అవతార్ దర్శకుడు కామెరూన్ మరో సంచలనం
`టైటానిక్` తర్వాత `అవతార్` ఫ్రాంఛైజీతో జేమ్స్ కామెరూన్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.;
`టైటానిక్` తర్వాత `అవతార్` ఫ్రాంఛైజీతో జేమ్స్ కామెరూన్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అవతార్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు అసాధారణ వసూళ్లతో రికార్డులు సృష్టించాయి. అతడు తెరకెక్కిస్తున్న అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) 2025లో విడుదల కానుండగా, 2029లో అవతార్ 4, 2032లో అవతార్ 5 చిత్రాలు విడుదలకు వస్తున్నాయి.
అవతార్ కాని మరో కొత్త సినిమా..
అయితే ఇప్పుడు జేమ్స్ కామెరూన్ `అవతార్` కాని మరో కొత్త సినిమాని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఓవైపు అవతార్ ఫ్రాంఛైజీ నుంచి ఇంకా మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉండగా, అతడు మరో కొత్త కథను ఎంపిక చేసుకుని సినిమాని కూడా ప్రకటించేశాడు. ఈ చిత్రం పూర్తిగా అవతార్ కంటే భిన్నమైనది. టైటానిక్ తరహాలోనే భావోద్వేగాల పరాకాష్ఠకు అవకాశం ఉన్న సినిమా. టైటానిక్ కథ తర్వాత తనకు అత్యంత బాగా నచ్చిన, శక్తివంతమైన కథాంశం ఇది అని చెప్పారు కామెరూన్.
మొదటి 20ని.లు లో వెళ్లిపోకుండా ఆపాలి:
ఈసారి హిరోషిమా(జపాన్)పై అణుబాంబ్ దాడి నేపథ్యంలో కథను ఎంపిక చేసుకున్నారు. కామెరూన్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇది నిజంగా ఒక సంచలన నిర్ణయం. తన దీర్ఘకాల సహకారి చార్లెస్ పెల్లెగ్రినో రాసిన `ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా` పుస్తకం ఆధారంగా దీనిని తెరకెక్కిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి అణు దాడి నేపథ్యంలో ఆద్యంతం హృదయాలను కలచివేసే దృశ్యాలతో ఈ చిత్రం ఎమోషన్ ని రగిలించేలా కామెరూన్ తెరకెక్కిస్తానని చెబుతున్నారు. కథ ఆగస్టు 6న మొదలవుతుంది. హిరోషిమా బాంబు దాడి 80వ వార్షికోత్సవం ఈరోజు. అణు యుద్ధం ఎప్పుడూ లేనంతగా భయానక జ్ఞాపకంగా మిగిలింది. అయితే పుస్తకంలోని కథను ఉన్నదున్నట్టు తీస్తే మొదటి 20నిమిషాల్లోనే జనం థియేటర్ల నుంచి వెళ్లిపోవడానికి ఆస్కారం ఉంది. అయితే ప్రేక్షకుడు అనుభూతి చెందేలా, సినిమాలో నిమగ్నమయ్యేలా అద్భుతంగా తెరకెక్కించాల్సి ఉంటుందని కామెరూన్ అభిప్రాయపడ్డారు.
బాంబ్ దాడిపై అన్వేషణ:
ఇక తన సహచర రచయిత చార్లెస్ పెల్లెగ్రినో రాసిన అసాధారణమైన కొత్త పుస్తకం `ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా ప్రచురణ దినోత్సవాన్ని ప్రకటించిన కామెరూన్ చాలా కాలానికి శక్తివంతమైన నిజకథను కనుగొన్నానని వెల్లడించారు. టైటానిక్ కోసం కలిసి పనిచేసినప్పటి నుండి కామెరాన్ పెల్లెగ్రినోతో సన్నిహితుడిగా మారారు. ఇప్పుడు హిరోషిమా బాంబు దాడిపై పూర్తిగా అన్వేషించాలి. పూర్తిగా పరిశోధించాలి. టైటానిక్ కథ కోసం నేను టైటానిక్ శిథిలాలను సముద్ర గర్భంలో 33 సార్లు అన్వేషించాను. నేను నిజంగా దేనికీ భయపడను అని ఆయన అన్నారు. అలాగే సినిమాలు మాత్రమే మనల్ని రక్షించగలవని కామెరాన్ భావించనని చెప్పారు. నాన్ అవతార్ కేటగిరీలో అతడు రూపొందించనున్న కొత్త చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.
ఇక కథ విషయానికి వస్తే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకి ప్రాంతాలపై దుష్ట అగ్ర రాజ్యం అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఇది భయానకమైన యుద్ధం.. ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయింది. దీనికి తెర రూపం ఇవ్వాలనే ఆలోచనే ఒక సాహసం.