అవతార్ 3 తెలుగు డైలాగ్స్.. ఈసారి కూడా అతనేనా?
అయితే ఇప్పుడు అవతార్ 3 విషయానికి వచ్చేసరికి.. ఈ సినిమాకు కూడా శ్రీనివాస్ అవసరాలనే పని చేశారా లేక వేరే ఎవరితోనైనా రాయించారా అనే విషయంపై క్లారిటీ లేదు.;
ప్రపంచ సినీ చరిత్రలో అద్భుతాలు సృష్టించిన అవతార్ సిరీస్ నుంచి ఇప్పుడు మూడో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ కోసం ఇండియాలోని సినిమా ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే ఇక్కడ రీజినల్ భాషల్లో ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు.
అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో తెలుగు వెర్షన్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ఫిలిం సర్కిల్స్ లో నడుస్తోంది. అదే ఈ సినిమాకు తెలుగు మాటలు ఎవరు రాశారు అనేది. సాధారణంగా ఒక పరభాషా సినిమా మన దగ్గర విజయం సాధించాలంటే అందులో డబ్బింగ్ క్వాలిటీ చాలా ముఖ్యం. అందులోనూ అవతార్ లాంటి సినిమా అన్నప్పుడు మాటలు ప్రేక్షకుడి గుండెకు హత్తుకునేలా ఉండాలి.
గతంలో వచ్చిన అవతార్ 2 సినిమాకు టాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెలుగు డైలాగ్స్ అందించారు. ఆయన కేవలం అనువాదం లాగా కాకుండా, మన తెలుగు నేటివిటీకి, ఆ భావోద్వేగాలకు తగ్గట్టుగా మాటలు రాశారు. అందుకే ఆ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ మాటల వల్ల సినిమాలోని ఎమోషన్స్ మన ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.
అయితే ఇప్పుడు అవతార్ 3 విషయానికి వచ్చేసరికి.. ఈ సినిమాకు కూడా శ్రీనివాస్ అవసరాలనే పని చేశారా లేక వేరే ఎవరితోనైనా రాయించారా అనే విషయంపై క్లారిటీ లేదు. సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పే రచయితల పేర్లను నిర్మాణ సంస్థలు పెద్దగా హైలైట్ చేయవు. పోస్టర్ల మీద కూడా వారి పేర్లు కనిపించవు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈసారి కూడా శ్రీనివాస్ అవసరాలనే మాటలు రాసి ఉండవచ్చని అంటున్నారు.
ఎందుకంటే రెండో భాగానికి ఆయన పనితనం బాగా కుదిరింది కాబట్టి, మేకర్స్ ఆయన్నే కంటిన్యూ చేసి ఉంటారని ఒక అంచనా. మరోవైపు శ్రీనివాస్ అవసరాల ప్రస్తుతం తన సొంత సినిమాలతో, నటనతో కాస్త బిజీగా ఉన్నారు. ఒకవేళ డేట్స్ కుదరక ఆయన తప్పుకుంటే, రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలకు రాసే రచయితలతో పని కానిచ్చేసి ఉండే అవకాశం కూడా లేకపోలేదు.
అవతార్ 2 రిలీజ్ సమయంలో శ్రీనివాస్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన అనుభవాలను పంచుకున్నారు. మరి ఈసారి ఆయన బయటకు వస్తారా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా అవతార్ లాంటి భారీ విజువల్ వండర్ కు మాటల సాయం కూడా తోడైతేనే ఆ కిక్ ఉంటుంది. మరి ఆ మ్యాజిక్ ఈసారి ఎవరు చేశారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.