Begin typing your search above and press return to search.

వైఎస్సార్ సెకండ్ టైం గెలిస్తే జగన్ రెండోసారి ఎందుకు ఓడిపోయారు ?

వైఎస్సార్ వారసుడిగా ఆ తండ్రి ఇమేజ్ ని ప్రజాకర్షణను తన వైపు తిప్పుకున్న జగన్ రాజకీయంగా చూస్తే తనదైన పంధాలో ముందుకు సాగారు.

By:  Satya P   |   19 Sept 2025 6:00 PM IST
వైఎస్సార్ సెకండ్ టైం గెలిస్తే జగన్ రెండోసారి ఎందుకు ఓడిపోయారు ?
X

వైఎస్సార్ వారసుడిగా ఆ తండ్రి ఇమేజ్ ని ప్రజాకర్షణను తన వైపు తిప్పుకున్న జగన్ రాజకీయంగా చూస్తే తనదైన పంధాలో ముందుకు సాగారు. వైఎస్సార్ రాజకీయ ఒరవడికి భిన్నంగా నడిచారు అన్న విమర్శలు ఉన్నాయి. నేల విడిచి సాము చేయడం వల్లనే వైసీపీకి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది అన్నది విశ్లేషణ. చాలా మంది అనుకున్నది ఏంటి అంటే వైఎస్సార్ మాదిరిగా జగన్ కూడా రెండోసారి వరసగా గెలుస్తారు అని. కానీ తండ్రి సక్సెస్ సెంటిమెంట్ ని కొనసాగించడంలో మాత్రం జగన్ ఫెయిల్ అయ్యారు. అసలు ఎందుకు వచ్చింది ఈ తేడా, ఎందుకు ఇలా జరిగింది అన్నది ఇప్పటికి వైఎస్సార్ వీరాభిమానుల మనసును దొలిచే ప్రశ్నగా ఉంది.

వైఎస్సార్ ఒక బ్రాండ్ :

ఇక ఉమ్మడి ఏపీలో చూసుకుంటే వైఎస్సార్ ఒక పొలిటికల్ బ్రాండ్ గా ఉంటూ వచ్చారు. ఆయన 30 ఏళ్ళ పాటు ఉన్న పార్టీలోనే కొట్లాడుతూ వచ్చారు. ఒక విధంగా కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం అసమ్మతివాదిగా పేరు వైఎస్సార్ కే ఉంది. అలా అసమ్మతి అన్నదే ఆయన రాజకీయ జీవితానికి ప్రధాన ఆకర్షణ అయింది. జనంతో ఎపుడూ ఆయన దూరం కాలేదు, వారిని ఎపుడూ పక్కన పెట్టలేదు, అందుకే ఓటమి ఎరుగని నాయకుడిగా వైఎస్సార్ నిలిచారు. కాంగ్రెస్ లో ఎంతటి నాయకులు అయినా వైఎసార్ ఏ రకమైన జంకూ గొంకూ లేకుండా వారితో విభేదించేవారు. వారితోనే తన అసమ్మతి పోరాటం చేస్తూ ఉండేవారు. అదే సమయంలో ప్రజలతో తన సంబంధాలను ఆయన ఎపుడూ మరచిపోలేదు. వాటిని గట్టి పరచుకోవడంలో ఆయన ఎంతో శ్రద్ధగా ఉండేవారు.

సీఎం గా మార్క్ :

