Begin typing your search above and press return to search.

ఏమిటీ అమృత్ భారత్ రైళ్లు.. వీటి ప్రత్యేకత ఏమిటి?

"అమృత్ భారత్" పేరుతో కొత్తగా తెస్తున్న ఈ రైళ్ల ప్రత్యేకత ఏమిటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ వెర్షన్ మొదటి రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 5:00 AM GMT
ఏమిటీ అమృత్ భారత్ రైళ్లు.. వీటి ప్రత్యేకత ఏమిటి?
X

ప్రతి ఏడాది కొత్త రైళ్లను పట్టాల మీదకు పరుగులు తీయించే గత ప్రభుత్వాలకు భిన్నంగా.. గడిచిన తొమ్మిదిన్నరేళ్ల మోడీ పాలనలో రైల్వేలు కొత్త తరహాలో అడుగులు వేయటం తెలిసిందే. ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా కొత్త తరహా రైళ్లను పరుగులు తీయించటం తెలిసిందే. వందే భారత్ రైళ్లు నిలువెత్తునిదర్శనంగా చెప్పాలి. రైల్వేల రూపురేఖల్ని మార్చేసే ఈ ఎత్తుగడలో భాగంగా.. 'వందే భారత్' పేరుతో కొత్త రైళ్లను తెర మీదకు తీసుకురావటం.. వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కొక్కటిగా ఓపెనింగ్ చేయటం తెలిసిందే. గతంలో ఏదైనా కొత్త రైళ్లకు సంబంధించిన తొలి రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తే.. మిగిలినవి ఆటోమేటిక్ గా పట్టాల మీదకు ఎక్కేవి.

మోడీ సర్కారు ఎప్పుడైతే కొలువు తీరిందో.. అప్పటి నుంచి రైల్వేలకు సంబంధించి ప్రత్యేకమైన విజన్ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందే భారత్ పేరుతో తీసుకొచ్చిన ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్ల కారణంగా మరింత వేగంగా పరుగుతు తీయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా మరో కొత్త వెర్షన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర సర్కారు. "అమృత్ భారత్" పేరుతో కొత్తగా తెస్తున్న ఈ రైళ్ల ప్రత్యేకత ఏమిటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ వెర్షన్ మొదటి రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు.

ఈ రైలు పుణ్యమా అని.. శ్రీరాముని జన్మభూమి అయోధ్యతో సీతామాత పుట్టిన ప్రాంతమైన సీతామర్షి అనుసంధానం చేసేలా ఈ కొత్త వెర్షన్ రైలును తెర మీదకు తీసుకొచ్చారు. ఈ ప్రత్యేక రైలు అయోధ్యలో రామాలయ ప్రారంభానికి ముందే పట్టాల మీదకు వస్తోంది. ఈ నెల 30న అయోధ్యలో శ్రీరామ్ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. అనంతరం అయోధ్య జంక్షన్ లో నిర్మించిన కొత్త బిల్డింగ్ ను ప్రారంభించటమే కాదు.. అయోధ్య నుంచి ఢిల్లీకి నడిచేలా రెండు రైళ్లను ప్రారంభించనున్నారు.

ఈసారి అమృత్ భారత్ పేరుతో తీసుకొస్తున్న కొత్త రైలులో రెండు వైపులా ఇంజిన్లు ఉండటమే కాదు.. రైలు మొత్తం నాన్ ఏసీగా రూపొందించారు. అయితే.. జనరల్ సీట్లతో పాటు.. రిజర్వుడ్ సిట్టింగ్.. స్లీపర్ బోగీలు ఉండనున్నాయి. ఈ రైలుకు 22 బోగీల్ని ఏర్పాటు చేస్తారు. దేశంలోని వివిధ నగరాలకు కలుపుతూ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రయత్నంగా చెబుతున్నారు. కీలకమైన ఎన్నికల వేళ పట్టాలు ఎక్కే ఈ రైళ్లు ఓటర్లను విపరీతంగా ఆకర్షించేలా ఉండటం గమనార్హం. ఎక్కువగా వర్కింగ్ క్లాస్ వారికి భారం లేకుండా ఉండేలా ఈ రైళ్లను ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు ముందే కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల మధ్య ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. సానుకూలత ఏర్పడుతుందన్నమాట వినిపిస్తోంది.

మోడీ చేతుల మీదుగా రెండు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లను అందుబాటులోకి తీసుకురావటంతో పాటు.. మరో ఆరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లుగా చెబుతున్నారు. మొత్తం 22 బోగీల్లో 12 సెకండ్ క్లాస్ త్రీ టైర్ స్లపర్ కాగా.. ఎనిమిది బోగీలు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు.. గార్డులకు రరెండు కంపార్ట్ మెంట్లు ఉంటాయి. ఈ రైళ్లు గరిష్ఠంగా గంటకు 130 కి.మీ వేగంగా ప్రయాణిస్తాయని తేల్చారు. అయితే.. ఈ రైళ్లకు టికెట్ ధరల మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వందే భారత్ మాదిరి కాకుండా సామాన్య ప్రజలు ఈ కొత్త రైళ్లలో ప్రయాణించేందుకు వీలుగా టికెట్ ధరలు ఉంటాయా? లేదా? అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది.