వంగా.. 'స్పిరిట్' దగ్గరే డబ్బుల పరీక్ష

ఇక్కడే వంగాకు అసలు పరీక్ష మొదలవుతుంది. చిన్న సినిమా తీసి పెద్ద డబ్బు తెచ్చుకోవడం ఒకటి. పెద్ద సినిమా తీసి ఇంకా పెద్ద రిటర్న్ ఇవ్వడం మరోటి.

Update: 2026-08-21 15:30 GMT

సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు చేసిన సినిమాల లెక్క చూస్తే ఒక్కో దశలో ఒక్కో మెట్టు ఎక్కినట్టుంది. ‘అర్జున్ రెడ్డి’ సింగిల్ డిజిట్ బడ్జెట్‌లో వచ్చి 50 కోట్లతో భారీ లాభాలు తెచ్చింది. అదే కథను హిందీలో ‘కబీర్ సింగ్’గా తీసుకెళ్లి అక్కడ వందల కోట్లతో పెద్ద హిట్ కొట్టాడు. ‘యానిమల్’తో అయితే మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కలెక్షన్స్ లెక్క 900 కోట్ల వరకు వెళ్ళింది. ఇప్పుడు వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మాత్రం ఖర్చు, అంచనాలు రెండూ మరో స్థాయిలో ఉండటం ఖాయం.

‘అర్జున్ రెడ్డి’ సమయంలో వంగాకు పెద్ద స్టార్ మార్కెట్ లేదు. కథ, హీరో క్యారెక్టర్, టాక్ మీదే సినిమా పరుగెత్తింది. ‘కబీర్ సింగ్’ దగ్గర షాహిద్ కపూర్ మార్కెట్ తోడైంది. ‘యానిమల్’లో రణబీర్ కపూర్ ఉండడంతో మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ చివరకు సినిమా నిలబడింది మాత్రం కంటెంట్ మీదే. ఈ మూడు సినిమాల్లో వంగా పెట్టిన స్కేల్‌కు వచ్చిన రిటర్న్ చాలా ఎక్కువ.

‘స్పిరిట్’ దగ్గర మాత్రం మొదటి నుంచే లెక్క వేరు. ప్రభాస్ సినిమా అంటే ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ బిజినెస్ జరుగుతుంది. పైగా ‘యానిమల్’ తర్వాత వంగా పేరు కూడా ఇప్పుడు ఓపెనింగ్స్ తెచ్చే స్థాయికి వచ్చింది. అంటే హీరో మార్కెట్ ఒక వైపు, దర్శకుడి క్రేజ్ మరోవైపు. దీంతో సినిమా మొదటి రోజు ఎంత తెస్తుంది అన్నదానికంటే చివరికి ఎంత వరకు వెళ్తుంది అన్నదే పెద్ద లెక్క.

ఇక్కడే వంగాకు అసలు పరీక్ష మొదలవుతుంది. చిన్న సినిమా తీసి పెద్ద డబ్బు తెచ్చుకోవడం ఒకటి. పెద్ద సినిమా తీసి ఇంకా పెద్ద రిటర్న్ ఇవ్వడం మరోటి. ‘స్పిరిట్’కు ఖర్చు ఎంత అనేది బయటకు రాలేదు. కానీ ప్రభాస్, భారీ యాక్షన్ సెటప్, పాన్ ఇండియా రిలీజ్ అన్నీ చూస్తే 350-400 కోట్లకు తక్కువగా ఉండదని తెలుస్తోంది.

‘బాహుబలి 2’, ‘కల్కి 2898 ఏడీ’తో వెయ్యి కోట్ల మార్క్ చూసిన హీరో కావడంతో ‘స్పిరిట్’కి ఇప్పుడు రూ.1000 కోట్లు కూడా పెద్ద టార్గెట్‌లా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో, ట్రేడ్ అంచనాల్లో రూ.2000 కోట్ల వరకు వెళ్లే సినిమా ఇదే కావచ్చనే తెలుస్తోంది. అది వినడానికి భారీ నంబర్ అయినా పూర్తిగా కొట్టేయలేం. వంగా కంటెంట్ క్లిక్ అయితే సినిమా లాంగ్ రన్ ఎలా ఉంటుందో ‘యానిమల్’ ఇప్పటికే చూపించింది.

ప్రభాస్‌కు సౌత్, నార్త్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా పెద్ద మార్కెట్ ఉంది. ఇద్దరి క్రేజ్ ఒకేసారి పని చేసి, టాక్ కూడా గట్టిగా పడితే రూ.2000 కోట్ల లెక్క దగ్గరకు వెళ్లే అవకాశం గురించి మాట్లాడటం తప్పేమీ కాదు. వంగా ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో కథతోనే బడ్జెట్‌ను మించిపోయే రిటర్న్ తెచ్చాడు. ‘స్పిరిట్’లో మాత్రం ముందే భారీ మార్కెట్ ఉంది. అందుకే ఈసారి హిట్ కొట్టడం మాత్రమే కాదు.. ఆ పెద్ద మార్కెట్‌కు తగ్గ రేంజ్‌లో సినిమా ఎంత దూరం వెళ్తుందన్నదే చూడాలి. వంగాకు ఇప్పటివరకు లేని డబ్బుల పరీక్ష అసలు ‘స్పిరిట్’ దగ్గరే మొదలవుతోంది.

Tags:    

Similar News