రామ్... ఆ నిరీక్ష‌ణ ఎందుకు?

Update: 2016-02-10 15:30 GMT
ఫ్లాప్ వ‌స్తే ఓకే కానీ... హిట్టు కొట్టాక  ఇక ఆలోచించ‌డం దేనికి?  ఒక వేళ ఆలోచిస్తూ కూర్చుందామ‌న్నా ఆ అవ‌కాశం ఇవ్వ‌రంతే. చుట్టూ జ‌నాలు గుమిగూడేస్తుంటారు. ఇదిగో ఈ క‌థ  వినండీ, అదిగో అదైతే మీకు బాగుంటుంద‌ని ఊద‌ర‌గొట్టేస్తుంటారు. ఆ వేడిలో ట‌క‌ట‌కా నిర్ణ‌యాలు తీసేసుకొని చ‌క‌చ‌కా సినిమాని ప‌ట్టాలెక్కిస్తుంటారు కథానాయ‌కులు. కానీ రామ్ మాత్రం అలా చేయ‌ట్లేదు. ఫ్లాప్ వ‌చ్చాకే మ‌రింత క‌సితో ఎడా పెడా సినిమాలు  చేశాడాయ‌న. ఇప్పుడేమో హిట్టొచ్చాక ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. నేను శైల‌జ వ‌చ్చి నెల‌కి పైనే అవుతోంది. ఇంకా రామ్ నుంచి కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అందుకు కార‌ణ‌మేంటో తెలియ‌దు మ‌రి! నేను శైల‌జ అదిరిపోయే హిట్టు. దీంతో బోలెడుమంది ద‌ర్శ‌కులు రామ్ కోసం క్యూ క‌ట్టారు. అందులో  పెద్ద ద‌ర్శ‌కులు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అయినా స‌రే రామ్ మాత్రం తొంద‌ర‌ప‌డ‌టం లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఇదివ‌ర‌క‌టిలా ఎడా పెడా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం కంటే క‌థ‌లు గురించి కాస్త ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌నేది రామ్ ప్లాన్ అట‌. అందుకే ఎంత‌మంది ద‌ర్శ‌కులొచ్చినా క‌థ విష‌యంలో బాగా ఆలోచిస్తున్నాట‌. అందులో భాగంగానే ఈ గ్యాప్ అని తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు రామ్‌కి  శ్రీనువైట్ల క‌థ వినిపించిన‌ట్టు తెలిసింది. ఆ క‌థ రామ్‌కి న‌చ్చినా ట్రీట్ మెంట్ మాత్రం ట్రెండీగా ఉండాల‌ని, పొర‌పాటున కూడా ఢీ, రెఢీల ఫార్ములా అందులో క‌నిపించ‌కూడ‌ద‌ని చెప్పాడ‌ట‌. అందుకే ఇప్పుడు ఆ క‌థ‌కి రిపేర్లు జ‌రుగుతున్నాయట‌. అవ‌న్నీ ఓకే అయ్యాక‌, రామ్‌కి న‌చ్చితేనే శ్రీనువైట్లతో సినిమా మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. సంతోష్ శ్రీనివాస్ కూడా రామ్ కోసం క‌థ త‌యారు చేశాడ‌ట‌. వీళ్లిద్ద‌రూ ఇదివ‌ర‌కు రామ్‌తో సినిమాలు చేసిన‌వాళ్లే. మ‌రి రామ్ వీళ్ల‌కే అవ‌కాశాలు ఇస్తాడో లేదంటే మ‌ళ్లీ కొత్త ద‌ర్శ‌కుల్నే న‌మ్ముకొంటాడో చూడాలి.
Tags:    

Similar News