తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ భేటీ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి...!

Update: 2020-10-03 09:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల గత ఏడు నెలలుగా థియేటర్స్ మూతబడిపోయి ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో థియేటర్స్ మల్టీప్లెక్సెస్ తెరుచుకోనున్నాయి. అక్టోబరు 15 నుంచి సినిమా థియేట‌ర్లు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అయితే హాల్ లో సీటింగ్ కెపాసిటీని 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35MM థియేటర్ లో తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పడంపై హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో థియేటర్స్ రీ ఓపెన్ చేయడానికి తీసుకోవాల్సిన విధి విధానాలపై చర్చించారు. మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభం నుండి బయటపడటానికి ప్రభుత్వం నుండి కొన్ని మినహాయింపులు కోరుతూ.. వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ లో ఒక సీటు తప్పించి మరో సీటులో ప్రేక్షకుడిని కూర్చోబెట్టాలని.. ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. థియేటర్ ఎంట్రెన్స్ మరియు ఎగ్జిట్ లలో శానిటైజర్స్ కచ్చితంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ ఇండస్ట్రీ చావు బ్రతుకులో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని.. ప్రతీ థియేటర్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇవ్వాలని.. లాక్ డౌన్ సమయంలో థియేటర్ ల విద్యుత్ బిల్ మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో పార్కింగ్ చార్జెస్ ను నిషేధించిందని.. తక్షణమే వాటిని ఎత్తివేయాలని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News