Begin typing your search above and press return to search.

తెలుగు టాప్ ట్రావెలర్లకు యూట్యూబ్ లో ఏమైంది?

ఇక సోషల్ మీడియా వచ్చాక ట్రావెలర్లు తమతమ పర్యటనల వివరాలను సొంత చానెళ్లలో పోస్ట్ చేస్తూ అభిమానులను 'సంపాదించుకుంటున్నారు.'

By:  Tupaki Desk   |   29 Jan 2024 5:30 PM GMT
తెలుగు టాప్ ట్రావెలర్లకు యూట్యూబ్ లో ఏమైంది?
X

ట్రావెలింగ్ అనేది ఒక వరం. అత్యంత గొప్ప అభిరుచి.. కొత్త ప్రాంతాలకు వెళ్లడం.. అక్కడి పరిస్థితులను పరిశీలించడం.. మనుషులతో కలవడం.. ఇదంతా ఓ అనుభూతి. అయితే, ఇది అందరికీ కుదరదు. మరీ ముఖ్యంగా శరీరం సహకరించాలి.. ఏ ప్రాంతంలో దొరికే ఫుడ్ ను అయినా తినగలగాలి.. వాతావరణాన్ని తట్టుకోగలగాలి.. అన్నిటికీ మించి సరైన ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యం. ఇక సోషల్ మీడియా వచ్చాక ట్రావెలర్లు తమతమ పర్యటనల వివరాలను సొంత చానెళ్లలో పోస్ట్ చేస్తూ అభిమానులను 'సంపాదించుకుంటున్నారు.'

ట్రావెలింగ్ లో తోపులు వీరే..

విశాఖపట్టణం జిల్లాకు చెందిన అవినాశ్ టాప్ తెలుగు ట్రావెలర్లలో ఒకడని చెప్పాలి. ''నా అన్వేషణ'' పేరిట ఇతడు ప్రపంచ యాత్ర సాగిస్తున్నాడు. ఈయన చానెల్ కు దాదాపు 20 లక్షలమంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. నికరంగా చెప్పాలంటే 1.94 లక్షలు. ఈయన చేసే ఒక్కో వీడియోకు 5 లక్షల వ్యూస్ వస్తాయి. కాగా.. ప్రపంచ యాత్ర పేరిట మొన్నటివరకు హడావుడి చేసిన అవినాశ్ మూడు వారాలుగా ఒక్కటే వీడియో పోస్ట్ చేశాడు. అది కూడా ఈ ఆదివారమే కావడం గమనార్హం. వీడియో కూడా పాతదాని లాగానే కనిపిస్తోంది. అవినాశ్ చివరగా థాయ్ లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అంతకుముందు గల్ఫ్ దేశాల్లో పర్యటించాడు. కాగా.. ఈ మధ్యనే అతడు యూట్యూబ్ ఆపేస్తున్నాను అంటూ వీడియో విడుదల చేసి సంచలనం రేపాడు. ఓ దశలో నెలకు కోటి రూపాయలను యూట్యూబ్ ద్వారా సంపాదించిన అవినాశ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా? అని అందరూ చర్చించుకున్నాడు. అయితే, తదుపరి యాత్ర గురించి శనివారం ఓ వీడియో విడుదల చేశాడు. మొత్తమ్మీద 20 రోజుల తర్వాత వీడియోను పెట్టిన అతడు.. ఇకపై తాను ప్రపంచ యాత్రను పున: ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కాంబోడియాలో ఉన్నాడు.

రవి ట్రావెలర్ పూర్తిగా డౌన్..

