అటు అచ్చెన్న...ఇటు ధర్మాన...వెరీ ఇంట్రెస్టింగ్ !
| శ్రీకాకుళం మేయర్ పీఠం కోసం కింజరాపు, ధర్మాన కుటుంబాలు తొలిసారి ప్రత్యక్ష రాజకీయ పోరుకు సిద్ధమయ్యాయి. వైసీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి గెలుపు కోసం ధర్మాన ప్రసాదరావు, కూటమి అభ్యర్థి రాధారాణి విజయం కోసం మంత్రి అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నారు. కూటమిలో అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.
ఉత్తరాంధ్ర జిల్లాలలో శ్రీకాకుళం జిల్లాకు రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా రెండు కుటుంబాలే రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. రెండు పార్టీల నుంచి ఆ కుటుంబాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒకరు అధికారంలో ఉంటే రెండవ వారు ప్రతిపక్షంలో ఉంటారు. ఈ రెండు కుటుంబాల మధ్య తెలియని సయోధ్య తెర వెనక సాగుతోంది అని రెండు పార్టీలలోనూ గుసగుసలుగా కొన్ని సార్లు బాహాటంగా కూడా చర్చ సాగుతూ వస్తుంది. అయితే అలాంటివి ఏమీ లేవన్నట్లుగా గట్టిగానే అటూ ఇటూ విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అయితే అదంతా వేరు ముఖాముఖి ఎవరి మీద ఎవరూ పోటీకి దిగరని గుర్తు చేస్తూంటారు. ఇంతకీ ఆ రెండు కుటుంబాలు ఏమిటి అంటే ఒకటి కింజరాపు రెండవది ధర్మాన. ఈ రెండు కుటుంబాలకు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. అయితే ఇన్నేళ్ల రాజకీయాల్లో తొలిసారి ఈ రెండు కుటుంబాలూ బాహాబాహీ తలపడుతున్నాయి. అయితే ప్రత్యర్థులుగా కాదు, తమ పార్టీల నుంచి నిలబెట్టిన అభ్యర్ధుల గెలుపు కోసం.
మేయర్ పీఠం కోసం :
శ్రీకాకుళం మేయర్ పీఠం ఎవరిది అన్న చర్చ ఇపుడు జిల్లా అంతటా సాగుతోంది. అంతే కాదు ఇది ఉత్తరాంధ్రను దాటి రాష్ట్రమంతా ఈ వైపు చూస్తోంది. ఇక వైసీపీ నుంచి మాజీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పోటీ చేస్తున్నారు. ఆమె ఈ మధ్యనే టీడీపీతో దశాబ్దాల బంధం తెంచుకుని మరీ ఫ్యాన్ నీడకు చేరారు. కూటమి నుంచి జనసేన తరఫున రాధారాణి పోటీకి దిగారు. పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేనకు ఇచ్చినా అసలు బలం బలగం అంతా టీడీపీదే. గెలుపు బాధ్యత కూడా ఆ పార్టీదే. అలా మంత్రి అచ్చెన్నాయుడు కూటమి గెలుపునకు శ్రమిస్తూంటే వైసీపీలోకి లక్ష్మీదేవిని తీసుకుని వచ్చి గెలిపిస్తాను అని మాట ఇచ్చిన మాజీ మంత్రి తన సొంత ఎన్నికలా కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు.
కింజరాపు ఫ్యామిలీ మీదనే :
ఇక గుండ లక్ష్మీదేవి కింజరాపు ఫ్యామిలీ వల్లనే పార్టీ మారాల్సి వచ్చింది అని ఆమె అభిమానులు చెబుతున్నారు. 2014లో గెలిస్తే మంత్రి పదవి రాకుండా చేశారని, 2019 లో కూడా దెబ్బ పరోక్షంగా పడిందని 2024 లో టికెట్ రాకుండా చూశారని అంటారు. ఇక లక్ష్మీదేవిని ఓడించాలన్నది రాజకీయంగానే కాదు మరింత విస్తృత లక్ష్యాలతో టీడీపీ అవసరంగా ఉంది అంటున్నారు. మంత్రి కింజరాపు అయితే ఎక్కడా తగ్గడం లేదు. పైగా తామే ఏరి కోరి తెచ్చి శ్రీకాకుళం ఎమ్మెల్యేను చెసిన గోండు శంకర్ ఇబ్బందిలో పడకుండా ఈ విజయం భారీగా ఉండాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే కూటమిలో అసంతృప్తులు ఉన్నాయి. జనసేన టీడీపీల మధ్య గ్రౌండ్ లెవెల్ లో సఖ్యత లేదు. దాంతో ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ పావులు కదుపుతోంది. ధర్మాన ప్రసాదరావు అయితే దీని మీదనే ఫోకస్ పెట్టారు.
రాజకీయ చాణక్యం :
అసంతృప్తి నేతలకు వల వేస్తూ వైసీపీలో వారిని చేర్పించే పనిలో ధర్మాన బిజీగా ఉన్నారు. ఇక వారిని బుజ్జగిస్తూ హామీలు ఇస్తూ మొత్తం అంతా చక్కదిద్దే పనిలో మంత్రి అచ్చెన్న ఉన్నారు. ఇలా ఈ ఇద్దరూ ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తు వేసుకుంటూ మేయర్ ఎన్నికల్లో తామే అసలైన అభ్యర్ధులు అన్నట్లుగా ధీటుగా పోరు సాగిస్తున్నారు. పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైన వేళ ఏమి జరుగుతుంది అన్నది అయితే చూడాల్సి ఉంది. ఇన్నాళ్ళకు కింజరాపు వర్సెస్ ధర్మాన అన్న రాజకీయ పోరు అయితే రసవత్తరంగా ఉంది అని అంతా అంటున్నారు.