తాడేపల్లి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖుల్ని జగన్ అలా ట్రీట్ చేశారా?

Update: 2022-02-13 09:42 GMT
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లటం.. అక్కడి నుంచి సీఎం నివాసానికి వెళ్లటం.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాల్ని చర్చించటం తెలిసిందే. సీఎం జగన్ నుంచి స్పష్టమైన ప్రకటన ఏమీ రానప్పటికీ.. ఆయనకు థ్యాంక్స్ చెప్పేందుకు తెగ ప్రయత్నించారు భేటీకి హాజరైన ప్రముఖులంతా.

అయితే.. తాడేపల్లికి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? వారిని సీఎం జగన్ ఎలా ట్రీట్ చేశారు? వారికి అధికారం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించటంతో సహా.. అక్కడి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లుగా బయటపెట్టారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కే. తన వారాంతపు వీకెండ్ కామెంట్ లో ఆయన సంచలన అంశాల్ని బయటకు వెళ్లడించారు.

ఏ మీడియా హౌస్ ఈ వివరాల్ని వెల్లడించలేదనే చెప్పాలి. తనకున్న సోర్సు ద్వారా.. తనకు అందిన విశ్వసనీయ సమాచారాన్ని వెల్లడించిన ఆర్కే ఏం చెప్పారు? సీఎం జగన్ ను కలవటానికి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులకు తాడేపల్లిలో ఏం జరిగిందన్నది ఆయన మాటల్లోనే చదివితే..

-  హీరోలను జీరోలుగా చేశారు. స్టార్స్‌ను యాచకులుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అహం సంతృప్తి చెందింది. నిజంగా ఆయన తోపు అని భజనలు మొదలయ్యాయి. సమస్యలు సృష్టించినవారు దాన్ని పరిష్కరించినందుకు థ్యాంక్స్‌ అందుకున్నారు. ఇంతకీ సినిమా టికెట్ల రేటు పెంచుతానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చిన దాఖలాలు లేవు.. అయినా థ్యాంక్స్‌ అందుకున్నారు. ఉద్యోగుల విషయంలోనూ ఇదే జరిగింది. ప్రధాన సమస్య పీఆర్సీ విషయం తేల్చకపోయినా ఆ నలుగురు ఉద్యోగసంఘాల నాయకులు ముఖ్యమంత్రికి అదేపనిగా కృతజ్ఞతలు చెప్పారు. సమస్య పరిష్కరించకుండానే థ్యాంక్స్‌ అందుకున్న ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు.

-  నిజానికి ఆయన ప్రభుత్వం సృష్టించిన సమస్యల వల్ల సంక్షోభంలోకి పోయిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున వెళ్లిన చిరంజీవి, రాజమౌళి, మహేష్‌ బాబు, ప్రభాస్‌, కొరటాల శివకు పరాభవం మిగిలింది. జగన్‌రెడ్డి అధికార దర్పానికి, తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ ప్రముఖుల పాపులారిటీ తల వంచింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అవమానాలకు గురైంది ఆ నలుగురైదుగురు మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అవమానానికి గురైంది.

-  ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రైడ్‌గా వెలుగొందుతున్న వారిని యాచకులుగా మార్చడం ద్వారా తెలుగుజాతిని కూడా అవమానించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి సినీ ప్రముఖులపై ఎప్పటి నుంచో కోపం ఉంది. తెలుగు సినిమా ప్రముఖులు తనను గుర్తించడం లేదని ఆయన రగిలిపోతున్నారు. తనను గుర్తించి గౌరవించనివారు తన కాళ్ల వద్దకు వచ్చేలా స్కెచ్‌ రూపొందించారు. అంతే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను అమాంతం తగ్గించేశారు. దీంతో భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మించినవాళ్లు, అందులో నటించిన వాళ్లు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది.

-  ముఖ్యమంత్రిని కలిసి తమ మొర చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా వేడుకున్నారు. తనను గుర్తించని వారికి గుణపాఠం చెప్పడానికి సమయం ఆసన్నమైందని అనుకున్నారో ఏమో గానీ, సినీ ప్రముఖులకు రెండు రోజుల క్రితం జగన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తనను కలవడానికి ఎవరెవరు రావాలో కూడా ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీంతో సూపర్‌స్టార్‌గా, బాహుబలిగా వెలుగొందుతూ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని కూడా కలుసుకోవడానికి వెళ్లని మహేష్‌బాబు, ప్రభాస్‌ సైతం చిరంజీవి వెంట ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లారు.

