హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో హాలోవీన్ వేడుకల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By: Tupaki Desk | 2 Nov 2026 9:27 AM ISTఅమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో హాలోవీన్ వేడుకల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రజలు సంబరాల్లో మునిగిపోయిన సమయంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా.. మరో 15 మంది గాయపడినట్లు నివేదికలు వెల్లడించాయి.
అక్టోబర్ 31న హాలోవీన్ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వరుసగా మూడు ప్రాంతాల్లో కాల్పులు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనలకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలపై డల్లాస్ పోలీస్ చీఫ్ డేనియల్ కమ్‌యాక్స్ స్పందించారు. కాల్పులకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు, డల్లాస్‌లోని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాంతమైన డీప్ ఎల్లమ్‌లో గతంలో జరిగిన కాల్పుల ఘటనకు తాజా దాడులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
ఇదిలా ఉంటే, హాలోవీన్ వారాంతంలో అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డల్లాస్ కాల్పుల ఘటన మరోసారి అమెరికాలో తుపాకీ హింస, ప్రజల భద్రతపై చర్చకు తెరలేపింది. వేడుకల సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
