రైట‌ర్ మాట్లాడితే ఎంతటి వారైనా నోళ్లు మూయాల్సిందే!

పరిశ్రమలో రచయితలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు , రాయల్టీల ప్రాముఖ్యతపై ఆయన తన అభిప్రాయాలను ఓపెన్ గా పంచుకున్నారు.

Update: 2026-09-12 17:33 GMT

'చక్ దే ఇండియా', 'బంటీ ఔర్ బబ్లీ', 'కంపెనీ' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కథనందించిన ప్రముఖ బాలీవుడ్ రచయిత, లిరిసిస్ట్ జైదీప్ సాహ్ని రచయితల హక్కుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ (SWA) నిర్వహించిన వార్తాలాప్ కార్యక్రమంలో పాల్గొన్న సంద‌ర్భంగా స్పందించారు. పరిశ్రమలో రచయితలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు , రాయల్టీల ప్రాముఖ్యతపై ఆయన తన అభిప్రాయాలను ఓపెన్ గా పంచుకున్నారు.

స్క్రిప్ట్ గురించి జైదీప్ సాహ్ని ఓ పవర్‌ఫుల్ వ్యాఖ్య చేశారు. 'పేజీ (స్క్రిప్ట్) మాట్లాడటం మొదలుపెడితే ఎంతటి పెద్దవారైనా సరే నోళ్లు మూసుకోవాల్సిందే`న‌ని స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో రచయిత , నిర్మాత మధ్యే అత్యుత్తమ భాగస్వామ్యం ఉండాలని కథే ప్రధానం కాబట్టి ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మెలిగినప్పుడే అద్భుతమైన చిత్రాలు రూపుదిద్దుకుంటాయని అభిప్రాయపడ్డారు.

రచయితలకు లభించే రాయల్టీల ప్రాముఖ్యత గురించి స్పందించారు. రాయల్టీలు అనేవి అదనపు బోనస్ కాదని అవి రచయితల అసలైన మజిల్ అండ్ పవర్ అని జైదీప్ అభివర్ణించారు. రచయితలకు నచ్చని పనిని ధైర్యంగా నిరాకరించే శక్తినీ, ధైర్యాన్నీ రాయల్టీలే అందిస్తాయని తెలిపారు. స్క్రీన్ రైటర్స్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SRAI) ద్వారా రాయల్టీల హక్కుల కోసం జరుగుతోన్న పోరాటానికి పూర్తి మద్దతును ప్రకటించారు.

జావేద్ అక్తర్, అంజుమ్ రాజబలి వంటి సీనియర్లు రచయితల రాయల్టీ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేశారని జైదీప్ గుర్తు చేశారు. ఇది ఏదో ఊహాజనిత విషయం కాదని.. నిశ్చితమైన హక్కుగా పేర్కొన్నారు. ఒక సినిమా లేదా ఎపిసోడ్‌లో పాక్షికమైన క్రెడిట్ ఉన్నప్పటికీ ఆ రాయల్టీ సొమ్ము రచయితలకే కాకుండా వారి తర్వాత వారి పిల్లలకు, కుటుంబాలకు కూడా నిరంతరం ఆర్థిక భరోసానిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదల గురించి కంప్యూటర్ ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న జైదీప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికత పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ మరోవైపు తీవ్ర భయం కూడా కలుగు తోందన్నారు. బయటకు అందుబాటులోకి వచ్చే వెర్షన్ల కంటే ఐటీ సంస్థలు బయటకు విడుదల చేయని మోడల్స్ 100 రెట్లు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరించారు. సమయం వేగంగా మించిపోతోందని, త్వరలోనే చర్యలు తీసుకోకపోతే ఆలస్యమైపోతుందని పేర్కొన్నారు.

విభా సింగ్ నిర్వహించిన ఈ సమావేశంలో జైదీప్ సాహ్ని చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారాయి. తమ కష్టానికి తగిన ప్రతిఫలం, హక్కులు , రాయల్టీలను పొందడంలో రచయితలు వెనకడుగు వేయకూడదని, నాణ్యమైన రచనలతోనే తమ సత్తా ఏంటో పరిశ్రమకు చాటాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News