అమృత్ సర్ లో సైరన్ మోగింది, బ్లాక్ అవుట్.. మళ్లీ ఏమైంది?
అవును... భారత్ - పాక్ మధ్య ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా అమృత్ సర్ లో సైరన్ మోగింది.. బ్లాక్ అవుట్ ప్రారంభమైంది.
By: Tupaki Desk | 12 May 2025 11:32 PM ISTపహల్గాం ఉగ్రదాడి (ఏప్రిల్ 22), ఆపరేషన్ సిందూర్ (మే 6, 7) అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే... శనివారం (మే 10)న భారత్ - పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో.. 19 రోజుల తర్వాత (మే 11 రాత్రి) సరిహద్దుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపారని అంటున్నారు.
మరోపక్క తాజాగా ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)ల మధ్య చర్చలు జరిగాయి. మరోపక్క ఆపరేషన్ సిందూర్ సీజ్ ఫైర్ తర్వాత తొలిసారిగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. పాకిస్థాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సమయంలో తాజాగా మరోసారి అమృత్ సర్ లో సైరన్ వినిపించింది. దీంతో విమానం వెనక్కెళ్లిపోయింది.
అవును... భారత్ - పాక్ మధ్య ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా అమృత్ సర్ లో సైరన్ మోగింది.. బ్లాక్ అవుట్ ప్రారంభమైంది. అయితే... ఇది అధికారుల ముందుజాగ్రత్త చర్య మాత్రమే అని అంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు జారీ చేసిన నోటీసుల్లో ఈ కార్యక్రమాలు ముందుజాగ్రత్త చర్యల్లో భాగం మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా... మీరు సైరన్ వింటారు.. బ్లాక్ అవుట్ ప్రారంభిస్తున్నాము.. దయచేసి మీ లైట్లు ఆపివేసి, కిటికీల నుంచి దూరంగా వెళ్లండి.. ప్రశాంతంగా ఉండండి.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేము మీకు తెలియజేస్తాము.. అస్సలు భయపడొద్దు.. ఇది జాగ్రత్తగా ఉండటం కోసమే అని నోటీసులో పేర్కొన్నారు.
అయితే... ఢిల్లీ నుంచి అమృత్ సర్ కు వెళ్తున్న ఇండిగో విమానం బ్లాక్ అవుట్ ప్రారంభమైన సమయంలో వెనక్కి తిరిగి వస్తున్నట్లు 'ఫ్లైట్ ట్రేడర్ 24' లో కనిపించింది! రాత్రి 9:45కి అమృత్ సర్ లో ల్యాండ్ కావాల్సిన విమానం.. తిరిగి ఢిల్లీకి మళ్లించబడింది. దీనిపై అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ స్పందించారు.
ఇందులో భాగంగా... అమృత్ సర్ లో విద్యుత్ అంతరాయం ఉన్నందున విమానాన్ని ఢిల్లీకి మళ్లించామని తెలిపారు. ఇది క్లియర్ అయిన తర్వాత తిరిగి ఢిల్లీ నుంచి రప్పిస్తామని వెళ్లడించారు.
