Begin typing your search above and press return to search.

ఫోన్ సెట్టింగ్స్ మార్చమంటే.. జీవితమే రీసెట్ అయ్యే పరిస్థితి.. అమెరికాలో భారతీయ ఉద్యోగికి షాక్

టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో కస్టమర్ ఐఫోన్ పాస్‌కోడ్‌తో ఆమె వ్యక్తిగత ఫొటోలను ఎయిర్‌డ్రాప్ ద్వారా పంపుకునేందుకు ప్రయత్నించిన రఘుల్ ఆనందకృష్ణన్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. నవంబర్ 22న జైలు నుంచి విడుదలైన వెంటనే ఐసీఈ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ కోర్టు విచారణ పూర్తయ్యే వరకు కస్టడీలోనే ఉంచనున్నారు.

By:  A.N.Kumar   |   23 Nov 2026 8:04 AM IST
ఫోన్ సెట్టింగ్స్ మార్చమంటే.. జీవితమే రీసెట్ అయ్యే పరిస్థితి.. అమెరికాలో భారతీయ ఉద్యోగికి షాక్
X

అమెరికాలోని టెక్సాస్‌లో చిన్న తప్పిదం చేసిన భారతీయుడు అరెస్ట్ అయ్యి జైలు జీవితం అనుభవించడంతోపాటు ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో బందీ అయిపోయాడు.. స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ మార్చడానికి కస్టమర్ ఇచ్చిన పాస్‌కోడ్‌ను ఆసరాగా చేసుకుని.. ఆమె వ్యక్తిగత ఫొటోలపై కన్నేసిన ఒక స్టోర్ ఉద్యోగి చివరకు జైలు శిక్షతో పాటు ఇమ్మిగ్రేషన్ చిక్కుల్లోనూ పడ్డాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు అతడిని అదుపులోకి తీసుకోవడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది.

టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‌లో ఉన్న క్యాపిటల్ ప్లాజాలోని టోటల్ వైర్‌లెస్ స్టోర్‌లో జూన్ 7, 2026న ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ఐఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ మార్పించుకునేందుకు స్టోర్‌కు వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న రఘుల్ ఆనందకృష్ణన్‌కు ఫోన్ అప్పగించి.. అవసరమైన సెట్టింగ్స్ మార్చడం కోసం పాస్‌కోడ్ చెప్పారు.

అయితే కస్టమర్ ఇచ్చిన నమ్మకాన్ని ఆ ఉద్యోగి దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఫోన్‌లోని నెట్‌వర్క్ సెట్టింగ్స్ సరిచేయడానికి బదులుగా.. ఆమె వ్యక్తిగత గోప్యతలోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఫోన్‌లోని రెండు వ్యక్తిగత ఫొటోలను తనకు తాను ఎయిర్‌డ్రాప్ ద్వారా పంపించుకునేందుకు ప్రయత్నించడంతో పాటు.. అనుమతి లేకుండా ఆమె స్నాప్‌చాట్ ఖాతాలోకి కూడా ప్రవేశించినట్లు సమాచారం.

స్టోర్ నుంచి వెళ్లిన తర్వాత తన ఫోన్‌లో జరిగిన ఎయిర్‌డ్రాప్ ప్రయత్నాలను.. స్నాప్‌చాట్ యాక్సెస్‌ను గమనించిన ఆ మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై రఘుల్ మాత్రం తాను కావాలని చేయలేదని.. అనుకోకుండా ఫోన్ గ్యాలరీని ఓపెన్ చేసినప్పుడు ఆ ఫొటోలు కనిపించాయని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఫొటోలు కనిపించడం వేరు.. వాటిని అనుమతి లేకుండా తనకు తాను బదిలీ చేసుకునేందుకు ప్రయత్నించడం వేరు కావడంతో ఈ వాదన నిలబడలేకపోయింది.

ఈ కేసులో రఘుల్ ఆనందకృష్ణన్ తనపై వచ్చిన ఫెలనీ ఇన్వేసివ్ విజువల్ రికార్డింగ్ అభియోగానికి సంబంధించి నేరాన్ని అంగీకరించాడు. అలాగే క్లాస్ బీ మిస్‌డిమీనర్ అభియోగాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఈ కేసులో కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష ముగిసి నవంబర్ 22న బయటకు వచ్చిన వెంటనే ఐసీఈ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వీసా అమెరికాలో నివాస హోదాకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. ఇమ్మిగ్రేషన్ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు అతడు ఐసీఈ కస్టడీలోనే ఉంటాడని అధికారులు స్పష్టం చేశారు.

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాదు. అందులో వ్యక్తిగత ఫొటోలు.. సోషల్ మీడియా ఖాతాలు.. బ్యాంకింగ్ సమాచారం వంటి సున్నితమైన డేటా ఉంటుంది. రిపేర్ లేదా సెట్టింగ్స్ కోసం ఫోన్ ఇచ్చినప్పుడు కస్టమర్లు పాస్‌కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సమయంలో సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. గోప్యతను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.