పెళ్లి ఆల‌స్యంతో స‌మాజాన్ని జయించిన‌ట్లేనా?

తన స్నేహితులందరికీ పదేళ్ల క్రితమే వివాహాలు అయిపోయాయని గుర్తు చేసుకుంటూ వారంతా ఓ రకమైన సామాజిక ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారని కృతిక అభిప్రాయపడ్డారు.;

Update: 2026-04-16 18:30 GMT

నటి కృతికా కమ్రా వివాహ బంధం - వ్యక్తిగత నిర్ణయాల పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సాధారణంగా సమాజంలో వయసు రాగానే పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి ఉంటుంది. కానీ తాను 37 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవడాన్ని సరైన నిర్ణయంగా అభివర్ణించారు. జీవితంలో ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల ఎంచుకున్న భాగస్వామి పట్ల, నిర్ణయం పట్ల సంపూర్ణమైన స్పష్టత ఉంటుంద‌న్నారు. ఆ సమయంలో ఏం చేస్తున్నామో? బాగా తెలుస్తుందని విశ్లేషించారు. తన స్నేహితులందరికీ పదేళ్ల క్రితమే వివాహాలు అయిపోయాయని గుర్తు చేసుకుంటూ వారంతా ఓ రకమైన సామాజిక ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నారని కృతిక అభిప్రాయపడ్డారు.

అయితే కృతిక‌ తల్లిదండ్రులు పెళ్లి విషయంలో ఎన్న‌డూ త‌న‌ని ఒత్తిడి చేయలేదని దీంతో కావాల్సినంత సమయం దొరికిందన్నారు. కెరీర్ , వ్యక్తిగత జీవితంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే తాను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టానన‌ని ఇది తనకు ఎంతో మానసిక తృప్తిని ఇస్తుంద‌న్నారు. గౌరవ్ కపూర్ - కృతికల వివాహం ఎంతో నిరాడంబరంగా కేవలం సన్నిహితుల మధ్య జరిగింది. భారీ హంగులు, డెస్టినేషన్ వెడ్డింగ్ వంటి ఆర్భాటాలకు తాము దూరంగా ఉన్నామన్నారు. `మాకు పెళ్లి వేడుక కంటే వివాహ బంధం అనేది చాలా పెద్ద విషయం అని స్పష్టం చేశారు.

లోకానికి చూపించుకోవడానికి చేసే ఖర్చు కంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవాలనే ఉద్దేశం బలంగా ఉండాలని కృతిక అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే పెళ్లి సమయంలో తన భర్త గౌరవ్ కపూర్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారని కృతిక గుర్తు చేసుకున్నారు. నిత్యం వందలాది మంది ముందు లైవ్ షోలు ఇచ్చే గౌరవ్, తమ వివాహ సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. కృతిక‌ను వధువు రూపంలో చూడగానే గౌర‌వ్ కళ్లలో నీళ్లు తిర‌గ‌డం, ఆ బంధం పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు.

తన ప్రాణ స్నేహితుడిని భర్తగా పొందడం అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు. పెళ్లి అనేది వ్యక్తిగత నిర్ణయమని అది ఎప్పుడు చేసుకోవాలనేది సదరు వ్యక్తులే నిర్ణయించుకోవాలని కృతిక సూచించారు. వయసును బట్టి కాకుండా మానసిక సిద్ధతను బట్టి అడుగు వేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే మరోవైపు వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నానన్నారు.

పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం అంటే సమాజాన్ని ఓడించినట్లు కాదు. సమాజపు అసంబద్ధమైన ఒత్తిడికి తలొగ్గకుండా ఉండటమే. జీవితానికి మనం యజమానులమని, మన నిర్ణయాలు మనం తీసుకోగలమని నిరూపించడమే అసలైన విజయం. ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడే ఆ వివాహం విజయవంతం అవుతుంది.

Tags:    

Similar News