తుఫాన్ విపత్తుల అసలు లింకు ఎక్కడ ఉందో తెలుసా?
ఎల్ నినో ప్రభావంతో బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి తుఫాన్లు బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు తుఫాన్లకు అనుకూల పరిస్థితులు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఎల్ నినో ప్రభావం 9 నుంచి 12 నెలలు, కొన్నిసార్లు 18 నెలల వరకు కొనసాగవచ్చని చెబుతున్నారు. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
By: Tupaki Desk | 17 Nov 2026 4:01 PM ISTఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో సంభవించే చిన్న వాతావరణ మార్పు, మన తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కే 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా, దాని ప్రకంపనలు హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరిస్తున్నాయి. ఎల్ నినో అంటే సాధారణంగా వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, ఈ వాతావరణ మార్పు బంగాళాఖాతంలో తుఫాన్ల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఎల్ నినో ప్రభావం వల్ల బంగాళాఖాతం జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతున్నాయి. ఈ అదనపు ఉష్ణోగ్రత సముద్రంలో ఏర్పడే సాధారణ అల్పపీడనాలకు సైతం అనూహ్యమైన శక్తిని ఇస్తూ, అవి క్షణాల్లో బలపడి 'అతి తీవ్ర తుఫాన్లుగా' మారడానికి కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా ఎల్ నినో సంవత్సరాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. కానీ, ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కొనసాగే ఈశాన్య రుతుపవనాల కాలంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు తుఫాన్లకు అత్యంత అనుకూలంగా మారతాయి. గణాంకాలను పరిశీలిస్తే, ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో తుఫాన్ల మొత్తం సంఖ్య కొన్నిసార్లు తక్కువగా కనిపించినా, ప్రతి తుఫాను ఎక్కువ కాలం సముద్రంలోనే ప్రయాణిస్తూ విపరీతమైన వేగాన్ని పుంజుకుంటోంది. 1976, 1987 వంటి గత ఎల్ నినో సంవత్సరాలతో పాటు, ఈ ఏడాది వరుసగా ఏర్పడున్న తుఫాన్ల తీరును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్లను అడ్డుకునే ఎల్ నినో, బంగాళాఖాతంలో మాత్రం వరుస తుఫాన్లు, పెను విధ్వంసాలకు కారణమవుతుండటం వాతావరణ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇంతకీ ఈ ఎల్ నినో ప్రభావం ఎన్నాళ్లు ఉంటుంది? ఇంకా తుఫాన్ల ముప్పు పొంచి ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తీర ప్రాంత ప్రజలను కలవరపెడుతున్నాయి. సాధారణంగా ఒకసారి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే వాటి ప్రభావం 9 నెలల నుంచి 12 నెలల పాటు, కొన్ని సందర్భాల్లో ఏడాదిన్నర వరకు కొనసాగుతుంది. పసిఫిక్ సముద్ర జలాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునే వరకు దీని ప్రభావం వాతావరణంపై ఉంటుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో అక్టోబర్, నవంబర్ నెలలతో పాటు డిసెంబర్ మొదటి వారం వరకు తుఫాన్లు ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇంకా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతుండటం, ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే కొద్ది వారాల పాటు అల్పపీడనాలు, తుఫాన్ల ముప్పు పూర్తిగా తొలగిపోలేదని వాతావరణ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎల్ నినో బలహీనపడే వరకు తీర ప్రాంత యంత్రాంగం, ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
