చియాన్ విక్రమ్ కెరీర్ డైలమా: ప్రయోగాలు సరిపోవు.. బ్లాక్‌బస్టర్ పడాల్సిందే!

విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత అంతటి ప్రయోగాత్మక నటుడిగా చియాన్ విక్రమ్‌కు దక్షిణాదిలో మంచి పేరుంది.;

Update: 2026-04-14 04:10 GMT

విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత అంతటి ప్రయోగాత్మక నటుడిగా చియాన్ విక్రమ్‌కు దక్షిణాదిలో మంచి పేరుంది. విభిన్నమైన పాత్రలు, గెటప్పుల కోసం అత‌డు పడే శ్రమ వెండితెరపై స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తూ గత కొంతకాలంగా విక్రమ్ రేసులో వెనుకబడ్డారు. తంగలాన్, వీర ధీర సూరన్ వంటి చిత్రాలు నటుడిగా ఆయనకు మంచి మార్కులు వేసినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం పాన్ ఇండియా రేంజ్ హిట్లుగా నిలవలేకపోయాయి. కేవలం యావరేజ్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

చియాన్ కెరీర్‌లో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్`ఫ్రాంచైజీ ఒక మైలురాయిగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ ఆ భారీ మల్టీస్టారర్ వల్ల విక్రమ్ వ్యక్తిగత మార్కెట్‌కు కలిసొచ్చిందేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాలో ఆదిత్య కరికాలన్‌గా ఆయన నటన అద్భుతమనిపించినా అది సోలో హిట్ గౌరవాన్ని అందించలేకపోయింది. ఈ క్రమంలోనే విక్రమ్ తన 63, 64, 65 సినిమాలను వరుసగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రంపై అంచనాలు ఉన్నా అది సోలో హిట్టిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. కమల్ హాసన్ తన వయసు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర భాషల స్టార్లతో కలిసి `విక్రమ్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తో భారీ కంబ్యాక్ ఇచ్చినట్టుగా.. చియాన్ కూడా ఇరుగు పొరుగు భాషల స్టార్లతో చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. కేవలం సోలో ప్రయోగాలకే పరిమితం కాకుండా.. భారీ ప్రాజెక్టులలో భాగస్వామి అయితేనే అత‌డి కెరీర్ మళ్లీ గాడిలోకి వస్తుంది. అభిమానులు ఆశిస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ పడే వరకు చియాన్ మార్కెట్ పరిస్థితి ఇలాగే ఊగిసలాటలో ఉండే ప్రమాదం ఉంది.

విక్రమ్ ప్రకటించిన మూడు సినిమాలలో 64వ - 65వ చిత్రాల దర్శకుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళనతో పాటు ఆసక్తి కూడా నెలకొంది. గతంలో అత‌డు చేసిన శివపుత్రుడు, అపరిచితుడు, 'నాన్న, ఐ వంటి అద్భుతమైన ప్రయోగాలు ఇప్పుడు సెట్స్ కెళుతున్న‌ సినిమాల్లో ఉన్నాయా? అన్నది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కేవలం మేకప్, గెటప్పులకే ప్రాధాన్యత ఇవ్వకుండా.. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా కమర్షియల్ హంగులు ఉన్న బలమైన కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చియాన్ విక్రమ్ తన తదుపరి సినిమాలతోనైనా ఆశించిన విజయాన్ని అందుకుని `చియాన్ ది గ్రేట్` అనిపించుకుంటారా? లేదా చూడాలి. త‌న గురువు, స్ఫూర్తి అయిన‌ కమల్ హాసన్ తరహాలో తెలివైన నిర్ణయాలు తీసుకుని.. తన ఫార్ములాను మార్చుకుంటేనే విక్రమ్ మళ్లీ బాక్సాఫీస్ రారాజుగా నిలవగలరు. ప్ర‌క‌టించిన‌ ఈ మూడు సినిమాలు విక్రమ్ కెరీర్‌కు అత్యంత కీలకం కానున్నాయి. ఇవి గనుక క్లిక్ అయితేనే ఆయన మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకొస్తుంది.

Tags:    

Similar News