గోపీచంద్ తో జగపతిబాబు ఢీ అంటే ఢీ!

Update: 2022-02-12 12:34 GMT
ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా తమ కెరియర్ తొలినాళ్లలో విలన్ పాత్రలను చేసిన చాలామంది, ఆ తరువాత కాలంలో హీరోగా నిలబడ్డారు. ఇక కొంతమంది విలన్ పాత్రల నుంచి హీరోగా వెళ్లినా, అక్కడ ఎక్కువ కాలం నిలబడలేక మళ్లీ విలన్ రోల్స్ వైపు వచ్చేసిన వారున్నారు. కానీ స్టార్ హీరోగా ఒక వైభవం చూసి .. ఆ తరువాత కాలంలో స్టార్ విలన్ గా నిలబడినవారిగా ఒక్క జగపతిబాబు మాత్రమే కనిపిస్తారు.

ఒక స్టార్ ప్రొడ్యూసర్ వారసుడిగా కూడా ఆయన మీద ఒక బలమైన ముద్ర ఉంది. వాటన్నిటినీ పక్కన పెట్టేసి విలన్ గా యూ టర్న్ తీసుకున్న హీరోగా జగపతిబాబు నిలుస్తారు.

చాలా తక్కువ సమయంలో ఆయన టాలీవుడ్ లోనే బలమైన ప్రతినాయకుడిగా ఎదిగారు. జగపతిబాబును తీసుకోవడం వలన ఆ పాత్ర వెయిట్ మరింత పెరుగుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక తమ సినిమాలో విలన్ గా జగపతిబాబు ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని స్టార్ హీరోలు అభిప్రాయపడుతున్నారు.

అందువల్లనే ఇప్పుడు జగపతిబాబు ఫుల్ బిజీ. ఒకప్పుడు హీరోగా ఆయన డేట్లు సంపాదించడానికి దర్శక నిర్మాతలు పెద్దగా ఇబ్బందిపడలేదుగానీ, ఇప్పుడు విలన్ రోల్స్ కోసం ఆయన డేట్లు సంపాదించడం మాత్రం అంత తేలికైన విషయమేం కాదు.

విలన్ గా ఇప్పుడు ఆయన చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అయినా తాజాగా ఆయన గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లోని సినిమాలోను విలన్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టీమ్ విషెస్ చెబుతూ ఒక పోస్టర్ ను వదిలింది. దాంతో ఈ సినిమాలో జగపతిబాబు చేస్తున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. కెరియర్ పరంగా ఇది గోపీచంద్ కి 30వ సినిమా. 'పక్కా కమర్షియల్' తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇది.

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా శ్రీవాస్ కి మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఆయన గోపీచంద్ తో 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అనిపించుకున్నాయి. గోపీచంద్ కెరియర్లోనే భారీ విజయాలను సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఆ తరువాత బాలకృష్ణతో శ్రీవాస్ చేసిన 'డిక్టేటర్' .. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన 'సాక్ష్యం' ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. దాంతో శ్రీవాస్ కి గ్యాప్ వచ్చేసింది. ఇక ఇప్పుడు గోపీచంద్ తో ఆయన చేస్తున్న మూడో సినిమా ఇది. తప్పకుండా హ్యాట్రిక్ హిట్ కొడతామనే ఇద్దరూ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు పాత్రను ఎలా డిజైన్ చేశారో చూడాలి మరి!           

Tags:    

Similar News