పిల్ల‌ల కోసం నెల‌కి 40 ల‌క్ష‌లు!

కోలీవుడ్ నటుడు జయం రవి - భార్య ఆర్తిల విడాకుల వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో నిత్యం చర్చ నీయాంశంగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-08-03 18:21 GMT

కోలీవుడ్ నటుడు జయం రవి - భార్య ఆర్తిల విడాకుల వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో నిత్యం చర్చ నీయాంశంగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. వివాహం జరిగిన పదేళ్ల తర్వాత ఇద్ద‌రి మధ్య తలెత్తిన మనస్పర్థలు, ఆపై కోర్టుల వరకు వెళ్లిన వివాదం వార్తలు మీడియాలో పెద్దఎత్తున ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ విడాకుల కేసుకు సంబంధించి ఆర్తి తల్లి , నిర్మాత సుజాత విజయ్‌కుమార్ మీడియా ముందుకు కీలక విషయాలు వెల్లడించడం కోలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.

ఆర్తి నెలకు 40 లక్షలు భరణం డిమాండ్ చేసిందంటూ వ‌స్తోన్న‌ వార్తలపై సుజాత విజయ్‌కుమార్ స్పందించారు.ఆ మొత్తం కేవలం ఆర్తి వ్యక్తిగత ఖర్చుల కోసం కాద‌న్నారు. ఆ మొత్తంలో పిల్లల పాఠశాల ఫీజులు, ఆహారం, రుణాలు ,ఇతర నిర్వహణ ఖర్చులు అన్నీ కలిసి ఉన్నాయని వివరించారు. రవి మోహన్ తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టారని.. దీనివల్ల బ్యాంకు నుంచి కూడా నోటీసులు వచ్చాయని ఆరోపించారు.

పిల్లల చదువుల గురించి మాట్లాడారు. రవి మోహన్ పిల్ల‌లు ఇద్ద‌ర్నీ అమెరికన్ పాఠశాలలో చేర్పించార‌న్నారు. దీంతో కుమారులు ఆరావ్, అయాన్‌ల వార్షిక పాఠశాల ఫీజు 86 లక్షలు ఉంటుందని సుజాత తెలిపారు. ఈ నేపథ్యంలోనే పిల్లల చదువులు, ఫీజులు , ఇతర అవసరాల నిమిత్తం కోర్టు ఆదేశాల మేరకు రవి మోహన్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఆర్తి అడిగిన 40 లక్షల మొత్తాన్ని తిరస్కరించి.. మధ్యంతర భరణంగా ఆర్తికి 3 లక్షలు, ఇద్దరు పిల్లలకు చెరో లక్ష చొప్పున మొత్తం 5 లక్షలు చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు.

అలాగే తాము ఎప్పుడూ రవి మోహన్‌ను పిల్లలను కలవకుండా అడ్డుకోలేదని, కోర్టు ద్వారానే ఆయన పిల్లలను కలిసేలా చర్యలు తీసుకున్నామని సుజాత తెలిపారు. పిల్లల సంక్షేమం దృష్ట్యా తండ్రి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, పిల్లలు గర్వపడేలా తండ్రిగా ఉండాలని రవి మోహన్‌కు హితవు పలికారు. తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని తమ వద్ద అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

అయితే సుజాత విజయ్‌కుమార్ వ్యాఖ్యలపై నటుడు రవి మోహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇన్‌స్టా గ్రామ్ స్టోరీస్ ద్వారా పరోక్షంగా స్పందిస్తూ.. కొందరు వ్యక్తులు కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ప్రవర్తించడం దురదృ ష్టకరమని మండిపడ్డారు. తాను బ్ర‌తికి ఉన్నంతవరకు తన నలుగురి కుటుంబ సభ్యులు ఒకే గదిలో ఉండే ప్రసక్తే లేదన్నారు. తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులకు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇరువర్గాల నుంచి వ‌స్తోన్న పరస్పర ఆరోపణలు, కోర్టు పరిణామాలు విడాకుల కేసుకు మరింత ప్రాధాన్యతను సంతరింపజేస్తున్నాయి. చట్టపరమైన పోరాటాలు సాగుతుండగానే కుటుంబ సభ్యులు మీడియా ద్వారా బయట పెడుతున్న వ్యక్తిగత విషయాలు సినీ వర్గాల్లో, అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News