మరో హిట్ కోసం ఇద్దరు యంగ్ హీరోల పరుగు

Update: 2020-12-31 01:30 GMT
టాలీవుడ్ యంగ్ హీరోల్లో రామ్ .. నితిన్ ఇద్దరికీ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెరపై కనిపిస్తున్నంత సేపు రామ్ తన జోష్ చూపిస్తూనే ఉంటాడు. కథలోని ప్రతి అంశాన్ని ఆయన తనతో పాటు పరుగులు పెట్టిస్తూనే ఉంటాడు. తన పాటల్లోను .. డాన్సుల్లోను ఆయన తనదైన మార్క్ కనిపించేలా చూసుకుంటాడు. ఇక నితిన్ కూడా తనదైన స్టైల్ తో యూత్ ను ఆకట్టుకుంటూ, లుక్ విషయంలోను .. కథ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు వెళుతుంటాడు. పరాజయాలు ఎదురైనా .. పట్టుదలతో ముందుకు వెళ్లి హిట్లు పట్టుకున్న తీరు ఈ ఇద్దరిలోను కనిపిస్తుంది.

క్రితం ఏడాది రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చాలా విభిన్నమైన పాత్రను పోషించాడు. లుక్ పరంగా కొత్తగా కనిపిస్తూ .. మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటివరకూ చాక్లెట్ బాయ్ గా అమ్మయిల మనసు దోచుకున్న రామ్, ఈ సినిమాతో మాస్ హీరోగా కూడా మెప్పించగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లతో రామ్ చేసిన అల్లరికి ఫిదా అయిన ఆడియన్స్ ఆయనకి భారీ సక్సెస్ ను ముట్టజెప్పారు. రామ్ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

ఇక ఈ ఏడాది ఆరంభంలో నితిన్ 'భీష్మ' సినిమాతో సందడి చేశాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మునుపటికన్నా హ్యాండ్సమ్ గా నితిన్ కనిపించాడు. లవ్ కి  యాక్షన్ కామెడీని మిక్స్ చేసి అందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. సరైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న నితిన్ ముచ్చట తీర్చింది. ఇలా చెరో హిట్ అందుకున్న ఈ ఇద్దరు యంగ్ హీరోలు .. న్యూ ఇయర్లో మరో హిట్ కొట్టాలనే కసితో రంగంలోకి దిగుతున్నారు.

గతంలో తనకి మంచి హిట్లు ఇచ్చిన కిషోర్ తిరుమలతో రామ్ 'రెడ్' సినిమా చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. మాస్ పాళ్లు ఎక్కువగానే ఉన్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఆయన సరసన ఆడిపాడనుండటం విశేషం. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమాతో నితిన్ థియేటర్లకు రానున్నాడు. రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. పక్కా ప్లానింగ్ తో పకడ్బందీగా రంగంలోకి దిగుతున్న ఈ ఇద్దరు హీరోలు, వచ్చే ఏడాదిలో హిట్ తోనే తమ రేస్ ను కొనసాగిస్తారేమో చూడాలి.  
Tags:    

Similar News