Begin typing your search above and press return to search.

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘అక్వాన్’ తుపానుగా బలపడి, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.

By:  Tupaki Desk   |   15 Nov 2026 11:48 AM IST
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ బలపడుతోంది. ప్రస్తుతం ఇది అండమాన్ దీవులకు 700 కిలోమీటర్లు, చెన్నైకు 860 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. విశాఖపట్నంకు 1,040 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వాయుగుండం వేగంగా బలపడుతూ రేపటికి తుపానుగా బలపడుతోంది. ఆ మరునాడు తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని ప్రభుత్వం హెచ్చరించింది.

తీవ్ర తుపానుగా మారిన తర్వాత రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర తీరంవైపు దూసుకువచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తీవ్ర తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీని కారణంగా గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. కోతకు వచ్చిన పంటలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలు సిద్ధం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

‘అక్వాన్’గా నామకరణం

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుకు ‘అక్వాన్’గా నామకరణం చేశారు. ఈ పేరును ఇరాన్ సూచించినట్లుగా చెబుతున్నారు. తుపాను సముద్రంలో కొనసాగిన సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం నుంచి వాయుగుండంగా బలపడిన తర్వాత కోస్తా వ్యాప్తంగా ఈదురుగాలుల వేగం పెరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, నవంబరు నెలలో తుపాన్లు ఎక్కువగా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుల్లో తీరం దాటుతాయని అంటున్నారు. నవంబరు రెండో వారం తర్వాత ఉత్తరకోస్తాలో తుపాన్లు తీరం దాటడం, తీరం దిశగా రావడం 25 ఏళ్లలో ఒక్కసారే జరిగిందని చెబుతున్నారు. 1998 నవంబరు 15న అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద తుపాను తీవ్రం దాటిందని వాతావరణశాఖ రికార్డులు చెబుతున్నాయి.