స్టార్ హీరోని టీజ్ చేసిన సీనియర్ నటి... వేదికపైనే పరువు పోయిందిగా
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, స్టార్ హీరో అమీర్ ఖాన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, స్టార్ హీరో అమీర్ ఖాన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన జూలై 5న తన భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఆటపట్టించడానికి.... సరదాగా టీజ్ చేయడానికి అతడి సన్నిహితులు ఏమాత్రం అవకాశం వదులుకోవడం లేదు. ఇటీవల జరిగిన `అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్` 25 ఏళ్ల ప్రత్యేక వేడుకలో అమీర్ మాజీ కో-స్టార్, సీనియర్ నటి కాజోల్ అందరి ముందు అతడిపై చేసిన కొన్ని అల్లరి వ్యాఖ్యలు - ఆటపట్టించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
శనివారం సాయంత్రం ముంబైలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు గత రెండు దశాబ్దాలుగా ఈ బ్యానర్‌తో ప్రయాణించిన ఎంతోమంది నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై కాజోల్ మాట్లాడుతూ.. 2001లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ `లగాన్` సినిమాతో ప్రారంభమైన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రయాణాన్ని ఎంతో అభినందించారు. అమీర్ ఖాన్‌కు సినిమాల ఎంపికలో అద్భుతమైన టేస్ట్ (అభిరుచి) ఉందని కొనియాడారు.
అయితే, కాజోల్ ప్రశంసలు అంతటితో ఆగలేదు. వేదికపై అమీర్ ఖాన్ పక్కనే ఉండగా కాజోల్ ఒక్కసారిగా.. ``సినిమాల విషయంలోనే కాదు.. మహిళలను ఎంచుకోవడంలో కూడా అమీర్ ఖాన్‌కు చాలా గొప్ప టేస్ట్ ఉంది`` అంటూ ఒక సెటైరికల్ కామెంట్ విసిరారు. కాజోల్ నుంచి ఈ ఊహించని వ్యాఖ్యతో అమీర్ ఖాన్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతడు వేదికపై చాలా సిగ్గు పడుతూ... అసౌకర్యానికి లోనవుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. కాజోల్ నవ్వుతూ అతడిని నెట్టడం.. అటుపై ఆ మాటలకు స్పాట్ లో సెలబ్రిటీలు- ప్రేక్షకులు గట్టిగా నవ్వడంతో ఆ ప్రాంతమంతా నవ్వులు పూశాయి.
అమీర్ ఖాన్‌కు గతంలో రీనా దత్తాతో మొదటి వివాహం .. ఆ తర్వాత 2005లో కిరణ్ రావుతో రెండవ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు వివాహ బంధాలు విడాకులతో ముగిసినా... అతడు తన మాజీ భాగస్వాములతో ఇప్పటికీ మంచి స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు జూలైలో మూడో పెళ్ళికి సిద్ధమవుతున్న తరుణంలో కాజోల్ ఆ రకంగా టీజ్ చేయడం గమనార్హం. ఈ సరదా సన్నివేశం ఒక రకంగా 1997 నాటి సూపర్ హిట్ రోమ్‌కామ్ చిత్రం `ఇష్క్` జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత `ఇష్క్` తారలైన అమీర్ ఖాన్, కాజోల్, జూహీ చావ్లా ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు కన్నుల పండువగా అనిపించింది. కాజోల్ ఇప్పటివరకు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎలాంటి సినిమా చేయకపోయినా... వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. `ఇష్క్` చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ `ఫనా`(2006) చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ పాత స్నేహితుల కలయిక.. కాజోల్ చేసిన అల్లరి వ్యాఖ్యలు ఈ వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.