Begin typing your search above and press return to search.

కనుమరోజున ప్రయాణాలు వద్దంటారు.. ఎందుకో తెలుసా?

వాస్తవానికి కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని పెద్దలు పెట్టిన ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది! పూర్వం ఎక్కువగా ప్రయాణాలకు ఎడ్ల బండ్లే ఉపయోగించేవారనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jan 2024 6:13 AM GMT
కనుమరోజున ప్రయాణాలు వద్దంటారు.. ఎందుకో తెలుసా?
X

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతిని పెద్ద పండగగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఏ మూళన ఉన్నా ఈ పండక్కి సొంత ఊరికి రావాలని భావిస్తుంటారు. అలాకానిపక్షంలో.. ఉన్న చోటే సంక్రాంతి శోభను ముగ్గులతో, సంబరాలతో తెచ్చుకుంటారు. ఇలా మూడు రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండగ సమయంలో తొలి రోజు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి, రెండో రోజు పితృదేవతలను పూజించే సంక్రాంతి కాగా.. మూడో రోజు కనుమ.

ఈ మూడోరోజు పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని పాడి పశువుల పండగగా చెబుతారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ఎంతగానో సహాయపడిన పశువులకు ఈరోజున రైతులు కృతజ్ఞత తెలుపుకొంటారు. అయితే, "కనుమ రోజున కాకులు కూడా కదలవు" అనే సామెతను గుర్తు చేస్తూ ఆ రోజు ప్రయాణాలు చేయొద్దని చెబుతుంటారు. అది ఎందుకనేది ఇప్పుడు చూద్దాం...!

వాస్తవానికి కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని పెద్దలు పెట్టిన ఆచారం వెనుక ఓ గొప్ప ఔన్నత్యమే దాగి ఉంది! పూర్వం ఎక్కువగా ప్రయాణాలకు ఎడ్ల బండ్లే ఉపయోగించేవారనే సంగతి తెలిసిందే. అయితే... ఏడాదిపాటు రైతుకి పొలంలోనూ, ప్రయాణాల్లోనూ తోడుగా ఉండే ఎడ్లను కనుమ రోజున పూజలు చేస్తారు. అందువల్ల ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉంచాలనే భావనతో బళ్లు కట్టకుండా ఉండేందుకు అసలు కనుమరోజున ప్రయాణమే వద్దని చెప్పేవారు.

కాగా... కనుమను పల్లెల్లో వైభవంగా జరుపుకొంటారనేది తెలిసిన విషయమే. రైతు కుటుంబాలకు సుఖ సంతోషాలను, పంటలను అందించేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఈ మూగ జీవాలు పోషిస్తున్న పాత్రను రైతులు ఒక పండగలా జరుపుతారు. అందులో భాగంగా కనుమ రోజు నదీ తీరాలు, చెరువుల వద్దకు పశువులను తీసుకెళ్లి స్నానం చేయించిన తర్వాత నుదట పసుపు, కుంకుమ దిద్దుతారు. ఆ విధంగా పశువుల పట్ల కృతజ్ఞతగా కనుమ రోజున వాటికి విశ్రాంతి ఇచ్చి పూజించుకుంటారు.