కుమారుడు కోసం వార్ లోకి దిగిన డాడ్!
45 కోట్లు డిమాండ్ అనే అంశం రణ్‌వీర్ సింగ్ పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన జగ్‌జిత్ సింగ్ భవ్నాని తీవ్రంగా స్పందించారు.
బాలీవుడ్‌లో `డాన్ 3` చిత్రం చుట్టూ వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో, రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించాల్సిన ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ తప్పుకున్నాడంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ఆయన ఏకంగా 45 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు లేదా నష్టపరిహారం డిమాండ్ చేశారంటూ కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వెలువడడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో డాన్ వివాదంలో రణవీర్ సింగ్ తండ్రి జగ్ జిత్ సింగ్ భవ్నానీ ఎంటర్ అయ్యారు.
45 కోట్లు డిమాండ్ అనే అంశం రణ్‌వీర్ సింగ్ పబ్లిక్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని భావించిన జగ్‌జిత్ సింగ్ భవ్నాని తీవ్రంగా స్పందించారు. తన కుమారుడిపై వస్తోన్న ఆరోపణలను ఖండించడమే కాకుండా ఈ విషయంలో న్యాయం కోసం రంగంలోకి దిగారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMMPA) ను అధికారికంగా ఆశ్రయించి వివాదంపై ఫిర్యాదు చేశారు.
చిత్ర యూనిట్‌కు - రణ్‌వీర్ సింగ్‌కు మధ్య సయోధ్య కుదర్చాలని లేదా తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఐఎంపీపీఏ అధికారులను కలిశారు. సినిమా నుంచి ఎలాంటి ముందస్తు నష్టపరిహారాలు ఆశించకుండానే రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారని.. కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలు సృష్టిస్తున్నారని జగ్ జిత్ వాదించారు. ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ - రణ్‌వీర్ మధ్య ఎలాంటి మనస్పర్థలు ఉన్నాయో నిగ్గు తేల్చాలని కోరారు.
దర్శకుడు ఫర్హాన్ అక్తర్ -నిర్మాత రితేష్ సిధ్వానీలకు చెందిన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రాజెక్ట్ పనులను మరింత ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. అయితే రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్ - 45 కోట్ల వివాదం వెనుక అసలు నిజం ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ గ్యాప్ మరింత పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇండస్ట్రీలో బిగ్ బడ్జెట్ సినిమాల విషయంలో ఇలాంటి వివాదాలు తలెత్తడం కొత్తేమీకాదు. అయితే స్టార్ హీరో తండ్రి స్వయంగా రంగంలోకి దిగి అసోసియేషన్‌ను ఆశ్రయించడం మాత్రం ఇదే మొదటిసారి. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌పై ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
మొత్తానికి `డాన్ 3` సెట్స్ కి వెళ్లకముందే లీగల్ -ఫైనాన్షియల్ వివాదాల్లో చిక్కుకోవడం చిత్ర యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది. ఐఎంపీపీఏ జోక్యంతో ఈ వివాదానికి త్వరలోనే తెరపడుతుందా ?లేదా? ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుందా అనేది చూడాలి. అలాగే ఈ వివాదం గురించి ఇంత వరకూ రణవీర్ సింగ్ కూడా నేరుగా మీడియా ముందుకొచ్చి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో రణవీర్ సీన్ లోకి వస్తారా? లేదా? అన్నది చూడాలి.