నిజమా.. ఆ సినిమా బాలీవుడ్‌ కు వెళ్తోందా?

Update: 2016-02-11 19:30 GMT
కొత్త సినిమా విడుదలైనపుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. ఈ మధ్య టాలీవుడ్ లో ఓ కొత్త సంస్కృతి కనిపిస్తోంది. సినిమా విడుదలైన రెండు రోజులకు ప్రెస్ మీట్ పెట్టి.. ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నామనో, వేరే భాషల నుంచి రీమేక్ కోసం ఆఫర్లు వస్తున్నాయనో చెప్పడం ప్యాషన్ అయిపోయింది. పూరి జగన్నాథ్ తన ప్రతి సినిమాకూ ఇలాంటి ముచ్చట్లే చెబుతుంటారు. ‘లయన్’ లాంటి ఫ్లాప్ మూవీని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నట్లు దాని దర్శకుడు సత్యదేవా చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఐతే పూరి రీమేక్ అని, సీక్వెల్ అని చెప్పిన ఏ ముచ్చటా కార్యరూపం దాల్చలేదు. లయన్ రీమేక్ సంగతీ అలాగే అయింది. టాలీవుడ్ లో ఇలాంటి కథలు ఇంకా చాలానే ఉన్నాయి.

తాజాగా దర్శకుడు నరసింహ నంది చెబుతున్న మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. చలం ప్రఖ్యాత నవల ‘మైదానం’ను చిత్రానువాదం చేస్తూ ఆయన తీసిన ‘లజ్జ’ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పోస్టర్ల మీద బోలెడంత బూతు చూపించి ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేసిన నరసింహ నంది.. ‘మైదానం’ నవల గొప్పదనాన్ని తెరమీదికి తీసుకురాలేకపోయాడన్న విమర్శలు వచ్చాయి. తన సినిమా ఓ దృశ్యకావ్యం అని విడుదలకు ముందు చెప్పుకున్న నరసింహ నంది.. ఇప్పుడు ‘లజ్జ’ గురించి ఇంకా గొప్ప కబుర్లే చెబుతున్నాడు. సినిమా మీద పెట్టుబడి అంతా వెనక్కి వచ్చేసిందని.. పైగా బాలీవుడ్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి మంచి ఆఫర్లు వస్తున్నాయని అంటున్నాడు. ఆ ఆఫర్లలో వాస్తవం ఎంతో.. ఈ సినిమా హిందీలో ఎప్పుడు తెరకెక్కుతుందో చూద్దాం.
Tags:    

Similar News