వేధిస్తున్న మొగుడ్ని ఇద్దరు భార్యలు కలిసి ఏసేశారు
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతాలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.;
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతాలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. నిత్యం తాగి రావటం.. వేధింపులకు గురి చేస్తున్న భర్తను భరించలేని అతని ఇద్దరు భార్యలు కలిసి అతడ్ని హతమార్చిన వైనం తాజాగా చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లో చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..
2001లో మోహన్ .. మానాల గ్రామానికి చెందిన కవితను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. అబ్బాయి కోసం ప్రయత్నించినప్పుడల్లా అమ్మాయి పుట్టేది. దీంతో.. అబ్బాయి కోసమని తాళ్లపల్లికి చెందిన సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూ ముగ్గురు అమ్మాయిలే పుట్టారు. వారిలో ఒకరు చనిపోయారు. కుటుంబ పోషణ కోసం తాను బ్యాండ్ వాయిస్తూ.. భార్యల్ని వ్యవసాయ పనులకు పంపేవాడు.
తాగుడుకు బానిసైన మోహన్.. తరచూ తాగి రావటం ఇద్దరు భార్యలతో గొడవ పడేవాడు. ఇదే తరహాలో ఆదివారం రాత్రి కూడా బాగా తాగేసి ఇంటికి వచ్చిన మోహన్.. ఇద్దరు భార్యల్ని గదిలో బంధించాడు. దీంతో.. అతడి వేధింపులకు విసిగిపోయిన ఇద్దరు భార్యలు అతడ్ని చంపేయాలని డిసైడ్ చేసుకున్నారు. తాము అనుకున్న ప్లాన్ లో భాగంగా సోమవారం ఉదయం అతడ్ని చంపేశారు.
ఉదయాన్నే పెట్రోల్ కొనుక్కొని వచ్చిన ఇద్దరు భార్య.. ఇంటి బయట కుర్చీలో నిద్రపోతున్న అతడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి.. పారిపోయారు. దీంతో.. మోహన్ అక్కడికక్కడే చనిపోయాడు. మోహన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మరణించిన మోహన్ ఇద్దరు భార్యల కోసం వెతుకుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.