దళపతి వారసుడి ముందు రెండు సవాళ్లు
`సిగ్మా` షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇటీవల పెండింగ్ పాట చిత్రీకరణను పూర్తి చేసారు. మేకర్స్ ప్రత్యేక డ్యాన్స్ ట్రాక్ కోసం అందాల కేథరిన్ ట్రెసాను ఎంపిక చేసుకున్నారని కథనాలొస్తున్నాయి.;
దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డెబ్యూ గురించి చాలా కాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడు తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నటుడు అవుతాడని భావిస్తే, అందుకు భిన్నంగా దర్శకత్వంలో అడుగుపెడుతున్నాడు. షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ లా నిరూపించుకోవాలనే తపన అతడికి ఉంది. జాసన్ విజయ్ యాక్షన్-అడ్వెంచర్ కామెడీ సిగ్మాతో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమా 2026లో థియేటర్లలో విడుదల కానుంది. టాకీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని కథనాలొస్తున్నాయి.
`సిగ్మా` షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇటీవల పెండింగ్ పాట చిత్రీకరణను పూర్తి చేసారు. మేకర్స్ ప్రత్యేక డ్యాన్స్ ట్రాక్ కోసం అందాల కేథరిన్ ట్రెసాను ఎంపిక చేసుకున్నారని కథనాలొస్తున్నాయి. అంతేకాదు జాసన్ విజయ్ ఈ ప్రత్యేక గీతంలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని ఇంకా మేకర్స్ ధృవీకరించాల్సి ఉంది. జాసన్ గతంలో తన తండ్రి దళపతి విజయ్‌తో కలిసి తమిళ సినిమా వేట్టై కారన్ (2009)లో బాల నటుడిగా కనిపించాడు. విజయ్ ఆంటోనీ స్వరపరిచిన `నాన్ అదిచా` పాటలో విజయ్ తో కలిసి జాసన్ నృత్యం చేశారు. ఆ తర్వాత అతడు నటిస్తున్న రెండో సినిమా సిగ్మా. అయితే డ్యాన్స్ నంబర్ లో అతడి ఆరంగేట్రాన్ని టీమ్ ధృవీకరించాల్సి ఉంది.
`సిగ్మా` ఆసక్తి రేకెత్తించే కథతో రూపొందుతోంది. ఇది తోడేలులా ఆలోచించే ఒక ఒంటరి కుర్రాడి కథ. అతడు సమాజాన్ని సవాల్ చేస్తాడు. నిధి వేటకు బయలుదేరుతాడు. ఆ తర్వాత నేరస్తులు, బంధిపోట్లతో అతడి గెలుపు పోరాటం ఎలా సాగిందనేది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు తెలిసింది. జాసన్ సంజయ్ స్వయంగా ఈ సినిమాకి స్క్రిప్టు రచయిత. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ స్వరాల్ని అందిస్తున్నారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మగలక్ష్మి సుదర్శనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పలువురు పెద్ద తారలు అతిథులుగా కనిపించే వీలుందని కూడా తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కథను దుల్కార్ సల్మాన్ కి వినిపించగా, అతడు ఆసక్తిని కనబరిచాడు.. కానీ కాల్షీట్ల సమస్య కారణంగా తప్పుకున్నట్టు కథనాలొచ్చాయి. ఆ తర్వాత టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ ఈ చిత్రానికి ఎంపికయ్యాడు.
ఓవైపు తన తండ్రి చివరి సినిమాలో నటించి రాజకీయాల్లోకి పూర్తిగా దిగిపోతుంటే, జాసన్ మాత్రం దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. అయితే జాసన్ కి డెబ్యూ దర్శకుడిగా రెండు సవాళ్లు ముందున్నాయి. ఒకటి దర్శకత్వంలో నిరూపించడం, రెండోది తన తండ్రిని మించిన డ్యాన్సర్ గా నిరూపించడం.. నిజానికి ఇది అంత సులువైనది కాదు. దీనికోసం జాసన్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దళపతి విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ 9 జనవరి 2026న విడుదలవుతుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే ఇతర కీలక పాత్రలు పోషించారు.