టాలీవుడ్ లో మ‌రో లెజెండ‌రీ న‌టుడి బ‌యోపిక్!

Update: 2018-05-28 07:34 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. లెజెండ‌రీ న‌టి సావిత్రి బ‌యోపిక్ `మ‌హాన‌టి` బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. మ‌రోవైపు, నంద‌మూరి బాల‌కృష్ణ‌-క్రిష్ ల కాంబోలో ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. మ‌మ్ముట్టి లీడ్ రోల్ లో దివంగ‌త నేత‌, వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి బ‌యోపిక్ `యాత్ర‌` షూటింగ్ ఈ నెల 18 నుంచి రెగ్యుల‌ర్ గా ప్రారంభం కాబోతోంది. ఇవి కాక‌....వ‌ర్మ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్`, కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర రెడ్డి`ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం`...వంటి ప్రాజెక్టులు టాలీవుడ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎన్టీఆర్ త‌రం నాటి మ‌రో లెజెండ‌రీ న‌టుడి బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతోంది. త్వ‌ర‌లోనే కాంతారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా `అన‌గ‌న‌గా ఓ రాకుమారుడు` బ‌యోపిక్ ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు పీసీ ఆదిత్య ప్ర‌క‌టించారు.

టాలీవుడ్ లో పౌరాణిక చిత్రాల పేర్లు చెప్ప‌గానే ఎన్టీఆర్ తో పాటు కాంతారావు పేరు కూడా గుర్తుకు వ‌స్తుంది. పౌరాణిక చిత్రాల‌తో ఎన్టీఆర్, సాంఘిక చిత్రాల‌తో ఏఎన్నార్ దూసుకుపోతోన్న స‌మయంలో జానపద కథా చిత్రాలతో కాంతారావు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. దాంతోపాటు అనేక పౌరాణిక .. చారిత్రక .. సాంఘిక చిత్రాలలోను కీలకమైన పాత్రలు పోషించారు. ఆ త‌ర్వాత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన కాంతారావు నష్టాలపాల‌య్యారు. దీంతో, ఆయ‌న ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. `క‌త్తి కాంతారావు` గా పేరుపొందిన కాంతారావు బ‌యోపిక్ ను దర్శకుడు పీసీ ఆదిత్య తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ బ‌యోపిక్ లో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణకుమారి .. రాజశ్రీ .. విఠలాచార్య పాత్రలు ఉండ‌బోతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. కాంతారావు సొంత ఊరు కోదాడ మండలం `గుడిబండ`కు వెళ్లిన ఆదిత్య‌....కాంతారావు సన్నిహితుల నుంచి  వివరాలను సేకరించారు. కాంతారావు తనయుడు ప్రతాప్ నుంచి కూడా కొంత స‌మాచారం తెలుసుకున్నారు. మ‌రి, `మ‌హాన‌టి`బ‌యోపిక్....బెంచ్ మార్క్ ను రాబోయే బ‌యోపిక్ లు ఎంత‌వ‌ర‌కు అందుకుంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News