Begin typing your search above and press return to search.

యూఎస్ కంటే ఇండియానే సేఫ్... ప్రపంచంలో సురక్షితమైన దేశాల జాబితా ఇదే!

ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేక ప్రమాణాల ప్రకారం దేశాల భద్రతను కొలుస్తుంది. వీటిలో నేరం, హింస, తీవ్రవాదం, ప్రపంచ సంఘర్షణ పరిధి కీలకంగా ఉంటాయి

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:30 PM GMT
యూఎస్ కంటే ఇండియానే సేఫ్... ప్రపంచంలో సురక్షితమైన దేశాల జాబితా ఇదే!
X

ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలను గుర్తించడానికి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ నిర్వహించే వార్షిక ర్యాంకింగ్ "ప్రపంచంలో సురక్షితమైన దేశాలు 2023" తాజాగా విడుదలైంది. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేక ప్రమాణాల ప్రకారం దేశాల భద్రతను కొలుస్తుంది. వీటిలో నేరం, హింస, తీవ్రవాదం, ప్రపంచ సంఘర్షణ పరిధి కీలకంగా ఉంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది జాబితాలో ఐస్‌ లాండ్‌ అగ్రస్థానంలో ఉంది.

తర్వాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, సింగపూర్, పోర్చుగల్, స్లోవేనియా, జపాన్, స్విట్జర్లాండ్ లు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ 133 కాగా... అమెరికా కంటే మెరుగ్గా భారత్ 126వ స్థానంలో ఉంది. భారత్ తో పాటు చైనా, సౌదీ అరేబియా, ఎల్ సాల్వడార్, హోండురాస్ దేశాలు యూఎస్ కంటే శాంతియుతంగా పరిగణించబడుతున్నాయి.

ఐస్‌ లాండ్‌:


ఐస్‌ లాండ్ ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన, అత్యంత శాంతియుత దేశాలలో మొదటి స్థానం పొందడం ఇదే మొదటిసారి కాదు. ఇది చాలా కాలంగా ఈ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఐస్‌ లాండ్‌ లో 2008 నుండి నేరాల గణాంకాలు తక్కువగా ఉన్నాయి.

ఈ ఆకట్టుకునే ట్రాక్ రికార్డ్ వెనుక ఉన్న కారణాలలో అధిక జీవన ప్రమాణాలు, తక్కువ జనాభా, నేరాలను అసహ్యించుకునే సంస్కృతి, పోలీసు బలగాలపై లోతైన విశ్వాసం అని చెబుతారు పరిశీలకులు. ఐస్‌ ల్యాండ్ గురించి చెప్పుకోదగిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ దేశానికి మిలిటరీ లేదు! దాని పోలీసు అధికారులు తుపాకీలను కలిగి ఉండరు! బదులుగా లాఠీలు, పెప్పర్ స్ప్రేలపైనే ఆధారపడతారు.

డెన్మార్క్:


డెన్మార్క్ 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ లో 2వ స్థానాన్ని పొందింది. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, సంతోషకరమైన దేశాలలో ఒకటిగా స్థిరపడింది. డెన్మార్క్ ప్రత్యేకత ఏమిటంటే... పిల్లలతో సహా పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా ప్రజలు సురక్షితంగా భావించే ప్రదేశాలలో ఇది ఒకటి కావడం!

ఈ దేశంలో సమానత్వం స్పష్టంగా ఉండగా.. సాంఘిక సంక్షేమం ఉమ్మడి బాధ్యతగా ప్రతీ పౌరుడూ పరిగణిస్తుంటాడు! ఇదే సమయంలో డెన్మార్క్ వ్యాపారం, రాజకీయాలలో అనూహ్యంగా తక్కువ స్థాయి అవినీతిని నిర్వహిస్తుంది! నిజాయితీ, నమ్మకాన్ని నొక్కి చెబుతుంది.

ఐర్లాండ్:


ఈ ర్యాంకింగ్స్ లో 2021 సమయంలో 11 స్థానంలో ఉన్న ఐర్లాండ్... తాజా జాబితాలో 3వ స్థానానికి చేరుకుంది. ఐర్లాండ్‌ లో నేరాల రేట్లు సాధారణంగా తక్కువగా ఉన్నప్పటికీ.. నగర పరిసరాల్లో అప్రమత్తంగా ఉండటం ఇక్కడ లెక్క. వాస్తవానికి ఇక్కడ పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలు, నామమాత్రపు నేరాల రేటు, దాదాపుగా ఉనికిలో లేని ఉగ్రవాదం ఈ ర్యాంకి కారణం అని చెప్పొచ్చు.

న్యూజిలాండ్:


ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచింది. పైన చెప్పుకున్న దేశాల మాదిరిగానే న్యూజిలాండ్ చాలా తక్కువ నేరాల రేటును కలిగి ఉంది. పర్యాటకులు అధికంగా ఉండే ప్రాంతాల్లో చిన్న దొంగతనాలు మినహా... హింసాత్మక నేరాలకు ఇక్కడ చాలా వరకూ చోటులేదని అంటారు!