ఇక మీడియాతో సైతం వైఎస్సార్ మంచి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేసేవారు. ఇలా దశాబ్దాల పాటు పోరాడిన వైఎస్సార్ 2004లో ఎట్టకేలకు ఉమ్మడి ఏపీ సీఎం పదవిని చేపట్టారు. ఆయన ఎన్నికల ముందు చేసిన భారీ పాదయాత్ర కూడా సీఎం గా రెండవ అభ్హిప్రాయం లేకుండా కాంగ్రెస్ లో ఆయనకే దక్కేలా చేసింది. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా వైఎస్సార్ అంటే ఎంతో గురి చూపించడానికి దోహదపడింది. అంతే కాదు వైఎస్సార్ ఉమ్మడి ఏపీ నుంచి కాంగ్రెస్ కి ఇచ్చిన అత్యధిక సీట్లతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు అయింది అన్నది తెలిసిందే. ఇక సీఎం అయ్యాక వైఎస్సార్ తన మార్క్ చూపిస్తూ వచ్చారు. సంక్షేమ పధకాలను కొత్త పుంతలు తొక్కించారు ఎన్నడూ ఊహించని విధంగా ఎక్కడా లేని విధంగా ఫ్రీ రీఇంబర్స్ మెంట్ పధకం ప్రవేశపెట్టి ఎందరిలో ఉన్నత చదువులు దక్కేలా చూశారు. రైతులకు ఉచిత కరెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ నీటి పారుదల ప్రాజెక్టులు కానీ వైఎస్సార్ మార్క్ పధకాలుగా నిలిచి సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక ప్రజలతో ఎప్పటికపుడు కలిసేందుకు ప్రజా దర్బార్ ని నిర్వహించేవారు. క్యాంప్ ఆఫీసులో ప్రతీ రోజూ ప్రజలతో పార్టీ నాయకులతో కలసి మొత్తం కో ఆర్డినేట్ చేసుకునేవారు. ఆ మీదట జిల్లాల పర్యటనలు కూడా చేపడుతూ జనంలో నిరంతరం ఉండే సీఎం గా గుర్తింపు దక్కించుకున్నారు మంచి సలహాదారులను తన చుట్టూ పెట్టుకోవడమే కాదు వారు ఇచ్చిన సలహాలను కూడా అన్ని విధాలుగా బేరీజు వేసుకుని పాటించడం కూడా వైఎస్సార్ గొప్పదనంగా చెప్పుకోవాల్సి ఉంది. ఇక ఆత్మగా కేవీపీ ఎపుడూ ఉండేవారు అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు.

మళ్ళీ అదే సక్సెస్ :

అయిదేళ్ళ పాటు పాలించిన తరువాత సహజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కానీ రెండోసారి వరసగా గెలవడం అన్నది వైఎస్సార్ తోనే ఉమ్మడి ఏపీలో జరిగింది. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. చంద్రబాబు అయితే అనేక పార్టీలను కలుపుకుని మహా కూటమి కట్టారు ఇంకో వైపు ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి రాజకీయ రంగంలోకి దిగితే ఓట్లు చీలి వైఎస్సార్ మరోసారి సీఎం అయిపోయారు. అలా వ్యూహాలలో సైతం వైఎస్సార్ దిట్టగా నిలిచారు.

జగన్ ఎంట్రీతో కొత్త సీన్ :

వైఎస్సార్ మరణానంతరం కగం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి మృతి తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శిస్తాను అని ఆయన ఓదార్పు యాత్రను చేపట్టి బాగనే జనంతో కలిశారు. దాంతో జగన్ వెంట జనాలు పెద్ద ఎత్తున ఆనాడు ఉండేవారు. ఆయన సమావేశాలు ఫుల్ స్వింగ్ తో సాగేవి. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జగన్ జనంలోకి వెళ్ళి సొంతంగా రాజకీయం చేయడం పార్టీ పెట్టడం అన్నది అసలు ఒప్పుకోలేదు. దాంతో ఆమె జగన్ మీద సీబీఐ ఈడీ కేసులను పెట్టి 16 నెలల పాటు జైలులో ఉంచారు. ఆ సమయంలో జగన్ కొత్త వ్యూహం అమలు చేసి తన తల్లి చెల్లెలుని జనంలోకి పంపించి పార్టీని జైలు నుంచే నడిపారు. అలా 2014 ఎన్నికల్లో చూస్తే ఏకంగా 67 సీట్లను ఒక్క ఏపీలోనే సాధించి అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం గా నిలిచారు. ఇక రాజకీయంగా జగన్ కొత్త వారు అని అనుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీలో టీడీపీని బాగానే ధీటుగా ఎదుర్కొనేవారు.

ఆ జోరే వేరు :

అంతే కాదు ప్రజలతో మమేకం కావడంతో జగన్ ఏ రోజూ తగ్గలేదు. ఒక వైపు అసెంబ్లీలో మరో వైపు బయటా ఆయన టీడీపీ ప్రభుత్వం మీద పదునైన పోరాటం చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికలకు రెండేళ్ళు ముందు అసెంబ్లీకి ఒక నమస్కారం పెట్టి మరీ బయటకు వచ్చారు ప్రశాంత్ కిశోర్ అనే ఎన్నికల వ్యూహకర్త సలహాలతో భారీ పాదయాత్రకు రెడీ అయ్యారు. అలా అలుపు సొలుపూ లేకుండా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లకు పైగా నడిచి మరీ ప్రతీ వారిని కలిశారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ జనం నేతగా పేరు గడించారు అంతే కాదు తన తల్లికి తన చెల్లిని తలో వైపు పంపించి మొత్తం పార్టీని పవర్ ఫుల్ గా మార్చి రాజకీయ దిగ్గజం అయిన చంద్రబాబుకే షాక్ ఇచ్చేలా 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టారు.

సీఎం అయ్యాకే టోటల్ చేంజ్ :

జగన్ సీఎం అయ్యాక మొత్తం వైసీపీ తీరు జోరు మారిపోయింది అని అంటారు. జగన్ ఇలా గద్దెనెక్కారో లేదో అలా కరోనా వచ్చిపడింది. దాంతో ఎవరికి ఎవరితోనూ కనెక్షన్ లేకుడా పోయింది. అయినా సరే జగన్ తన సంక్షేమ పధకాలను ఎక్కడా ఆపలేదు. డీబీటీ విధానం అనుసరించి నేరుగా జనం ఖాతాలలో నగదు వేస్తూ మన్ననలు అందుకున్నారు అయితే కరోనా తగ్గిన తరువాత జగన్ టూర్లు ఉంటాయని జనం వద్దకు వస్తారని అంతా అనుకున్నా అది మాత్రం జరగలేదు. ఒక వైపు క్యాడర్ కి మరో వైపు జనానికి దూరం కావడం అన్నది సరిగ్గా అపుడే మొదలైంది అని అంటారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ కొత్తగా తీసుకుని వచ్చారు ఇది పౌర సేవల వరకూ పరిమితం చేస్తే బాగుండేది. కానీ వైసీపీ కోసం కూడా వారినే వాడుకోవాలని చూడడమే దెబ్బ తీసింది అని చెప్పాలి. ఇటు పార్టీని గెలిపించిన కార్యకర్తలు నలిగిపోయారు అటు నాయకులకు సైతం అధినేత దూరం అయ్యారు కేవలం వలంటీర్లు ఉంటే చాలు గెలుస్తాను అన్న నమ్మకంతో ఆయన ముందుకు పోయారు.

పార్టీ వీక్ అయిన చోట :

వాలంటీర్లే వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకుని వస్తారు అన్న జగన్ నమ్మకాన్ని 2024 ఎన్నికలు వమ్ము చేశాయి పార్టీకి ప్రాణం పెట్టిన క్యాడర్ ని దూరం పెట్టడంతో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. పార్టీ ఒక వైపు వీక్ అయినా పట్టించుకోకపోవడం జనంతో మమేకం కాకపోవడం ఇవన్నీ కలసి 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లనే దక్కేలా చేశాయి. దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలను నేరుగా జనం ఖాతాలో వేసి దేశంలోనే సంక్షేమంలో రికార్డు క్రియేట్ చేసినా కూడా పార్టీ వీక్ అయితే ఎలా ఉంటుందో వైసీపీకి 2024 ఎన్నికలు తెలిసి వచ్చేలా చేశాయి అని అంటారు. అందుకే రెండోసారి వైఎస్సార్ మాదిరిగా అధికారంలోకి రాలేకపోయారు అని కూడా చెబుతారు.

పూర్వ వైభవం రావాలి అంటే :

ఇక వైసీపీకి పూర్వ వైభవం రావాలి అంటే అది జగన్ చేతిలోనే ఉందని అంటున్నారు. వైఎస్సార్ అనుభవంతో ప్రజల నాడిని పట్టుకుని రెండు సార్లు గెలిస్తే జగన్ కార్పోరేట్ స్టైల్ లో వెళ్ళి ఘోరమైన ఓటమిని చవిచూశారు. ప్రజలతో నేరుగా రిలేషన్స్ ఉంచుకోవాలి. పార్టీని ఎప్పటికపుడు పటిష్టం చేసుకుని ముందుకు సాగాలి. అలా కాకుండా వాలంటీర్లతోనే అంతా అనుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుందని అంటారు. ఇక ఇప్పటికి అయినా జగన్ క్యాడర్ ని దగ్గరకు తీసుకోవాల్సి ఉంది. అలాగే కార్పోరేట్ స్టైల్ కి స్వస్తి పలికి జనాలతోనే రాజకీయం చేయాల్సి ఉంది అని సూచనలు వస్తున్నాయి. అలా కనుక చేస్తే వచ్చేవి అన్నీ మంచి రోజులే అని చెబుతున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం వీటి మీద ఎంత వరకూ దృష్టి పెడుతుందో చూడాల్సి ఉంది.