రజనీ స్టైల్స్ పై అమెరికా అధ్యాపకుడి బుక్!

Update: 2016-07-26 07:18 GMT
రజనీకాంత్ అంటే స్టైల్ - రజనీ అంటే యాక్షన్ - రజనీ అంటే... ఇలా చెప్పుకుంటూ పోతే రజనీ అంటే రజనీయే! ఈ తమిళ సూపర్ స్టార్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కోకొల్లలు. నటుడికానే కాకుండా వ్యక్తిగా కూడా రజనీని అభిమానించేవారి సంఖ్య తక్కువేమీ కాదు. తాజాగా విడుదలయిన కబాలి సినిమా 65 దేశాల్లో సుమారు 8000 థియేటర్లలో విడుదలయ్యింది అంటేనే రజనీ ఏ స్థాయి సెలబ్రెటీనో ఇట్టే అర్ధమవుతుంది. ఈ స్థాయి నటుడు అమెరికాలోని ఒక అధ్యాపకుడిని కూడా ఆకర్షించాడు.

వివరాళ్లోకి వెళితే... యూత్ కు సంబంధించిన స్టైల్‌ - తదితర అంశాలపై పరిశోధన నిర్వహించేందుకు వచ్చిన అమెరికా అధ్యాపకుడు కాన్‌ స్టంటైన్‌ వి.నకాసిస్‌ దృష్టి రజనీ పై పడింది. స్టైల్ కు రజనీ కచ్చితంగా కేరాఫ్ అడ్రస్సే కాబట్టి.. తమిళ సూపర్‌ స్టార్‌ కు సంబంధించిన విశేషాలపై ఏకంగా ఒక పుస్తకాన్నే ప్రచురించాడు. రజనీకాంత్ సినిమా బాషాపై పుస్తకాలు వచ్చాయి.. ఇప్పుడు రజనీ స్టైల్స్ పై ఏకంగా విదేశీయుడే పుస్తకం రాశాడు.

"డూయింగ్‌ స్టైల్‌ - యూత్‌ అండ్‌ మాస్‌ మీడియేషన్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా" పేరిట కాన్‌ స్టంటైన్‌ వి.నకాసిస్‌ రాసిన ఈ పుస్తకాన్ని షికాగో యూనివర్శిటీ - ఓరియంటల్‌ బ్లాక్స్‌ వ్యాన్‌ ప్రచురణ కేంద్రం సంయుక్తంగా ఇటీవల విడుదల చేశాయి. అమెరికాలోని షికాగోకు చెందిన కాన్‌ స్టంటైన్‌ 2004లో తమిళనాడులోని మదురై వచ్చారు. అనంతరం తమిళం నేర్చుకుని ఇక్కడి చలనచిత్రాలపై పరిశోధనలు చేశారు. అందులో భాగంగా డూయింగ్ స్టైల్ రజనీపై రాశారు. చెప్పుకుంటూపోతే.. రజనీ ప్రభావం గురించి ఎంతచెప్పినా తక్కువే!
Tags:    

Similar News