-  జగన్‌ను కలిసినవారందరూ లబ్ధప్రతిష్టులే. అయినా ముఖ్యమంత్రి నివాసం వద్ద వారికి అడుగడుగునా అవమానమే ఎదురైంది. అంతా ప్లాన్‌ ప్రకారం జరిగింది. హీరోల కార్లను గేటు బయటే నిలిపి కాలి నడకన వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. అక్కడ వారికి స్వాగతసత్కారాలు లభించలేదు. నిర్ణయించిన సమావేశ మందిరంలో సినీ ప్రముఖులు కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే ఈ బృందంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో తన పార్టీ తరఫున ప్రచారం చేసిన పోసాని కృష్ణమురళి, అలీ వంటి వారిని జగన్‌రెడ్డి పిలిపించుకుని ప్రముఖుల సరసన కూర్చోబెట్టించారు. షాట్‌ రెడీ కాగానే ‘ఇప్పుడు మీ సమస్యలు చెప్పుకోండి’ అని జగన్‌రెడ్డి అనుమతిచ్చారు.

-  అంతే తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి అత్యంత దీనంగా చిత్ర పరిశ్రమపై చల్లని చూపు ప్రసరింపజేయవలసిందిగా వేడుకున్నారు. చేతులు జోడించి ఆయన అభ్యర్థించిన తీరు పలువురిని విస్మయానికి గురిచేసింది. మెగా అభిమానులు ఈ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనువుగాని చోట అధికులమని చెప్పుకోకూడదు అనుకున్నారో ఏమో గానీ జగన్‌రెడ్డి అధికారం ముందు చిరంజీవి తల వంచారు. మహేష్‌బాబు కూడా ఇంచుమించు ఇలాగే రెండేళ్ల నుంచి తాము అనుభవిస్తున్న వ్యథను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రితో తమకు విభేదాలు ఏమీ లేవని రాజమౌళి వివరణ ఇచ్చుకున్నారు.

-  ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశం మొత్తాన్ని కెమెరాల్లో బంధింపజేసి సమాచార శాఖ ద్వారా సాయంత్రానికి మీడియాకు విడుదల చేయించడం. సాధారణంగా ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశాలను ఆసాంతం షూట్‌ చేయరు. ఇప్పుడు మాత్రమే అది జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చిన సినీ ప్రముఖులు విలేకరులతో మాట్లాడటం కోసం ఒక స్టాండ్‌ ఏర్పాటు చేయించారు. కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయకపోవడంతో వారంతా ఎండలో నిలబడి, అది కూడా ముఖ్యమంత్రి ఇంటి బయట, సమస్యలు పరిష్కరించడానికి సుముఖత వ్యక్తంచేసిన జగన్‌రెడ్డికి థ్యాంక్స్‌ చెప్పడానికి పోటీ పడ్డారు. చిరంజీవి అండ్‌ కో మాటలు విన్నవారు ముఖ్యమంత్రి మనసు ఇప్పటికైనా కరిగి ఉంటుందని భావించారు.

-  సమాచార శాఖ విడుదల చేసిన వీడియో చూసిన తరువాతే అసలు ఏమి జరిగిందో జనానికి తెలిసింది. సినిమాలకు రెండు రకాల టికెట్ల ధరలు ఉండవని సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్టు వీడియోలో ఉంది. అంతేకాదు చిరంజీవి తాను మెగాస్టార్‌నన్న విషయం మర్చిపోయి దీనమైన స్వరంతో వేడుకున్నారు. అప్పుడు జగన్‌రెడ్డి కనీసం ఆయన వైపు కూడా చూడలేదు. గతంలో చిరంజీవి దంపతులను ఇదే జగన్‌రెడ్డి సతీసమేతంగా స్వాగతసత్కారాలతో గౌరవించారు. గుమ్మం బయటకు వెళ్లి స్వాగతం చెప్పడమే కాకుండా వీడ్కోలు కూడా పలికారు.

-  ఇప్పుడు చిరంజీవి మాత్రమే కాదు, ఫెయిల్యూర్‌ అంటే ఏమిటో తెలియని దర్శకుడు రాజమౌళి, కొరటాల శివతోపాటు మహేష్‌బాబు, ప్రభాస్‌ కూడా వచ్చినప్పటికీ కనీస మర్యాదలకు నోచుకోలేదు. ఇప్పటివరకు తమను తాము డెమీగాడ్స్‌గా భావిస్తూ వచ్చిన స్టార్స్‌ తన అధికారం ముందు తలవంచక తప్పని పరిస్థితి జగన్‌రెడ్డి కల్పించారు.



Full View
Tags:    

Similar News