయసు పెరిగేకొద్దీ మనిషిలో ఉత్సాహం తగ్గుతుందని చాలామంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తుంటారు. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ (63) , మిలింద్ సోమన్ (60) వంటి వారు దీనికి ఉదాహరణలు. మిలింద్ సాహసయాత్ర వివరాల్లోకి వెళితే..
మే 1న మిలింద్ సోమన్ ఈ అసాధారణ సాహసాన్ని పూర్తి చేశారు. స్పెయిన్‌లోని తారిఫా (యూరప్) నుండి మొరాకో తీరం (ఆఫ్రికా) వరకు విస్తరించి ఉన్న జిబ్రాల్టర్ జలసంధిని ఆయన ఈదుకుంటూ దాటారు. సుమారు 15 కిలోమీటర్ల మేర సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని నాన్-స్టాప్‌గా పూర్తి చేసి తన సత్తా చాటారు. ఈ వయసులో అంతటి చల్లని సముద్రపు నీటిలో అలల తాకిడిని తట్టుకుంటూ ఖండాలను దాటడం అనేది అతడి శారీరక ధృడత్వానికి.. సంకల్ప బలానికి నిదర్శనం.
మిలింద్ సోమన్ తన సాహసానికి సంబంధించిన ఫోటోలను.. వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. ``యూరప్ నుంచి ఆఫ్రికాకు ఈదడం ఒక అద్భుతమైన అనుభవం`` అంటూ ఆయన రాసుకొచ్చారు. దీనిపై స్పందించిన నెటిజన్లు ``అబ్సల్యూట్ ఇన్‌స్పిరేషన్`` అంటూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు దీటుగా మిలింద్ చూపిస్తున్న ఈ తెగువ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభిమానులు కొనియాడుతున్నారు.
అయితే ఈ సాహసంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కూడా వ్యక్తమయ్యాయి. ఒక యూజర్ స్పందిస్తూ.. ``మిలింద్ సోమన్ వంటి పురుషులు ఇలాంటి సాహసాలు చేసినప్పుడు ప్రశంసలు దక్కుతాయి.. అదే ఒక మహిళ ఇలాంటి సాహసం చేస్తే సమాజం చూసే కోణం మారుతుంది`` అంటూ సామాజిక వివక్షపై చర్చను లేవనెత్తారు. అయితే మిలింద్ సాధించిన ఈ ఘనత క్రీడాకారుల్లోనూ.. ఫిట్‌నెస్ ప్రియుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది అనడంలో సందేహం లేదు.
వృత్తిపరంగా చూస్తే.. మిలింద్ సోమన్ ఇటీవల కంగనా రనౌత్ చారిత్రాత్మక చిత్రం `ఎమర్జెన్సీ` (2025) లో కీలక పాత్రలో కనిపించారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `ది రాయల్స్` లోనూ మెరిశారు. ఒకవైపు నటుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు ఇలాంటి సాహస కృత్యాలతో తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. వయసును వెనక్కి నెట్టేస్తున్న మిలింద్ సోమన్ ప్రయాణం నిజంగా అభినందనీయం. తన కంటే చాలా చిన్న వయసు అమ్మాయి అంకిత కొణ్వర్ ని మిలింద్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమాయణం, ఆదర్శ దాంపత్యంపై చాలా చర్చ జరుగుతోంది.