Begin typing your search above and press return to search.

ఉత్తర కోస్తాకు మరో తుపాను ముప్పు: 18న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల రైతుల్లో ఆందోళన మొదలైంది. నవంబర్ 16 నాటికి తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనాలు వస్తుండగా, 18 లేదా 19 తేదీల్లో మచిలీపట్నం–గోపాలపూర్ మధ్య తీరం దాటవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘అర్నాబ్’, ‘మురసు’ తుపాన్లతో 4.61 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మరో తుపాను వస్తే చేతికొచ్చే దశలో ఉన్న వరి, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

By:  Tupaki Desk   |   14 Nov 2026 12:24 PM IST
ఉత్తర కోస్తాకు మరో తుపాను ముప్పు: 18న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం
X

కోస్తా తీరంపై ప్రకృతి పగబట్టింది. వరుస తుపాన్లతో రాష్ట్రం కోలుకోలేని నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికే రెండు తుపాన్లు అతలాకుతలం చేశాయి. ఇప్పుడు మరో తుపాను హెచ్చరికతో రైతాంగంలో భయాందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ చివరి వారంలో విరుచుకుపడిన 'అర్నాబ్', నవంబర్ ప్రారంభంలో బీభత్సం సృష్టించిన 'మురసు' తుపానులు మిగిల్చిన విషాదం నుంచి కోస్తాంధ్ర ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ఉత్తర కోస్తా జిల్లాల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడుతోందని, వాతావరణ శాఖ తుపాను విభాగం అంచనాల ప్రకారం, శనివారానికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారి నవంబర్ 15 నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని చెబుతున్నారు. ఆపై ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి, నవంబర్ 16 నాటికి పూర్తిస్థాయి తుపానుగా బలపడనుంది. సముద్రంలో సుమారు రెండు రోజుల పాటు తీవ్ర తుపానుగా కొనసాగిన అనంతరం, తీరం వైపు వచ్చేటప్పుడు కొంత బలహీనపడే అవకాశం ఉందని పలు వాతావరణ మోడళ్లు విశ్లేషిస్తున్నాయి.

ఉత్తరాంధ్రలో తీరం దాటే అవకాశం

నవంబర్ 18వ తేదీ అర్ధరాత్రి లేదా 19వ తేదీ ఉదయం మచిలీపట్నం – గోపాలపూర్ మధ్య, ముఖ్యంగా కాకినాడ లేదా కళింగపట్నం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ తరహా వాతావరణ వ్యవస్థలు బంగ్లాదేశ్ వైపు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం రెండు సముద్రాల్లో ఉన్న అధిక పీడనాల ప్రభావంతో ఇది దిశ మార్చుకుని ఉత్తర కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇది ఉత్తరాంధ్రలో తీరం దాటితే, ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు పొరుగునున్న తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంటున్నారు.

కేవలం నెల రోజుల వ్యవధిలో రెండు భీకర తుపానులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అక్టోబర్ 28న విరుచుకుపడిన 'అర్నాబ్' తీవ్ర తుపాను, ఆ వెంటనే నవంబర్ 2–3 తేదీల మధ్య సంభవించిన 'మురసు' తుపాను కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర పంజా విసిరింది. ఈ రెండు తుపానుల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.61 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, దాదాపు 30 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిని, 7 లక్షల మందికి పైగా రైతులు నష్టపోయారు. వేల కోట్ల రూపాయల మేర పంట ఉత్పత్తి, ఆస్తి నష్టం వాటిల్లింది. ముఖ్యంగా 'అర్నాబ్' దెబ్బకు ఒక్క డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే ఏకంగా 99.19 శాతం పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. దాదాపు 95 వేల మంది రైతులు రోడ్డున పడ్డారు. ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వరి రైతులు నిలువునా మునిగిపోయారు. చేతికొచ్చిన వరి పైర్లు నేలకొరిగి, పొలాల్లో నీరు నిలిచిపోవడంతో ధాన్యం రంగు మారి, గింజలు మొలకెత్తాయి. అరటి, కొబ్బరి, పత్తి, మిర్చి తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. పంట నష్టపోవడంతో పాటు కౌలు చెల్లించలేక, పరిహారం అందక కౌలు రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

గత రెండు తుపానుల నుంచి ఎలాగోలా మిగిలిన పంటనైనా దక్కించుకుందామని ఆశపడుతున్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల రైతులకు ఈ మూడో తుపాను వార్త పిడుగుపాటులా మారింది. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ఉభయ గోదావరి జిల్లాల్లో వరి పైరు కొన్ని చోట్ల కోతకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని చోట్ల కీలకమైన పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీస్తే వరి కంకులు రాలిపోవడం, పైరు నేలవాలడం ఖాయమని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కోనసీమలో కొబ్బరి, లంక గ్రామాల్లో అరటి తోటలకు మళ్లీ గాలుల ముప్పు పొంచి ఉండగా, విద్యుత్ సరఫరా నిలిచిపోతే రొయ్యల చెరువుల్లో ఏరేటర్లు పనిచేయక ఆక్వా రైతులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదముందని భయపడుతున్నారు.

తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA), పొరుగున ఉన్న ఒడిశా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. తుపాను కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుంది, దాని తీవ్రత ఎంత ఉంటుందనే దానిపై మరో ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. అప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలు, వదంతులను నమ్మి ప్రజలు భయాందోళనలకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.