తెలుగు ట్రావెలర్లలో అత్యంత ఖరీదైన ట్రావెలర్ ఎవరంటే రవి ప్రభు అనిచెప్పాలి. 27 ఏళ్ల కిందటనే అమెరికా వెళ్లి.. అక్కడే స్థిరపడి.. ఆ దేశ పౌరసత్వమూ పొందిన రవి.. ఉన్నత ఉద్యోగమూ చేశారు. అయితే, ఏడాది కిందట ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 190కి పైగా దేశాలు చుట్టొచ్చానని చెప్పే రవి ప్రభు.. చివరగా పాకిస్థాన్ వెళ్లారు. అది కూడా భారత దేశం వచ్చి పాక్ కు వెళ్లారు. ఆ దేశంలో చేసిన టూర్ కు సంబంధించిన వీడియోలు కూడా వెంటవెంటనే కాకుండా అప్పుడొకటి ఇప్పుడొకటి పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఏడాదిన్నర కిందట నా అన్వేషణతో వివాదం నేపథ్యంలో రవి ప్రభు చానెల్ కు ఆదరణ తగ్గింది. రవి.. మల్టీ నెట్ వర్క్ చానెల్ లో ఉన్నాడని, చెప్పినన్ని దేశాలు తిరగలేదని ఇంకా అనేక ఆరోపణలు చేశాడు అన్వేష్. దీంతో రవి చానెల్ కు వ్యూస్ తగ్గాయి. చాలాకాలం కిందట 6 లక్షల సబ్ స్రైరబర్లు దాటినా.. అక్కడినుంచి పెరుగుదల బాగా తగ్గింది. ప్రస్తుతం 7.39 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. గత ఏడాది ఇండియాకు ఏకంగా 8-9 సార్లు వచ్చారు రవి. చివరగా.. రెండు రోజుల కిందట కాశీ మసీదు గురించి చేసిన వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం పాక్ లో ఉన్నారా? లేక అమెరికా వెళ్లిపోయారా? అనేది తెలియడం లేదు.

ఉమ మళ్లీ మొదలుపెట్టాడు..

తెలుగు ట్రావెలర్లలో మరో ప్రముఖ పేరు ఉమా తెలుగు ట్రావెలర్. ఆఫ్రికా దేశం మాలిలో చిన్న ఉద్యోగం చేసిన అతడు.. ట్రావెలర్ గా మారాడు. తనదైన శైలిలో వీడియోలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. 9.70 లక్షల మంది సబ్ స్క్రైబర్లను పొందాడు. చివరగా రష్యాలోని అత్యంత చల్లటి ప్రాంతమైన యక్ టక్ కు వెళ్లాడు ఉమా. -64 డిగ్రీల అత్యంత చల్లటి వాతావరణంలో పర్యటించి ప్రత్యేకత చాటాడు. అయితే, కను రెప్పలు కూడా గడ్డకట్టేంత చలిలో.. ఐస్ బాత్ కూడా చేశాడు. ఆ సందర్భంగానే కొంత అస్వస్థతకూ గురయ్యాడు. వెంటనే స్వదేశానికి తిరిగొచ్చాడు. ఇదంతా జరిగి అటు ఇటు నెల అయింది. అప్పటినుంచి మరే దేశ పర్యటనకూ అతడు వెళ్లలేదు. తాజాగా రెండు రోజుల కిందట బంగ్లాదేశ్ టూర్ మొదలుపెట్టాడు. గతంలో రవి ప్రభుతో పాటే ఉమా తెలుగు ట్రావెలర్ నూ అన్వేష్ లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ సమయంలో ఉమా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

కాగా, రాజారెడ్డి యూట్యూబ్ లో తొలి తెలుగు ట్రావెలర్ అని చెప్పొచ్చు. ఆయనది తెలుగు ట్రావెలర్ చానెల్. శని, ఆదివారాల్లో బడ్జెట్ టూర్ లు చేస్తుంటారు. అన్వేష్ కు స్ఫూర్తి రాజారెడ్డినే. అయితే, రాజారెడ్డికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవు. మొత్తానికి కొత్త ఏడాదిలో టాప్ తెలుగు ట్రావెలర్లు పూర్తిగా వెనుకబడ్డారు. మరి ఇకనుంచైనా వారి నుంచి కొత్త వీడియోలు వస్తాయని ఆశిద్దాం.