ఇదే క్రమంలో... న్యూజిలాండ్ వాసులు ఓపెన్ మైండెడ్‌ గా ఉంటారని చెబుతారు. ఇదే సమయంలో ఇక్కడి చట్టాలు వాక్ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణను పరిరక్షిస్తాయని అంటారు. మరో విషయం ఏమిటంటే... ఐస్‌ లాండ్ మాదిరిగానే, న్యూజిలాండ్‌ లోని పోలీసులు కూడా వ్యక్తిగత తుపాకీలను కలిగి ఉండరు.

ఆస్ట్రియా:


2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ లో ఆస్ట్రియా ఐదవ స్థానాన్ని సాధించింది. ఈ దేశం సాధారణంగా శాంతియుతంగా ఉంటుంది. స్థానికంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు హింసాత్మక ప్రదర్శనలు అరుదుగా జరుగుతాయి. ఇదే సమయంలో తీవ్రమైన నేరాలు కూడా ఇక్కడ చాలా అరుదుగా జరుగుతాయి.

కానీ... ప్రపంచంలోని చాలా చోట్ల జరుగుతునట్లుగానే జేబు దొంగలు, చైన్ స్నాచర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి! ఇదే సమయంలో ఆస్ట్రియా ఇటీవలి సంవత్సరాలలో తీవ్రవాద చర్యలతో ఇబ్బంది పడలేదు. అందుకే ఇది వన్ ఆఫ్ ది సేఫ్ కంట్రీ!

సింగపూర్:


2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్‌ లో సింగపూర్ ఆరో స్థానాన్ని ఆక్రమించింది. ఈ దేశంలో చట్టాన్ని పక్కాగా అమలుచేస్తారని చెబుతారు. ఇదే సమయంలో చిన్న చిన్న నేరాలు అనుకునేవాటికి సైతం తీవ్రమైన శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని అంటుంటారు. ఈ దేశం ప్రశాంతం గా ఉండటానికి ఇవి కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

పోర్చుగల్:


అత్యంత శాంతియుతమైన దేశాల్లో పోర్చుగల్ ఏడవ స్థానంలో ఉంది. ఈ దేశంలో సాయుధ పోలీసులు ఉన్నప్పటికీ.. పెరిగిన పోలీసు ఉనికి కారణంగా నేరాల రేటు బాగా తగ్గింది. పోర్చుగల్ ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక పునరుద్దరణను కూడా చూసింది. ఫలితంగా... అక్కడ్ద నిరుద్యోగుల రేటును 17% నుండి 7శాతానికి తగ్గించుకుంది.

స్లోవేనియా:


శాంతియుతమైన దేశాల్లో ఎనిమిదోస్థానంలో ఉన్న స్లోవేనియా... ఒకప్పటి యుగోస్లేవియన్ భాగం! ప్రయాణ భద్రత, రహదారి భద్రతలో అధిక భద్రతా రేటింగ్‌ లతో ఈ దేశం ఆకట్టుకుంది. స్లోవేనియా సాధారణంగా ప్రయాణానికి చాలా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇదే సమయంలో ఒంటరి మహిళా ప్రయాణికులకు ఈ దేశం సురక్షితమైన గమ్యస్థానంగా పరిగణించబడుతుంది.

జపాన్:


ప్రస్తుతం ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న జపాన్... 14 సంవత్సరాలుగా వరుసగా టాప్ టెన్‌ లో కొనసాగుతుంది. జపాన్ లో తక్కువ నేరాల రేట్లు, అతితక్కువ అంతర్గత సంఘర్షణ, అరుదైన రాజకీయ అశాంతితో ప్రశంసించబడింది. ప్రధానంగా ప్రజలు మళ్లీ సందర్శించాలనుకునే నంబర్ 1 నగరంగా టోక్యో ఉండటంతో.. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ ట్రావెల్ గమ్యస్థానాలలో జపాన్ కూడా ఒకటిగా ఉంది.

స్విట్జర్లాండ్:


శాంతియుతమైన దేశాల్లో టాప్ 10లో ఉన్న మరోదేశం స్విట్జర్లాండ్. 2017లో టాప్ యూరోపియన్ రోడ్ సేఫ్టీ అవార్డును స్విట్జర్లాండ్ గెలుచుకుంది. స్విట్జర్లాండ్ నేరాలు తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన, ప్రజాస్వామ్య దేశం కూడా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ప్రకృతి వైపరీత్యాలు అత్యంత అరుదుగా జరుగుతాయి.

ఇలా అనిశ్చితితో నిండిన ఈ ప్రపంచంలో, ఈ పది దేశాలు శాతిభద్రతలకు దీపస్తంభాలుగా నిలుస్తున్నాయి. అందుకే వీటిని ప్రయాణికులు, సంభావ్య నివాసితులకు ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఈ దేశాలు గాఢమైన భద్రతను అందిస్తాయి.. శాంతే శాశ్వతంగా ఉంటుందని గుర్తుచేస్తుంటాయి!