ఒక్క రికార్డూ వదలని ‘లోక’

ముందు ఈ సినిమా హిట్టయినందుకే టీం ఎంతో సంతోషించింది. అలాంటిది మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది.;

Update: 2025-10-06 10:02 GMT

ఇండియాలో సూపర్ హీరో సినిమా అంటే అందులో హీరోనే లీడ్ రోల్ చేస్తాడు. కానీ మలయాళంలో మాత్రం ఈ ఏడాది ఒక గొప్ప ప్రయోగం జరిగింది. సూపర్ హీరో పాత్రలో ఒక హీరోయిన్ని చూపించారు. ముందు అందరూ ఇది రిస్క్ అన్నారు. నిర్మాతలు కూడా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు కానీ దుల్కర్ సల్మాన్ చేసిన సాహసానికి అద్భుత ఫలితమే దక్కింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో కళ్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో రూపొందిన ‘లోక’ అసాధారణ ఫలితాన్నందుకుంది.

ముందు ఈ సినిమా హిట్టయినందుకే టీం ఎంతో సంతోషించింది. అలాంటిది మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ‘ఎల్2: ఎంపురాన్’ రూ.268 కోట్లతో నెలకొల్పిన హైయెస్ట్ మలయాళం గ్రాసర్ రికార్డును ‘లోక’ ఆల్రెడీ అధిగమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రూ.300 కోట్ల మార్కును కూడా దాటేసిందీ సినిమా. మలయాళ సినిమాకు ఇది చాలా పెద్ద టాస్కే.

‘లోక’ రావడానికి ముందు ‘ఎల్2: ఎంపురాన్’ వరల్డ్ వైడ్ మలయాళ హైయెస్ట్ గ్రాసర్‌గా ఉంది కానీ.. కేవలం కేరళ వరకు తీసుకుంటే మోహన్ లాల్ మరో చిత్రం ‘తుడరుమ్’ అత్యధిక వసూళ్లను సాధించింది. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రెండు రికార్డులను కూడా ‘లోక’ బద్దలు కొట్టేసింది.

కేరళలో అయినా, ఇండియాలో అయినా, వరల్డ్ వైడ్ అయినా మలయాళ సినిమా అత్యధిక వసూళ్ల రికార్డు ‘లోక’కే సొంతం. అంతే కాక ఇప్పుడు రూ.300 కోట్ల అద్భుత మైలురాయిని కూడా ఈ సినిమా దాటేసింది. ‘లోక’ థియేట్రికల్ రన్ ఇంకా ముగియలేదు. మలయాళంలో ఇప్పటికీ ఈ సినిమా బాగానే ఆడుతోంది. ఈ సినిమా రికార్డులు ఇప్పుడిప్పుడే బద్దలు కావని భావిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీతో ఇంతటి సంచలనం రేపడం మామూలు విషయం కాదు.


Tags:    

Similar News