మెగా'ధీర'ల కలయిక ఖాయమేనా?

Update: 2017-09-14 04:57 GMT
రాజమౌళి.. రామ్ చరణ్.. ఈ కాంబో సృష్టించిన సెన్సేషన్ సామాన్యమైనది కాదు. మగధీర మూవీతో వీరు సృష్టించిన చరిత్ర చెరిగేందుకు చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత ఇప్పటివరకూ ఏ రికార్డు ఎక్కువగా నిలబడలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ కానుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణాలు కూడా చెప్పేస్తున్నారు సినిమా జనాలు.

అవేవో విబేధాల పేరుతో మెగా హీరోలతో రాజమౌళి సినిమా చేయడం కష్టమని గతంలో అన్నారు కానీ.. ఇప్పుడు సిట్యుయేషన్స్ చాలానే మారిపోయాయి. మొదటగా సైరా నరసింహారెడ్డి లాంఛింగ్ ను.. రాజమౌళి చేతుల మీదుగా చేయించిన సంగతి తెలిసిందే. అయితే.. సైరాకు నేషనల్ వైడ్ గా అటెన్షన్ లభించేందుకు ఇలా చేశారని మొదట భావించారు. ఆ తర్వాత.. రాజమౌళి తండ్రి.. మగధీర రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన శ్రీవల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ హాజరయ్యాడు. అక్కడ విజయేంద్ర ప్రసాద్ ను విపరీతంగా ప్రశంశించాడు  మెగా పవర్ స్టార్. అయితే.. చిరు.. చరణ్ లపై లెక్కకు మించిన పొగడ్తలను విజయేంద్ర ప్రసాద్ కురిపించడం చర్చకు దారి తీసింది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అయితే ఈ స్టార్ రైటర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాము చిరంజీవితో సినిమా చేద్దామని భావించి.. దాన్ని కొంచెం మార్చి మగధీర తీశామని.. ఇప్పుడు చిరంజీవి-రామ్ చరణ్ ల కాంబినేషన్ లో సినిమా తీయాలని భావిస్తున్నట్లు చెప్పారాయన. అలాగని ఇదేమీ ఫైనల్ స్టేట్మెంట్ అయిపోదు. కానీ విజయేంద్ర ప్రసాద్ లాంటి ఓ రైటర్ ఇంత పెద్ద విషయాన్ని బైటకు చెప్పారంటే.. ఆ కథను వండే ప్రక్రియ ఇఫ్పటికే మొదలుపెట్టేసి ఉండొచ్చని సినీ జనాల అంచనా. ఈ అన్ని సిట్యుయేషన్స్ ను ఒక చోటకు చేర్చితే.. మగధీర- దర్శకధీరలు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యేందుకు అవకాశాలున్నాయని టాక్.
Tags:    

Similar News