ఎన్టీఆర్ డ్రాగన్ లుక్ వెనుక అసలు రహస్యం!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సినీ వర్గాలను, అభిమానులను ఆశ్చర్యపరిచారు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సినీ వర్గాలను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. తన తాజా చిత్రం డ్రాగన్ కోసం ఆయన గణనీయంగా బరువు తగ్గి మరింత సన్నగా మారడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్‌లో ఓ వైపు ఆశ్చర్యం, మరోవైపు ఆందోళన కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బాగానే ఉన్నారా? అనే చర్చలు కూడా ఊపందుకున్నాయి. అయితే ఈ మార్పు పూర్తిగా పాత్ర కోసం చేసిన ప్రణాళికాబద్ధమైన ట్రాన్స్‌ఫర్మేషన్ అని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
7 వారాల్లోనే 10 కిలోలు తగ్గిన తారక్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం పాత్రకు తగ్గట్టుగా లీన్ ఫిజిక్ కావాలని డైరెక్టర్, ఎన్టీఆర్ ను కోరినట్లు సమాచారం. దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ కఠినమైన ఫిట్‌నెస్ రొటీన్‌ను అనుసరించి, రోజుకు సుమారు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ, కంట్రోల్డ్ డైట్ తో కేవలం 7 వారాల్లోనే దాదాపు 10 కిలోల బరువు తగ్గినట్లు తారక్ ట్రైనింగ్ టీమ్ వెల్లడించింది. ముఖ్యంగా లో ప్రోటీన్ డైట్‌తో పాటు క్రమశిక్షణే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కారణమని వారు చెబుతున్నారు.
పలుమార్లు ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన ఎన్టీఆర్
ఇది ఎన్టీఆర్‌కు కొత్త విషయం కాదు. గతంలో కూడా ఆయన పలు సినిమాల కోసం తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. అప్పటివరకు బొద్దుగా, లావుగా ఉన్న తారక్.. యమదొంగ కోసం స్లిమ్ లుక్‌లో కనిపించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత టెంపర్ సినిమాకు సిక్స్ ప్యాక్‌తో అలరించారు. తర్వాత అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల కోసం కూడా తన మేకోవర్‌ను తారక్ ఎంతో విభిన్నంగా మలుచుకున్నారు. అయితే ఈసారి డ్రాగన్ కోసం చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం గతంతో పోలిస్తే మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉండటం గమనార్హం. ఇంత సన్నగా మారడం ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే మొదటిసారి కావడంతో ఇది ప్రత్యేక చర్చనీయాంశమైంది.
లుక్ కారణంగా మరింత హైప్
అయితే, ఈ భారీ మార్పు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా, ఎన్టీఆర్ లుక్ కారణంగా పాన్ ఇండియా స్థాయిలో మరింత హైప్‌ను సొంతం చేసుకుంటోంది. అభిమానులు కూడా ఈ లుక్ వెనుక కథ ఏమిటి? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని తెలిసినా, అభిమానులు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్ మీడియాలో తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా, ఇటీవల జోర్డాన్‌లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. మొత్తానికి ఫిట్‌నెస్, డెడికేషన్, ఫ్యాన్స్ ఎమోషన్... అన్నీ కలిపి ఎన్టీఆర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.