భాష రాకపోవడం వల్లే సినిమాలు ఫ్లాప్‌

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌ ఒకప్పుడు సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలను రూపొందించాడు.;

Update: 2025-07-30 13:30 GMT

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌ ఒకప్పుడు సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలను రూపొందించాడు. తమిళ్‌లోనే కాకుండా ఈయన తెలుగులో, హిందీలోనూ భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన గజిని సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో అమీర్ ఖాన్‌తో రీమేక్ చేస్తే అప్పట్లోనే వంద కోట్లకు మించి వసూళ్లు సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు డబ్‌ అయ్యి తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. హిందీలో గజినీ రీమేక్‌తో ఈయన ప్రస్థానం మొదలు అయింది. అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరిన్ని సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ దర్శకుడు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

సల్మాన్‌ ఖాన్‌ సికిందర్‌ ఫ్లాప్‌

తెలుగులో మహేష్ బాబుతో ఈయన రూపొందించిన స్పైడర్‌ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమాను ఇంత చెత్తగా తీయవచ్చు అనేందుకు ఉదాహరణగా ఆ సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమా తర్వాత మురుగ నుంచి వచ్చిన సినిమాలు సర్కార్‌, దర్బార్‌, సికిందర్‌ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా హిందీలో సల్మాన్ ఖాన్‌తో తీసిన సికిందర్‌ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సల్మాన్‌ ఖాన్‌ అభిమానులకు కూడా సినిమా నచ్చలేదు. హిందీ సినిమా పరిశ్రమ తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇలాంటి చెత్త సినిమాను ఎలా తీస్తారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం మురుగదాస్‌పై విమర్శలు చేశారనే వార్తలు వచ్చాయి.

శివ కార్తికేయన్‌ మదరాసి

సికిందర్‌ ఫ్లాప్‌ నుంచి బయట పడుతున్న మురుగదాస్ సెప్టెంబర్‌లో శివ కార్తికేయన్‌తో తీసిన 'మదరాసి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతున్న ఆ సినిమా ప్రమోషన్‌ను మురగదాస్‌ మొదలు పెట్టాడు. సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ విడుదల చేసే ఉద్దేశం ఉన్నట్టు మురుగదాస్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో బాలీవుడ్‌ సినిమాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను హిందీ సినిమాలు చేసిన సమయంలో భాషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను తమిళ్‌లో స్క్రిప్ట్‌ రాసుకుంటే, దాన్ని ఇంగ్లీష్‌లోకి మార్చి, ఆ తర్వాత దాన్ని నటీనటులు హిందీలో చెప్పేవారు. దాంతో డైలాగ్‌ మారిపోతుంది, అంతే కాకుండా ఎమోషన్‌ కూడా మారిపోతుంది.

హిందీ సినిమా సెట్‌లో మురుగదాస్‌

హిందీ సినిమాలు చేస్తున్న సమయంలో సెట్‌ లో నేను ఒక వికలాంగుడిగా కూర్చుండి పోవాల్సి వచ్చేది. భాష జ్ఞానం లేని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందుకే హిందీలో ఇక పై సినిమాలు చేయాలని అనుకోవడం లేదని అన్నాడు. అయితే తెలుగులో సినిమా చేసేప్పుడు మాత్రం తనకు అలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. ఎందుకంటే తెలుగు భాష నాకు వస్తుంది కనుక నేను వారితో కమ్యూనికేట్‌ చేయడం ఈజీగా ఉండేదని చెప్పుకొచ్చాడు. సెట్‌లో ఉన్నవారందరితోనూ ఈజీగా మాట్లాడినప్పుడు మాత్రమే మంచి సీన్స్ తీయగలం అన్నాడు. మరి తెలుగు, తమిళ్‌లో నువ్వు చేసిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి కదా వాటి పరిస్థితి ఏంటి? ఎందుకు అవి ఫ్లాప్‌ అయ్యాయి అంటూ కొందరు సెటైరికల్‌గా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు.

మదరాసి సినిమాను హిట్‌ చేసి తనను ట్రోల్‌ చేస్తున్న వారి నోరు మూయించాలని మురుగ ప్రయత్నిస్తున్నాడు. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ నటించింది. ఇంకా ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, బిజూ మీనన్‌, విక్రాంత్‌, ప్రేమ్‌ కుమార్‌లు నటించారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ అంటున్నారు. శివ కార్తికేయన్‌కి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం నేపథ్యంలో మదరాసి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News