మరదలితో పెళ్లికి నో చెప్పారని దారుణంగా చంపేశాడు

ఏపీకి చెందిన ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి నివాసం ఉంటోంది. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..;

Update: 2025-12-09 05:35 GMT

హైదరాబాద్ మహానగరంలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. మరదలితో పెళ్లికి మేనమామ కుటుంబం నో చెప్పిందన్న కసితో.. ఒక ఉన్మాది ఆమెను కిరాతకంగా హతమార్చిన ఉదంతం చోటు చేసుకుంది. ఏపీకి చెందిన ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చి నివాసం ఉంటోంది. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కాంతారావు.. లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొన్నేళ్ల క్రితం వారు హైదరాబాద్ కు ఉపాధి కోసం వచ్చి స్థిరపడ్డారు. ముషీరాబాద్ లోని బాపూజీనగర్ లో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. కాంతారావు పెద్ద కుమార్తె 19 ఏళ్ల పవిత్ర ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉంటే కాంతారావు అక్కడ కుటుంబం రహ్మత్ నగర్ లో ఉంటోంది. వారికి ఓ కొడుకు ఉన్నాడు. వాడి పేరు ఉమాశంకర్. పాతికేళ్ల అతను టైల్స్ ఫ్లోరింగ్ పనులు చేస్తుంటాడు.

మేనల్లుడికి తన పెద్ద కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని కాంతారావు భావించాడు. ఇదే విషయాన్ని రెండు కుటుంబాలు మాట్లాడుకున్నాయి. అయితే ఉమాశంకర్ చెడు వ్యసనాలకు బానిస కావటం.. నిత్యం తాగి పనికి వెళ్లకుండా జులాయిగా తిరగటం ఎక్కువైంది. దీంతో అతని ప్రవర్తనను మార్చుకోవాలని కోరారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో.. తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటానికి కాంతారావు నో చెప్పేశాడు.

దీంతో.. ఉమాశంకర్ పలుమార్లు మేనమామకు ఫోన్ చేసి వాదనకు దిగేవాడు. తన కుమార్తెను ఇవ్వటానికి కాంతారావు ససేమిరా అంటూ తేల్చేశాడు. ఇటీవల వారి కుటుంబం విజయవాడకు వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఉమాశంకర్ సోమవారం మేనమామ ఇంటికి వచ్చి.. మేనత్తతో గొడవ పడ్డాడు. తనకు చెప్పకుండా తన మరదలిని విజయవాడ ఎలా తీసుకెళతారంటూ గొడవకు దిగి ఆగ్రహంతో ఊగిపోయాడు.

దీంతో కాంతారావు సతీమణి అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా.. ఉమాశంకర్ తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్ర గొంతులో బలంగా పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పవిత్రను చుట్టుపక్కల వారు కలిసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పవిత్ర చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు ఉపయోగించిన కత్తిని.. అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తెను తన కళ్ల ముందే కిరాతకంగా హతమార్చిన మేనల్లుడి తీరుపై మేనత్త తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మరణంతో కాంతారావు కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

Tags:    

Similar News