ట్రంప్‌పై హత్యాయత్నం: వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కాల్పుల కీలక వీడియో విడుదల
ఏప్రిల్ 24వ తేదీన వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మకమైన వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు ఏర్పాటు చేశారు.
By: A.N.Kumar | 1 May 2026 6:57 PM ISTఅమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన భద్రతా వైఫల్యంగా పరిగణించబడుతున్న 'వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' కాల్పుల ఘటనకు సంబంధించిన కొత్త వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ హత్యాయత్నం కేసులో అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాలు.. ఆ రాత్రి జరిగిన భీకర పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.
ప్రతిష్టాత్మక వేదికపై తూటాల మోత
ఏప్రిల్ 24వ తేదీన వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మకమైన వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అమెరికా అధ్యక్షుడు, రాజకీయ ప్రముఖులు, హాలీవుడ్ స్టార్స్ , అగ్రశ్రేణి జర్నలిస్టులు హాజరవుతుంటారు. సహజంగానే ఇక్కడ భద్రత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అయితే అలిన్ అనే నిందితుడు ఈ అభేద్యమైన కోటను ఎలా దాటుకుని లోపలికి ప్రవేశించాడో వివరిస్తూ విడుదలైన వీడియో ఇప్పుడు భద్రతా సంస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సిసిటివి వీడియోలో నిందితుడి కదలికలు
న్యాయశాఖ విడుదల చేసిన వీడియో ఫుటేజీ ప్రకారం.. నిందితుడు "అలెన్" హోటల్ ప్రాంగణంలోని ప్రధాన సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను అత్యంత వేగంగా వ్యూహాత్మకంగా దాటుకుని లోపలికి ప్రవేశించాడు. రద్దీగా ఉన్న ప్రాంతంలో భద్రతా సిబ్బందిని ఏమార్చి, తన వద్ద ఉన్న ఆయుధంతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. డొనాల్డ్ ట్రంప్ వైపు దూసుకువెళ్లడానికి అతను చేసిన ప్రయత్నం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పులు ప్రారంభం కాగానే అక్కడున్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. సెక్యూరిటీ సర్వీస్ అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ప్రముఖుల తరలింపు.. గాయపడ్డ అధికారి
ఈ హఠాత్పరిణామంతో విందులో పాల్గొన్న ప్రముఖుల భద్రతపై ఆందోళన నెలకొంది. నిందితుడి కాల్పుల్లో యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కు చెందిన ఒక అధికారి గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. కాల్పుల శబ్దం వినగానే భద్రతా బలగాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రముఖులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వీరందరినీ నిమిషాల వ్యవధిలోనే బంకర్లు లేదా సురక్షిత గదుల్లోకి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.
విచారణ.. భద్రతా లోపాలు
ఈ వీడియోను విడుదల చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం దర్యాప్తులో పారదర్శకతను చాటడమేనని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన అమెరికా గూఢచారి వ్యవస్థలు.. సెక్యూరిటీ ఏజెన్సీల వైఫల్యాన్ని ఎండగడుతోంది. కట్టుదిట్టమైన తనిఖీలు ఉండే హోటల్‌లోకి ఆయుధంతో నిందితుడు ఎలా రాగలిగాడు? అలెన్‌కు ఎవరైనా సహకరించారా? లేదా ఇది 'లోన్ ఉల్ఫ్' తరహా దాడియా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో ఒకటిగా భావించే ఈ డిన్నర్ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో వివిఐపి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి లోపాలను సరిదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అలెన్ కస్టడీలో ఉన్నాడు.. తదుపరి విచారణలో మరిన్ని దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
